2, సెప్టెంబర్ 2020, బుధవారం

*శరణాగతి*

*జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*

సందేహం;- *శరణాగతి* అంటే ఏమిటి? దాని విధానం తెలపండి.

సమాధానం;- శరణాగతినే ప్రపత్తి అనీ, భరన్యాసం అనీ అంటారు.

భగవంతుడే రక్షకుడు, మోక్షోపాయము (శరణం) అనే దృఢ విశ్వాసం నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోవడమే *శరణాగతి*. నీ భారమంతా భగవంతునిపైన ఉంచడమే (న్యాసం) శరణాగతి చేయడం అంటే. భగవత్ ప్రవృత్తి విరోధి స్వప్రవృత్తి  నివృత్తే ప్రపత్తి. *రక్ష్యాపేక్షాం ప్రతీక్షతే* నిన్ను రక్షించాలనే అపేక్షతో భగవంతుడు సదా నిరీక్షిస్తుంటాడు. అది ఆయన ప్రవృత్తి. దానికి విరుద్ధంగా *నన్ను నేను రక్షించుకోగలను* అనే స్వతంత్ర ప్రవృత్తి నీకు ఉండకూడదు. స్వప్రవృత్తి నివృత్తి అంటే ఇదే. ఇలా ఏ పరిస్థితుల్లోనూ సడలని విశ్వాసంతో ఉండడమే శరణాగతి, ప్రపత్తి.

శరణాగతి చేయడానికి రెండు ప్రధాన లక్షణాలుండాలి. మొదటిది ఆకించన్యము. రెండవది అనన్యగతి.

ఆకించన్యమంటే *స్వామీ! నేను ఎలాటి యోగ్యత, శక్తిలేనివాడిని, దీనుణ్ణి* అని ప్రార్థించడం.

అనన్యగతి అంటే *స్వామీ! నువ్వు తప్ప నాకు ఎవ్వరూ రక్షకులు లేరు, నువ్వే నాకు దిక్కు, దీపమూ* అని మహావిశ్వాసాన్ని ప్రకటించి, ఆచరణలోపెట్టడం.

*సకృదేవ ప్రపన్నాయ* అని శ్రీరాముడూ, *సర్వధర్మాన్, పరిత్యజ్య* అని శ్రీకృష్ణుడూ శరణాగతే సులభమైన, సుకరమైన మోక్షోపాయమని చెప్పారు. శరణాగతి ఈ విధంగా ఒక్కసారి చేస్తే చాలు. సదాచార్యుల సమాశ్రయణం శరణాగతి మంత్రాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీరామాయణాన్ని *శరణాగతి వేదము* అనీ, విభీషణ శరణాగతిని *పరిపూర్ణ ప్రపత్తి* విధానమనీ పెద్దలు నిరూపించారు.

*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: