🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️
శమంతకోపాఖ్యానం:-2
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
#గణపతి #గణపతివైభవం #వినాయకుడు #వినాయకచవితి
నిన్నటి కధకు కొనసాగింపు:
శ్రీ కృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్దికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రశేనునికి ఇప్పింప సంకల్పించెను.
అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తనతమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై ఆరణ్యమునకు వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణముగ ప్రసేనుడు అశౌచమును పొందెను.
ఆ కారణముచే ప్రసేనుడు సింహము చేతిలో మరణించెను. ఆ సింహమును జాంబవంతుడను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలో నున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీ కృష్ణుడు కూడా వెంట వెళ్ళెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై వెదుకుచూ శ్రీ కృష్ణుడు తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీ కృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీ కృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణినపహరించెనని సత్రాజిత్తు, పౌరులు, భావించిరి. అంతట ఆ అపవాదును బాపుకొనుటకై, శ్రీకృష్ణుడు మరునాడు, అడవిలో శోధింపగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను, దానిని ప్రసేనుని గుర్రమును ఏదో కూృరమృగము చంపి ఉండునని కృష్ణుడు భావించెను. అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయి, ఒక సింహపు పాదముద్రలు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు. రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.
ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీ కృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను. కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యింతి ఊయలలో పరున్న బాలుని ఊపుచుండెను. ఊయల పై ఆట వస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ లలనయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీ కృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భీతిచెంది, పాటపాడుచున్న దాని వలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.
శ్లో॥ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః!
సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః!!
తా॥ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా!
ఈ మణి నీకే ఏడవకుము.
అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై శ్రీ కృష్ణుడు వచ్చెనని శంకించి, ద్వంద యుద్దమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబంవంతునకు రాముని ఆలింగనమొనర్చుక ొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్దమొనర్చెను.
క్రమముగా జాంబవంతుని బలము తగ్గి కృష్ణుడే రాముడని తెలిసికొని ఆయన పాదములపై పడి ప్రార్థించి శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను. ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను.
అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొని శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన సత్యాభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను..కొనసాగింపు తరువాత పోస్టు లో
సశేషం
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం
జై శ్రీమన్నారాయణ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి