2, సెప్టెంబర్ 2020, బుధవారం

దక్షిణామూర్తి తత్వం

7. దక్షిణామూర్తి తత్వం ---
పూజ్య గురువులు బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు;                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

ఆ తల్లి స్వతంత్రా సర్వ తంత్రేశీ దక్షిణామూర్తి రూపిణీ అన్నాం. ఇక్కడ దక్షిణామూర్తి రూపిణీ అన్నప్పుడు అమ్మవారికి ఎలా వర్తిస్తుంది అంటే దక్షిణామూర్తికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు మనం చూసినట్లైతే..

స్పటిక రజత వర్ణం మౌక్తికీ మక్షమాలాం
అమృత కలశ విద్యా జ్ఞానముద్రా కరాభ్యైః!
దధతమురగరక్షం చంద్రచూడం త్రినేత్రమ్!
విదుత వివిధ రూపం దక్షిణామూర్తిమీడే!!

అని నమస్కారం మనకి దక్షిణామూర్తి మంత్రానికి ధ్యానశ్లోకంగా చెప్తున్నారిక్కడ. ఎలా ఉన్నాడు ఆయన అంటే స్పటిక రజత వర్ణం - స్ఫటికమువలే ఉన్నాడు. ఇంకా తెల్లగా ఉన్నాడు అని మనకి అర్థం కావటానికి రజతం చెప్పారు కానీ స్ఫటిక రజిత వర్ణం అనీ స్ఫటిక రజదవర్ణం అని రెండు పాఠాంతరాలు కనిపిస్తున్నాయి మనకి. కానీ స్ఫటిక రజత వర్ణం – స్ఫటికము వలే స్వీకరించినటువంటి వర్ణం అది. ఇది శుద్ధ స్ఫటిక తత్త్వం దేనిని తెలియజేస్తుంది అంటే ఏ వికారమూ లేని వాడు. స్ఫటిక విగ్రహుడు. పరమేశ్వరుణ్ణి శుద్ధ స్ఫటిక సంకాశం అని ప్రార్థిస్తాం. ఆయన తత్త్వమే అది శుద్ధ స్ఫటిక సంకాశం.

అసలు శివుడు అంటేనే త్రిగుణాతీతుడు అని అర్థం. "క్రమహసి పదే నిస్త్రై గుణ్యే శివాయ నమో నమః" త్రిగుణాతీత తత్త్వమే శివుడు. ఆయనకు యే వికారములూ లేవు. నిర్వికార స్థితిని తెలియజేస్తుంది స్ఫటిక వర్ణం. మౌక్తికీమక్షమాలా - చేతిలో అక్షమాల పట్టుకొని ఉన్నాడు. అక్షమాల అంటే అక్షరమాల అని మనం అనేకమార్లు చెప్పుకున్నాం. ముత్యాలతో చేసినది అది. శుద్ధమైన సత్త్వగుణాన్ని తెలియజేస్తూ ఆ అక్షరశక్తిని తెలియజెప్తున్నది. మామూలు అక్షరాలు కాదయ్యా శుద్ధమైనటువంటి విద్యను తెలియజేసే అక్షరములు. వాటిని మాలగా పట్టుకున్నాడు. ఇంకొక చేతితో మౌక్తికీం అక్షమాలాం అమృత కలశ - అమృతకలశాన్ని పట్టుకున్నాడు.

విద్యా - విద్య అనగా ఇక్కడ పుస్తకం అని అర్థం. జ్ఞానముద్రా కరాభ్యైః - చిన్ముద్ర. అక్షమాల, అమృతకుంభము, ఇటువైపేమో పుస్తకము, ఇంకొక చేతితో చిన్ముద్ర. ఈ నాలుగు ధరించి ఉన్నాడు. ఈ నాలుగు ధరించి ఆయన ఉన్నాడు అనుకుంటే ఇక్కడ అమ్మవారిని చూస్తే ఆమెకూడా ఈ నాలుగూ ధరించి ఉన్నది అని తెలుస్తుంది ఆయనవి ఏమిటో ఈవిడవి అవే అని. అక్కడ అయ్యా అన్నాం ఇక్కడ అమ్మా అన్నాం కానీ వారు ఇద్దరు కాదు. అది తెలుసుకోవడానికే ఈ బ్రహ్మవిద్యాధిదేవతయైన దక్షిణామూర్తి స్వరూపాన్ని ఆదిశంకరులవారు శృంగగిరిలో సాక్షాత్కరించుకొని ఆ శృంగేరియందు ప్రతిష్ఠ చేసి ఈ తల్లి శారద అని చెప్పారు.

ఆ తల్లి అనుగ్రహముంటేనే కానీ నేను రచించిన సారము నీకర్థం కాదు నాయనా అందుకా తల్లి దయ పొందండి అని ఒకవైపు ఆరాధ్య శారదని, ఇంకొకవైపు అధ్యయన శారదని మనకిచ్చారు. ఆరాధ్య శారద శృంగగిరిలో నిలుచొని ఉన్నది. అందుకు ఆ శారదమ్మ దక్షిణామూర్తి స్వరూపం. బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆ తల్లిని ప్రార్థిస్తే పరమ ప్రయోజనమైన బ్రహ్మవిద్యనిస్తుంది. బ్రహ్మ విద్య వచ్చినప్పుడు ఇక మిగిలిన వాటి గురించి చెప్పక్కరలేదు కదా! దాని గురించి గీతలో పరమాత్ముడు చెప్పినట్లు "సర్వతః సంప్లుతోదకే" అన్నారు.

మహానది వచ్చిందనుకోండి చలములోకానీ, కుండలో కానీ నీళ్ళు ఉన్నాయా అని ఆలోచిస్తామా? అది రానంతవరకే కుండలో, పిడతలో, పంపులో నీరు. మహానదే ఉంటే ఇంకేం కావాలి? అందుకే బ్రహ్మ విద్య లభించితే అన్నీ పూర్ణములైపోతాయి అక్కడ. పరిపూర్ణమైన విద్యను ఇచ్చినవాడు ఆయన. అన్నివిధాలా పరబ్రహ్మస్వరూపిణియైన దక్షిణామూర్తి రూపిణి, దక్షిణామూర్తి, వారిద్దరియొక్క సమన్వయం చెప్తున్నాం. ఆ సమన్వయాన్ని చెప్తూ ఈ కథలో ఒక చమత్కారాన్ని చెప్తోంది మన పురాణం.

కామెంట్‌లు లేవు: