శ్రీరామ అనే అక్షరం చుట్టనిదే మనకు ఏదీ ఆరంభం కాదు.. అతులిత మధురం రామ నామము.. శ్రీమన్నారాయణ మంత్రములో "రా" జీవమును, శివ పంచాక్షరి మంత్రములోని "మ" జీవాన్ని కలిపి రామ అనే నామముతో దశరథ సుతాగ్రజునికి నామకరణం చేసారు వశిష్ఠ మహర్షుల వారు. సృష్టిలోని తీయందనము, దివ్యత్వము అంతా కలిపి ఆ దివ్యనామములోనే ఉందేమో .. రామా అన్న చాలు హరియించును సర్వ పాతకములు . జన్మ జన్మల లోని దోషాలన్నీ హరించి పోతాయి ఈ నామ సంకీర్తనము ద్వారా .. అందుకే మన కంచెర్ల గోపన్న గారు " ఓ రామ నీ నామ మెంత రుచిరా " అని పాడి రామదాసు అయిపోయారు .. ఎందరో మహా భక్తులు రామ నమ మహితాత్మక శక్తి చేత ధన్యులయ్యారు . రాతిని నాతిని చేసిన పరమ పావనమీ దివ్య నామము .కరకు బోయ తిరగేసి పలికితే కవిగా చేసిన నామమీ దివ్య నామమని మన ఆరుద్ర వారు చెబుతారు .
ఓ రోజు ఓ గురువు గారు తన శిష్యులకు విష్ణు సహస్ర నామ ఫలితం గూర్చి చెబుతున్నారు .. అందులో చివరన వచ్చు "శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే || సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే || " ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితము లభించునని పలికెను .
అది విన్న ఒక శిష్యుడు గురువర్యా ! ఒక్క రామ అనే నామము మూడు మార్లు పలికినంత మాత్రం శ్రీహరి వేయి నామాలు పఠించిన పుణ్యం ఎలా లభించునని అడుగగా తెలివైన ఆ గురువు ఈ విధముగా సెలవిచ్చెను .
శిష్యా .. రామ నామము దివ్యంబైనది .. అది వేయి నామాలకు ఎలా సమానమో చెబుతాను వినుము . "రామ " అనే నామములోని రెండక్షరాలు .. సంస్కృతంబున హల్లులు అయిన " య , ర , ల , వ , స " లలో " ర " రెండవ అక్షరము . అలాగే సంస్కృత హల్లులు లోని " ప ,ఫ , బ , భ , మ " లలో " మ " అయిదవ అక్షరము .
ర -2 మ 5 వీటిని గుణిస్తే వచ్చే ఫలితం 10
అలా ముమ్మారు రామ నామము ను పలకడం వల్ల వచ్చే ఫలితం 2X5X2X5X2X5 = 1000
ఎవరికైతే విష్ణుసహస్రనామ పారాయణము చేయడానికి ఒడలు, మనస్సు, సమయము సహకరించదో అట్టి వారికి రామ నామము ముమ్మారు జపించిన ఫలితం వల్ల విష్ణుసహస్రనామ పారాయణ ఫలితం లభించునని ఆ గురువు గారు సెలవిచ్చెను.ఆ వివరణ విన్న ఆ శిష్యుడు తన సందేహము విడచి ఆనందముతో విష్ణుసహస్రనామ పారాయణము గావించుతూ తరించెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి