2, సెప్టెంబర్ 2020, బుధవారం

రామాయణమ్. 49


...
కైక ముఖంలో కాఠిన్యం ప్రతిఫలిస్తుండగా రామునితో,
.
రామా! నీకు ఒక విషయం చెప్పాలి ! అది చెప్పుటకు నీతండ్రికి నోరు రావడంలేదు అందుకే ఆయన అలా ఉన్నాడు ,అంతేగానీ ఏవిధమైన ఆపద సంభవించలేదాయనకు.
.
అది నీకు అప్రియము కావచ్చును కానీ అది ఆయన ప్రతిజ్ఞా పాలనమునకు సంబంధించినది ,ఆయన ఇచ్చిన మాట చెల్లించే సమయం నేడు ఆసన్నమయినది..
.
నీతండ్రి పూర్వము నాకు ఒక వరము ఇచ్చి వున్నాడు ,ఆ వరము నాకిచ్చినందుకు సామాన్యమానవుడిలాగ విలపిస్తున్నాడు నేడు. అదేదో పాప కార్యమన్నట్లుగా భావిస్తున్నాడు.పశ్చాత్తాపం చెందుతున్నాడు..
.
సత్యమువచించుట ,ఇచ్చినమాట నిలబెట్టుకొనుట సత్పురుషుల లక్షణము ,నీ తండ్రి మాట చెల్లించగలనని నీవు మాట ఇచ్చినచో ఆయన నా కిచ్చిన వరము గురించి నీకు తెలిచేయగలను. ఈయన స్వయముగా నీకది చెప్పలేడు.
.
ఆవిధంగా మాట్లాడుతున్న పినతల్లిని చూసి మనస్సులో బాధపడుతూ ! ...ఛీ ఎంత కష్టము తల్లీ ! నా విషయములో నీవు ఇటుల మాటలాడవలదు!
.
నా తండ్రి ఆజ్ఞాపించినచో అగ్నిలో దూకెదను ,ఆయన కాలకూట విషమిచ్చి త్రాగు రామా! అన్నచో అది అమృతమువలే సేవించగలను.
.
తల్లీ నీ మనసు నెరిగింపుము!
.
రాముని వద్ద రెండు మాటలు లేవు ..
.
రామో ద్విర్నభిభాషతే!
(ఇప్పుడొక మాట తరువాత ఒక మాట లేవు !ఎప్పుడూ ఒకటే మాట !)....ఒకటే మాట!
.
రామా! నీ తండ్రి పూర్వము నాకిచ్చిన వరములను నేడు అమలుపరచమంటున్నాను దాని ప్రకారము ...భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెను,...
...నేడే నీవు జటావల్కలధారియై దండకారణ్యములో పదునాల్గువత్సరములు నివసింపవలే!.
.
తండ్రి ఆజ్ఞ పాలింపుము.. నీ కొరకై ఏర్పరచిన అభిషేక సామాగ్రితో భరతునికి పట్టముగట్టవలే.
.
మరణశాసనము వంటి ఆ పలుకులు రాముని ఏ మాత్రమూ బాధించలేదు ! ప్రశాంతత చెడలేదు ! వ్యధ దరిచేర లేదు.
.
అమ్మా ! నీవు చెప్పినట్లే జరుగుతుంది!.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: