2, సెప్టెంబర్ 2020, బుధవారం

కార్తీకంలో వన భోజనం

కార్తీకంలో వన భోజనం ఎందుకు చేస్తారు?
కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద పూజ చేసి వనభోజనం లు చేయాలి. ఈ రోజు శివునికి అన్నపూర్ణ దేవి చేసిన విందు, దుర్వాస-అంబరీషుల విందు భరద్వాజ - రామవిందు, శబరి రామునికి చేసిన విందు, క్రుష్ణుణి కి కుచేలునికి ఇచ్చిన ఆతిథ్యం గుర్తు చేసుకోవాలి.
యహ్ కార్తీక సితే
వనభోజన మాచరేత్
సయాతి వెష్ణవ ధామం
సర్వ పాపైహ ప్రముచ్యతే
కార్తీక పురాణం లోని పంచమాధ్యాయం వనభోజనాల విశిష్టతను చెప్పింది. కార్తీకమాసంలో వనభోజనం చేసిన వారు సకల పాపాల నుంచి విముక్తులై దైవధామాన్ని పొందుతారు. సూతమహర్షి నైమీశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు మునులందరితో కలిసి ఉసీరి చెట్టు కింద భుజించారు. ఔషధ గుణాలు నిండిన ఉసిరి చెట్టు ను సరస్వతీ అంశగా చెబుతారు. కార్తీకమాసంలో ఈ ఉసిరి చెట్టు ను కార్తీక దామోదరునితో పాటు దేవతలందరూ ఆశ్రయించి ఉంటారు.
          కార్తీక సంప్రదాయాలు అన్నింటిలోనూ మానసిక ఉల్లాసాన్ని ప్రశాంతతను అందించే సంప్రదాయం వనభోజనం. ఈ కార్తీకమాసంలో ఏదో ఒక రోజు తప్పనిసరిగా వనభోజనం చేయాలి. వివిధ జాతుల చెట్లు ఉన్న తోటలో ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉన్న చోట ఆటపాటలతో గడిపి భోజనం చేయడం వనభోజన ఆచారం. దీనికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. ఉసిరి చెట్టు నీడ ఆరోగ్యానికి మంచిది. అందుకే ఉసిరి చెట్టు కింద కూర్చొని పనస ఆకులో భోజనం చేయాలంటుంది శాస్త్రం. అంతకంటే ముందుగా ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది అంటారు. సాలగ్రామ పూజ సాధ్యం కానప్పుడు లక్ష్మీ నారాయణుల ప్రతిమ గానీ ఫోటో కాని ఉంచి పూజించాలి. పసుపు గంధం, కుంకుమలతో ఉసిరి చెట్టు ను అలంకరించి 21నామాలను చదువుతూ పుష్పాలతో పూజించాలి. ఉసిరి చెట్టుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.
ధాత్రేదేవీ నమస్తుభ్యం సర్వ పాపక్చయకరీ
పుత్రాన్ దేహి మహాప్రాఙ్ఞే యశోదేహి బలంచమే
ప్రఙ్ఞా మేథాంచ సౌభాగ్యం
విష్ణు భక్తించ శాశ్వతీం
నిరోగం కురుమాం నిత్యం
కురుసర్వదా
పిండి వంటలు తో షడ్రసోపేతమైన విందును సమకూర్చి ఉసిరి చెట్టు కు నివేదన చేయాలి. ఆ ప్రసాదాన్ని సహా పంక్తి లో అందరూ పంచుకొని తినాలి.. విశిష్ట పర్వాల లో అన్నదానం చేయడం వల్ల విశేషమైన ఫలం లభిస్తుంది. అన్నసమారాధనలో పాల్గొన్నా, మన వంతు సాయం అందించినా మంచిదే.

కామెంట్‌లు లేవు: