2, సెప్టెంబర్ 2020, బుధవారం

మరో శ్రీశైలం....పామాపురం



చుట్టూ పచ్చని వాతావరణం... వాగు మధ్యలో ధ్యానముద్రలో కొలువైన పరమశివుడు... ఎత్తైన కొండపైన కనిపించే పురాతన ఆలయంలో భ్రమరాంబ

సమేతంగా దర్శనమిచ్చే స్వామి... మరో శ్రీశైలంగా పిలిచే ఈ ఆలయాన్ని చూడాలంటే వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పామాపురానికి వెళ్లాలి.

శివుడికి ఎన్నో పేర్లు అంటారు. శ్రీశైలంలో స్వామి భ్రమరాంబ మల్లికార్జునుడిగా కొలువుదీరితే, పామాపురంలో శివుడు భ్రమరాంబ సహిత రామేశ్వరస్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని అంటారు. రెండుసార్లు ఈ ఆలయం ఆనవాళ్లు కోల్పోయినా మళ్లీ కట్టారని చరిత్ర చెబుతోంది. స్థలపురాణం

ఈ దేవాలయం క్రీస్తుశకం 543 నుంచి 750 మధ్య కాలంలో చాళుక్యుల ఆధ్యాత్మిక చిహ్నంగా నిర్మించిన అతి ప్రాచీన కట్టడంగా పురావస్తుశాఖ పేర్కొన్నా.... ఇక్కడ స్వామి ఎలా, ఎప్పుడు వెలిశాడో, ఆలయం ఎవరు కట్టించారో ఎవరికీ తెలియదని అంటారు. ఒకప్పుడు ఈ గుడిని ముచ్చ రామనాథస్వామి ఆలయంగా పిలిచేవారట. కాలక్రమేణా నిర్వహణ లేకపోవడంతో గుడి శిథిలావస్థకు చేరుకుందట. అయితే కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఓసారి ఈ ప్రాంతంలో పర్యటించిందట. పచ్చని పంట పొలాలూ నిరంతరం ప్రవహించే వాగులూ జల సవ్వడులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ వాతావరణం చూసి ఆనందించిందట. అలా ఎత్తైన గుట్టపైకి వెళ్లినప్పుడే నామ రూపాల్లేకుండా ఉన్న ఆలయాన్ని చూసి దాన్ని మళ్లీ నిర్మించి శివలింగాన్ని పునః ప్రతిష్టించిందని అంటారు. ఆ తరువాత గుడి నిర్వహణ బాధ్యతలను పామాపురం

గ్రామానికి చెందిన తంబాల వంశస్థుడైన ఓ వ్యక్తికి అప్పగించిందట. అంతేకాదు ఆలయానికి కొంత భూమిని కూడా కేటాయించినట్లు చరిత్రలో ఉంది. అప్పటినుంచీ ఈ గుడిని రామేశ్వర ఆలయంగా పిలవడం మొదలు పెట్టారట. అది జరిగిన కొన్నేళ్లకు ఈ ఆలయం మళ్లీ ఆనవాళ్లు కోల్పోయే స్థితికి చేరుకుందట. అలాంటి సమయంలో అంటే 1981 ప్రాంతంలో ఆలంపూర్ సంస్థానం రెడ్డి రాజుల వంశస్థులు సురేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఈ గుడికి వచ్చారట. ఆ తరువాత తండ్రి కోరడంతో ఈ గుడిని మళ్లీ కట్టించాలనుకున్నారట. దేవాదాయశాఖ అనుమతితో సచ్చిదానంద గణపతి స్వామీజీ పీఠాధిపతుల ఆశీర్వచనంతో 2017లో ఆలయ పునః నిర్మాణం మొదలు పెట్టారు. ఆ తరువాత ఇక్కడ శివలింగంతోపాటూ భ్రమరాంబ అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడంతో అప్పటినుంచీ ఈ గుడిని భ్రమరాంబ సమేత రామేశ్వరస్వామి ఆలయంగా పిలుస్తున్నారు. .

ఎన్నో ప్రత్యేకతలు....

ఈ ఆలయంలో నిత్యపూజలతోపాటూ శివరాత్రి రోజున గిరిజా కల్యాణాన్ని నిర్వహిస్తారు. ఆ సాయంత్రం జరిగే రథోత్సవాన్ని చూసేందుకు భక్తులు వివిధ

ప్రాంతాల నుంచి తరలిరావడం విశేషం. అదేవిధంగా నవరాత్రుల వేడుకలనూ అంగరంగ వైభవంగా జరుపుతారు. కార్తికమాసంలో స్వామికి చేసే అభిషేకాలూ అమ్మవారికి కుంకుమార్చన, నవగ్రహ పూజలతో కన్నులపండువగా ఉంటుందీ క్షేత్రం. ఇక్కడ ఉన్న శివలింగం కాశీలో ఉన్న శివలింగాన్ని పోలి ఉంటుందని అంటారు. ఇక్కడ కేవలం శివాలయం మాత్రమే కాదు... నవగ్రహ మందిరం, జంటనాగుల మందిరం, సంజీవ ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆలయ పుష్కరిణిలో ఉండే నంది విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం పక్కనే ఊకచెట్టు వాగు ఉంటుంది. ఏడాది పొడవునా ఈ వాగులో నీరు ప్రవహిస్తూనే ఉంటుందని చెబుతారు. ఈ నీటి మధ్యలో 18 అడుగుల భారీ శివుడి విగ్రహం ఏడు అడుగుల పీఠం పైన కొలువై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎలా చేరుకోవచ్చంటే...

హైదరాబాద్ నుంచి రావాలనుకునే భక్తులు కర్నూలు నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి పైన 143 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తకోట మండలం చేరుకోవచ్చు. అక్కడి నుంచి పామాపురం ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు నుంచి వచ్చేవారు నాటవెల్లి నుంచి పామాపురం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడినుంచి ఆటోలూ బస్సులూ తిరుగుతుంటాయి. - కాయల పూర్ణచందర్, ఈనాడు

మహబూబనగర్
SOURCE EENADU

కామెంట్‌లు లేవు: