2, సెప్టెంబర్ 2020, బుధవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం



*అష్టమ స్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*

*శ్రీమహావిష్ణువు బలిని పాశములచే బంధించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*శ్రీశుక ఉవాచ*

*21.1 (ప్రథమ శ్లోకము)*

*సత్యం సమీక్ష్యాబ్జభవో నఖేందుభిర్హతస్వధామద్యుతిరావృతోఽభ్యగాత్|*

*మరీచిమిశ్రా ఋషయో బృహద్వ్రతాః సనందనాద్యా నరదేవ యోగినః॥7095॥*

*శ్రీశుకుడు నుడివెను* భగవంతుని పాదపద్మము సత్యలోకమునకు చేరెను. దాని నఖకాంతిచే సత్యలోకము యొక్క ప్రకాశము వెలవెలబోయెను. బ్రహ్మదేవుడు మరీచి మొదలగు ఋషులతో, సనందనుడు మున్నగు నైష్ఠిక బ్రహ్మచారులతో, ఇంకను మహాయోగులతో గూడి ఎదురేగిరి.

*21.2 (రెండవ శ్లోకము)*

*వేదోపవేదా నియమాన్వితా యమాస్తర్కేతిహాసాంగపురాణసంహితాః|*

*యే చాపరే యోగసమీరదీపితజ్ఞానాగ్నినా రంధితకర్మకల్మషాః|*

*వవందిరే యత్స్మరణానుభావతః స్వాయంభువం ధామ గతా అకర్మకమ్|*

వేదములు, ఉపవేదములు, యమనియమములు, తర్కము, పురాణఇతిహాసములు, వేదవేదాంగములు మున్నగునవి అన్నియును మూర్తిమంతములై బ్రహ్మలోకము నందు నివసించుచుండెను. కొందరు యోగాగ్నిచే తమ కర్మల మాలిన్యములను భస్మమొనర్చి యుండిరి. వారు అందరు భగవంతుని పాదమునకు నమస్కరించుచుండిరి. ఆ పాదపద్మస్మరణచే తమ కర్మఫలమునుండి విముక్తులై బ్రహ్మలోకమునకు చేరిరి.

*21.3 (మూడవ శ్లోకము)*

*అథాంఘ్రయే ప్రోన్నమితాయ విష్ణోరుపాహరత్పద్మభవోఽర్హణోదకమ్|*

*సమర్చ్య భక్త్యాభ్యగృణాచ్ఛుచిశ్రవా యన్నాభిపంకేరుహసంభవః స్వయమ్॥7097॥*

శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలము నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని కీర్తి పవిత్రమైనది. విరాట్ పురుషుని పాదమును బ్రహ్మదేవుడు అర్ఘ్య పాద్యాదులచే పూజించి, కడిగెను. పిమ్మట భక్తితో స్తుతించెను.

*21.4 (నాలుగవ శ్లోకము)*

*ధాతుః కమండలుజలం తదురుక్రమస్య పాదావనేజనపవిత్రతయా నరేంద్ర|*

*స్వర్ధున్యభూన్నభసి సా పతతీ నిమార్ష్టి లోకత్రయం భగవతో విశదేవ కీర్తిః॥7098॥*

మహారాజా! బ్రహ్మదేవుని కమండలము నందలి జలములు విశ్వరూపుని పాదప్రక్షాళనమొనర్చి మిగుల పునీతములయ్యెను. ఆ జలములే గంగానదియై ఆకాశమార్గమున భూమిపై బడి, ఆ పరమాత్ముని ఉజ్వలమైన పవిత్ర కీర్తివలె ముల్లోకములను పునీతము చేయుచున్నది.

*21.5 (ఐదవ శ్లోకము)*

*బ్రహ్మాదయో లోకనాథాః స్వనాథాయ సమాదృతాః|*

*సానుగా బలిమాజహ్రుః సంక్షిప్తాత్మవిభూతయే॥7099॥*

శ్రీహరి తన విరాడ్రూపమును ఉపసంహరించుకొని మరల వామనుడాయెను. అప్పుడు బ్రహ్మదేవుడు మొదలగు లోకపాలురు, వారి అనుచరులు సాదరముగా ఆ స్వామిని పూజించి, పెక్కు కానుకలను సమర్పించిరి.

*21.6 (ఆరవ శ్లోకము)*

*తోయైః సమర్హణైః స్రగ్భిర్దివ్యగంధానులేపనైః|*

*ధూపైర్దీపైః సురభిభిర్లాజాక్షతఫలాంకురైః॥7100॥*

వారు జలములను, ఉపహారములను, మాలలను, దివ్యపరిమళములను గుబాళించుచున్న అంగరాగములను, సుగంధిత ధూపములను, దీపములను, పేలాలను, అక్షతలను, ఫలములను, అంకురములను భగవంతునకు సమర్పించిరి.

*21.7 (ఏడవ శ్లోకము)*

*స్తవనైర్జయశబ్దైశ్చ తద్వీర్యమహిమాంకితైః|*

*నృత్యవాదిత్రగీతైశ్చ శంఖదుందుభినిఃస్వనైః॥7101॥*

భగవంతుని మహిమలను, ప్రభావములను తెలుపునట్టి స్తోత్రములతోను, జయఘోషలతోను, వాద్యయుక్తమైన, నృత్యగానములతోను, శంఖ, దుందుభి నాదములతోను ఆ పరమపురుషుని ఆరాధించిరి.

*21.8 (ఎనిమిదవ శ్లోకము)*

*జాంబవాన్ ఋక్షరాజస్తు భేరీశబ్దైర్మనోజవః|*

*విజయం దిక్షు సర్వాసు మహోత్సవమఘోషయత్॥7102॥*

ఆ సమయమున భల్లూక ప్రభువైన జాంబవంతుడు మనోవేగముతో పరుగెత్తి అన్ని దిశలయందును, భేరీలను డోళ్ళను మ్రోగించుచు భగవంతునియొక్క విజయవార్తను చాటించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: