2, సెప్టెంబర్ 2020, బుధవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*



*అష్టమ స్కంధము - ఇరువదియవ అధ్యాయము*

*వామనుడు విరాట్ రూపమున రెండడుగులతో పృథ్విని, స్వర్గమును ఆక్రమించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*20.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*హృద్యంగ ధర్మం స్తనయోర్మురారేః ఋతం చ సత్యం మనస్యథేందుమ్|*

*శ్రియం చ వక్షస్యరవిందహస్తాం కంఠే చ సామాని సమస్తరేఫాన్॥7085॥*

*20.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*ఇంద్రప్రధానానమరాన్ భుజేషు తత్కర్ణయోః కకుభో ద్యౌశ్చ మూర్ధ్న|*

*కేశేషు మేఘాన్ శ్వసనం నాసికాయామక్ష్ణోశ్చ సూర్యం వదనే చ వహ్నిమ్॥7086॥*

మహారాజా! ఇంకను ఆ మురారి హృదయము నందు ధర్మమును, స్తనముల యందు అర్థయుక్తమైన వేద వచనములను, మనస్సునందు చంద్రుని, వక్షస్థలముపై పద్మహస్తయైన లక్ష్మీదేవిని, కంఠమున సామవేదమును ఇంకను శబ్ద సమూహమును తిలకించెను. ఆ విరాడ్రూపుని బాహువులయందు ఇంద్రాది దేవతలు, చెవులయందు దిక్కులు, శిరమునందు స్వర్గము, కేశములయంధు మేఘములు, నాసికయందు వాయువు, నేత్రములయందు సూర్యుడు, వదనమునందు అగ్ని కనబడిరి.

*20.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*వాణ్యాం చ ఛందాంసి రసే జలేశం భ్రువోర్నిషేధం చ విధిం చ పక్ష్మసు|*

*అహశ్చ రాత్రిం చ పరస్య పుంసో మన్యుం లలాటేఽధర ఏవ లోభమ్॥7087॥*

బలి ఆ విరాట్ పురుషుని వాక్కు నందు వేదములను, నాలుకయందు వరుణుని, కనుబొమలయందు విధినిషేధములను, కంటి రెప్పలయందు రాత్రింబవళ్ళును, లలాటము నందు క్రోధమును, అధరమునందు లోభమును దర్శించెను.

*20.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*స్పర్శే చ కామం నృప రేతసోఽమ్భః పృష్ఠే త్వధర్మం క్రమణేషు యజ్ఞమ్|*

*ఛాయాసు మృత్యుం హసితే చ మాయాం తనూరుహేష్వోషధిజాతయశ్చ॥7088॥*

రాజా! ఆ పరమ పురుషుని స్పర్శయందు కామము, వీర్యమునందు జలము, వీపున అధర్మము, పదవిన్యాసముల యందు యజ్ఞము, ఛాయ యందు మృత్యువు, నవ్వు నందు మాయ, శరీరము యొక్క రోమముల యందు పలువిధములైన ఓషధులు విరాజిల్లు చుండెను.

*20.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*

*నదీశ్చ నాడీషు శిలా నఖేషు బుద్ధావజం దేవగణాన్ ఋషీంశ్చ|*

*ప్రాణేషు గాత్రే స్థిరజంగమాని సర్వాణి భూతాని దదర్శ వీరః॥7089॥*

వీరుడైన బలిచక్రవర్తి ఆ పురుషోత్తముని నాడులయందు నదులను, నఖముల యందు శిలలను, బుద్ధి యందు బ్రహ్మాది దేవతలను, ఋషులను తిలకించెను. ఈ విధముగా బలిచక్రవర్తి భగవంతుని ఇంద్రియముల యందును, శరీరమునందును సకల చరాచర ప్రాణులను దర్శించెను.

*20.30 (ముప్పదియవ శ్లోకము)*

*సర్వాత్మనీదం భువనం నిరీక్ష్య సర్వేఽసురాః కశ్మలమాపురంగ|*

*సుదర్శనం చక్రమసహ్యతేజో ధనుశ్చ శార్ఙ్గం స్తనయిత్నుఘోషమ్॥7090॥*

*20.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*

*పర్జన్యఘోషో జలజః పాంచజన్యః కౌమోదకీ విష్ణుగదా తరస్వినీ|*

*విద్యాధరోఽసిః శతచంద్రయుక్తస్తూణోత్తమావక్షయసాయకౌ చ॥7091॥*

పరీక్షిన్మహారాజా! సర్వాత్ముడైన భగవంతుని యందు సంపూర్ణజగత్తును చూచి, అసురులు అందరును మిగుల భయగ్రస్తులైరి. ఆ సమయమున ఆ పురుషోత్తముడు తేజోమయమైన సుదర్శన చక్రమును, పిడుగువలె భయంకర టంకారధ్వనులను చేయుచున్న శార్ఙ్ ధనుస్సును, మేఘగంభీర శబ్దములను, పాంచజన్యశంఖమును, అత్యంత వేగముగల కౌమోదకీ గదను, నూరు చంద్రాకారచిహ్నములుగల డాలును, విద్యాధరము (నందకము) అనెడి ఖడ్గమును, అక్షయశరములతో నిండిన రెండు తూణీరములను ధరించియుండెను.

*20.32 (ముప్పది రెండవ శ్లోకము)*

*సునందముఖ్యా ఉపతస్థురీశం పార్షదముఖ్యాః సహలోకపాలాః|*

*స్ఫురత్కిరీటాంగదమీనకుండలశ్రీవత్సరత్నోత్తమమేఖలాంబరైః॥7092॥*

లోకపాలురు, సునందాది పార్షదులు, ఆ స్వామిని సేవించుచుండిరి. ఆ ప్రభువు శిరస్సున కిరీటము, వక్షఃస్థలమునందు శ్రీవత్స చిహ్నము,, బాహువులయందు భుజకీర్తులు, చెవులయందు మకర కుండలములు, కంఠమున కౌస్తుభమణి, నడుమున కటిసూత్రము,శరీరముపైన పట్టుపీతాంబరము శోభాయమానముగా ఒప్పుచుండెను.

*20.33 (ముప్పది మూడవ శ్లోకము)*

*మధువ్రతస్రగ్వనమాలయా వృతో రరాజ రాజన్ భగవానురుక్రమః|*

*క్షితిం పదైకేన బలేర్విచక్రమే నభః శరీరేణ దిశశ్చ బాహుభిః॥7093॥*

*20.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*

*పదం ద్వితీయం క్రమతస్త్రివిష్టపం న వై తృతీయాయ తదీయమణ్వపి|*

*ఉరుక్రమస్యాంఘ్రిరుపర్యుపర్యథో మహర్జనాభ్యాం తపసః పరం గతః॥7094॥*

ఐదు విధములైన పుష్పమాలతో గూర్చిన వనమాలను ఆ ప్రభువు ధరించియుండెను. తుమ్మెదలు వాటిపై చేరి ఝంకారములు చేయుచుండెను. త్రివిక్రముడైన ఆ భగవానుడు తన ఒక పాదముతో పృథ్విని ఆక్రమించెను. శరీరముచే ఆకాశమును, భుజములచే దిక్కులను ఆక్రమించెను. రెండవ పాదముతో ఆ ప్రభువు స్వర్గమును ఆక్రమించెను. అది ఊర్ధ్వలోకములకు వెళ్ళుచు మహర్లోకమును, జనోలోకమును, తపోలోకమును అతిక్రమించి సత్యలోకము చేరెను. మూడవ పాదమును ఉంచుటకు బలిచక్రవర్థి యొద్ద అణుమాత్రము నేలగూడ లేకుండెను.

*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే వింశోఽధ్యాయః (20)*

ఇది భాగవత మహాపురాణమునందలి అష్టమ స్కంధమునందు ఇరువదియవ అధ్యాయము (20)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: