2, సెప్టెంబర్ 2020, బుధవారం

అమ్మగాజులు


భుజాన నన్నేసుకుని నాన్న తిరుగుతూ ఉంటే , అమ్మ కొంగు దోపుకుని ఇటుగా వస్తున్న గాజుల శబ్దం వినగానే, మాగన్నులోంచి కూడా ఏడుపు ఉబికి వచ్చేసేది , 'అమ్మకూచి' అని నన్ను అమ్మ చేతికి అందించి నాన్నతప్పుకునేవాడు!
.....
కథ చెప్తూ జోకొడుతూంటే , నే'నూకొడుతూ' నోట్లో వేలేసుకునేలోగా గాజులున్న చేయి అందించేది , ఆ గాజులనే ఒకటికి రెండుసార్లు మేధావిలా లెక్కేసి ఇది అమ్మ చెయ్యే..... అని నిర్థారణతో నిద్ర వచ్చేసేది .
........
జుట్టు దువ్వుకుంటున్న గాజులసడి విని అమ్మ ఇక్కడే ఉందిగా, కాసేపాగి లేద్దామని మళ్ళా దొంగనిద్రముసుగేసి ఇంకో కునుకు తీసేదాన్ని !!

ధూప సువాసన , సన్నని మంత్రోచ్చారణ , మృదువుగా గంటానాథం , మధురంగా గాజులరాగం.. కిటికీలోంచి చూస్తే అమ్మ తులసమ్మకి పూజ చేస్తోంది .. నా అలికిడి విని "ఏయ్ దొంగా, ఇటురా ! " అని పిలిచి గొల్లయ్య కి చెప్పి చేతికి పేస్ట్ వేసిన పందుం పుల్ల చేతిలో పెట్టించేది !!

జడలేస్తుంటే గాజుల సౌండ్ జోలపాటలా ఉండి మళ్ళీ నిద్రొచ్చేది , జోగితే తను మెత్తగా మొట్టేది ,అపుడు కొంచం గట్టిగా మోగేవి ..

ఆమ్.. తినేటప్పుడు నా దృష్టి అమ్మగాజులపైనే.... అలా ఎలా చక్కగా మోగుతాయ్ , అచ్చు గాలికి కదులుతున్న ధ్వజస్తంభం చిరుగంటల నాదంలా ?

ఎప్పుడూ వచ్చే గాజులమల్లారాన్ని అడిగా... అమ్మవి స్పెషల్ గాజులా అని ? ఒఖ్క నవ్వు నవ్వి ..... ' నేనిచ్చేవి వా..ఠ్ట్టి మట్టిగాజులే అమ్మలూ ' , నీకూ వేస్తా దా అని చేతికి డజను చొప్పున గాజులు వేసాడు...
గలగలలాడాయి కానీ అమ్మగాజుల మ్యూజిక్ రాలేదు ...
ఏడ్చాను...వరదలయ్యేలా ఏడ్చాను ..దొర్లి దొర్లి ఏడ్చాను ..

బామ్మ బుగ్గన వేలేసుకుంది, నాన్న తల పట్టుకున్నారు , బాబాయ్ పగలబడి నవ్వాడు, తాత కసురుకున్నారు.. 

అమ్మ మాత్రం చిరునవ్వు నవ్వి దా..అని తన గాజుల డబ్బాలోంచి రెండు గాజులు తీసి చేతికి వేసి అంది ,ఇవి పాప గాజులు , అచ్చంగా నీవి అంది ..
కానీ ఇవి నీలా లేవుగా,సౌండ్ బాలేదు అన్నాను ,
అమ్మగాజులు నీకు చాలవు అంది, చాలినా ఆ శబ్దం రాదు, అంది.
ఎందుకు? అనడిగాను.. నేను అమ్మని, నువ్వు పాపవి కదా...అందుకు ..అని నవ్వేసింది !!

నాన్న బాబుని భుజాన్నేసుకుని జోకుడుతున్నాడు , అమ్మ గాజుల సవ్వడికి కెవ్వని ఏడుపు అందుకుని నాన్నని వదిలి అమ్మ చేతిని అందుకున్నాడు...నీలానే వీడూ 'అమ్మకూచి' అని నవ్వుతూ బాబుని నా చేతికి అందించి వాళ్ళ నాన్న పక్కకి తప్పుకున్నాడు !!

 సారె లో అమ్మ ఇచ్చిన గాజులు నా చేతిన గలగలలాడాయి .......అచ్చు అమ్మలా !! 😊😊😊                       
                          --- విష్ణుప్రియ వేదాంతం.

కామెంట్‌లు లేవు: