2, సెప్టెంబర్ 2020, బుధవారం

*కృతిపతి నిర్ణయం*

*భాగవతామృతం*
*కృతిపతి నిర్ణయం*

1-13-ఉ.ఉత్పలమాల
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్
ఈ = ఈ; మనుజ = మానువులకు; ఈశ్వర = రాజులలో; అధముల = అధముల; కున్ = కు; ఇచ్చి = అంకితమిచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్ = ప్రయాణ సాధనములు; సొమ్ములున్ = ధనం; కొన్ని = మొదలైన కొన్నిటిని; పుచ్చుకొని = తీసుకొని; చొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; వాసి = వదలి; కాలు = యముడి; చేన్ = చేత; సమ్మెట = సుత్తి; వ్రేటులన్ = దెబ్బలు; పడక = తినకుండ; సమ్మతి = ఇష్ట; తోన్ = పూర్వకముగా, కలిగి; హరి = హరి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్ఛి; చెప్పెన్ = చెప్పెను; ఈ = ఈ; బమ్మెర = బమ్మెర వంశపు; పోతరాజు = పోతన అనే సమర్ధుడు; ఒకఁడు = అనబడేవాడు ఒకడు; భాగవతంబున్ = భాగవతమును; జగత్ = లోకానికి; హితంబుగన్ = మేలు సమకూరునట్లుగా.
విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్ధంగా వ్రాసిన భాగవతాన్ని మానవమాతృలు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించటం లేదు. అలా చేసి ఊళ్లు, అగ్రహారాలు హారాలు వస్తు వాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని, ఆ సుఖాలలో మైమరచి ఈ లోకంలో అనుభవించినా, మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలనే సుత్తిదెబ్బలు తప్పవని తెలుసు. అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకొని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను.
1-14-తే.తేటగీతి

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ,
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
చేతులు = చేతులు; ఆరంగ = నిండుగ; శివుని = శివుడిని; పూబూజింపఁడు = పూజింపనివాడు; ఏని = ఐతే; నోరు = నోరు; నొవ్వంగ = నొప్పెట్టేలా; హరి = విష్ణువుయొక్క; కీర్తి = శ్రవణము; నుడువఁడు = పలుకడు; ఏని = ఐతే; దయయు = దయ మఱియు; సత్యంబు = సత్యము; లోనుగాన్ = కలుగునట్లు; తలఁపఁడేనిన్ = ఎంచకపోతే; కలుగన్ = పుట్టుట; ఏటి = ఎందుల; కిన్ = కు; తల్లుల = వారి తల్లుల యొక్క; కడుపు = కడుపు; చేటు = చెడపుటకు.
ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి, నోరారా కేశవుణ్ణి కీర్తించాలి, సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి తల్లి కడుపు చెడగొట్టటం దేనికి
1-15-వ.వచనము
అని మఱియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచవిరచనాకుతూహలుండనై, యొక్క రాకా నిశాకాలంబున సోమోపరాగంబు రాకఁ గని, సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగభంగ యగు గంగకుం జని, క్రుంకులిడి వెడలి, మహనీయ మంజుల పులినతలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచుఁ, గించి దున్మీలిత లోచనుండనై యున్న యెడ
అని = అని పలికి; మఱియున్ = ఇంకా; మదీయ = నాయొక్క; పూర్వ = క్రితపు; జన్మ = జన్మలు; సహస్ర = వేలకొలదుల లోను; సంచిత = సంపాదించిన; తపః = తపస్సుల యొక్క; ఫలంబున = ఫలితము వలనను; శ్రీమన్ = శోభనకరమైన; నారాయణ = హరియొక్క; కథా = కథల; ప్రపంచ = మొత్తం సమూహాన్ని; విరచనా = రచించాలనే; కుతూహలుండను = బలీయమైన కోరికగల వాడను; ఐ = అయి; ఒక్క = ఒక; రాకా = పౌర్ణమి నాటి; నిశా = రాత్రి; కాలంబున = కాలంలో; సోమ = చంద్ర; ఉపరాగంబు = గ్రహణము; రాకన్ = వస్తుందని; కని = తెలిసికొని; సజ్జన = సజ్జనుల; అనుమతంబున = అనుమతితో; అభ్రంకష = ఆకాశామును; కష = ఒరసుకనేలా; శుభ్ర = శుభ్రమైన; సముత్తుంగ = పెద్ద; భంగ = అలలు కలది; అగు = అగు; గంగ = గంగానది; కున్ = కి; చని = వెళ్ళి; క్రుంకులు = మునుగుటలు - స్నానము; ఇడి = చేసి; వెడలి = బయటకువచ్చి; మహనీయ = గొప్పదైన; మంజుల = మనోహరమైన; పులిన = ఇసుకతిన్నెల; తలంబున = గట్టుమీద; మహేశ్వర = శివుని; ధ్యానంబు = ధ్యానం; సేయుచున్ = చేస్తూ; కించిత్ = కొంచెము; ఉన్మీలిత = తెరచిన; లోచనుండను = కన్నులుగలవాడను; ఐ = అయి; ఉన్న = ఉన్నటువంటి; ఎడ = సమయములో.
వేల వేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. ఒక పున్నమి రాత్రి చంద్రగ్రహణం ఉంది. అవాళ చందమామ నిండుగా ఉన్నాడు. పండు వెన్నెలలు కురుస్తున్నాయి. పెద్దల అనుజ్ఞ పొంది ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహిస్తున్న గౌతమీగంగకు వెళ్లాను. ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఒక ఎత్తయిన తెల్లని ఇసుక తిన్నెమీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చున్నాను.
1-16-సీ.సీస పద్యము

మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి;
నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక;
ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగిఁ;
బలువిల్లు మూఁపునఁబరఁగువాఁడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి;
ఘన కిరీటము దలఁ గలుగువాఁడు
1-16.1-ఆ.
పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు
వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.
మెఱుఁగు = మెఱుపుతీగ; చెంగటన్ = ప్రక్కన; ఉన్న = ఉన్నటువంటి; మేఘంబు = మబ్బుల; కైవడిన్ = విధంగా; ఉవిద = స్త్రీ (భార్య) / లక్ష్మి; చెంగట = దగ్గఱ; ఉండన్ = ఉండగా; ఒప్పు = చక్కగ యండెడి; వాడు = వాడు; చంద్ర = చంద్ర; మండల = బింబపు; సుధా = వెన్నెల; సారంబు = వెలుగు; పోలిక = వలె; ముఖమున = ముఖములో; చిఱునవ్వు = చిఱునవ్వు; మొలచు = వెలయు - ప్రకాశించు; వాఁడు = వాడు; వల్లీయుత = పూలతీగతోకూడిన; తమాల = గానుగు; వసుమతీ = భూమిని; జము = పుట్టినది - చెట్టు; భంగిన్ = వలె; పలు = బలిష్టమైన; విల్లు = విల్లు; మూఁపునన్ = భుజమున; పరఁగు = ప్రవర్తిల్లే; వాఁడు = వాడు; నీల = నీల; నగ = గిరి; అగ్ర = శిఖరము; సన్నిహిత = సమీపంగానున్న; భానుని = సూర్యుడి; భంగిన్ = లాగ; ఘన = గొప్ప; కిరీటము = కిరీటము; తలన్ = తలపైన; కలుగు = కల; వాఁడు = వాడు;
పుండరీక = పద్మముల; యుగము = జంట; పోలు = వంటి; కన్నుల = కళ్ళుకల; వాఁడు = వాడు; వెడఁద = విశాలమైన; ఉరము = వక్షముగల; వాఁడు = వాడు; విపుల = విస్తారమైన; భద్ర = శుభలక్షణముల; మూర్తి = ఆకారముగల; వాఁడు = వాడు; రాజ = రాజులలో; ముఖ్యుఁడు = ముఖ్యమైనవాడు; ఒక్కరుఁడు = ఒకడు; నా = నాయొక్క; కన్నున్ = కళ్ళ; గవ = జంట; కున్ = కు; ఎదురన్ = ఎదురగ; కానఁబడియె = సాక్షత్కరించెను;
ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగ ఆయన ప్రక్కన ఒక స్త్రీమూర్తి ఉంది. చంద్ర మండలంలోంచి కురిసే అమృత ధారలా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. కానుగవృక్షాన్ని చుట్టుకొన్న తీగలా ఆయన భుజాగ్రాన ధనుస్సు వ్రేలాడుతోంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగ ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విరిసిన తెల్ల దామరరేకులవంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో, ఆ రాజశ్రేష్ఠుడు నా కట్టెదుట కనువిందు విందుచేసాడు.
1-17-వ.వచనము
ఏను నా రాజశేఖరుం దేఱి చూచి భాషింప యత్నంబు సేయునెడ నతఁడు దా,”రామభద్రుండ మన్నామాంకితంబుగా శ్రీమహాభాగవతంబుఁ దెనుంగు సేయుము; నీకు భవబంధంబులు దెగు" నని, యానతిచ్చి తిరోహితుం డయిన, సమున్మీలిత నయనుండనై వెఱఁగుపడి చిత్తంబున.
ఏను = నేను; ఆ = ఆయొక్క; రాజ = రాజులలో; శేఖరున్ = శ్రేష్ఠుని - మహారాజుని; తేఱి = తేరిపార; చూచి = చూచి; భాషింప = మాట్లాడుటకు; యత్నంబు = ప్రయత్నం; సేయు = చేస్తున్న; ఎడ = సమయంలో; అతఁడు = అతడు; తాన్ = తను; రామభద్రుండ = రామభద్రుండననియు; మన్ = నాయొక్క; నామ = పేరునకు; అంకితంబుగా = అంకితముగా; శ్రీ = శ్రీ; మహా = మహా; భాగవతంబున్ = భాగవతమును; తెనుంగు = తెలుగులోకి (అనువాదము); సేయుము = చేయయు; నీకు = నీకు; భవ = సంసార వలన; బంధంబులు = బంధనములు; తెగును = తెగుతాయి; అని = అని; ఆనతి = ఆజ్ఞ; ఇచ్చి = వేసి; తిరోహితుండు = మాయము; అయిన = అవ్వగా; సమున్మీలిత = బాగాతెరచిన; నయనుండను = కళ్ళుగలవాడను; ఐ = అయి; వెఱఁగున్ = ఆశ్చర్యములో; పడి = పడి; చిత్తంబున = మనస్సులో.
అప్పుడు నేనా మహారాజుని రెప్పవాల్చకుండా చూసి మాట్లాడదామని ఇంకా ప్రయత్నిస్తున్నాను. ఇంతలో ఆయనే”నేను రామభద్రుణ్ణి. నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చేయుము.. నీ భవబంధాలు పటాపంచలౌతాయి” అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమయ్యాడు. నేను పూర్తిగా కళ్ళు తెరచుకొని అంతా ఆశ్చర్యంగా చూస్తూ, నాలో నే నిట్లా అనుకున్నాను.
1-18-క.కంద పద్యము

పలికెడిది భాగవత మఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
పలికెడిది = పలుకునది; భాగవతము = భాగవతము; అఁట = అట; పలికించెడి = పలికించెడి; వాడు = వాడు; రామభద్రుండు = రాముడు; అఁట = అట; నేన్ = నేను; పలికిన = పలికినట్లయిన; భవ = సంసార బంధనములు; హరము = తొలగుట; అగునఁట = అవుతుందట; పలికెద = (అందుకే) పలుకుదును; వేఱొండు = ఇంకొక; గాథ = కథ; పలుకఁగన్ = పలకటం; ఏలా = ఎందుకు.
వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్భాగవతం. కరుణా సముద్రుడైన శ్రీరామచంద్రప్రభువేమో వ్రాయించేవాడుట. వ్రాసి నందువల్ల భవభందాలు పరిహారము అవుతాయిట. అంచేత భాగవతాన్ని వ్రాస్తాను. మిగతా వేవి వ్రాయను.
1-19-ఆ.ఆటవెలది

భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,
శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు.
భాగవతము = భాగవతమును; తెలిసి = తెలుసుకొని; పలుకుట = పలుకుట; చిత్రంబు = చిత్రమైనది; శూలి = శూలధారి శివుని; కిన్ = కి; ఐనన్ = ఐనప్పటికి; తమ్మి = పద్మము నందు; చూలి = పుట్టినవాని; కిన్ = కి; ఐనన్ = అయినప్పటికి; విబుధ = విశేషమైన జ్ఞానముగల; జనుల = జనుల; వలనన్ = వలన; విన్న = వినిన; అంత = అంత; కన్న = చూసిన; అంత = అంత; తెలియవచ్చిన = తెలిసిన; అంత = అంత; తేట = తెలిసేలా; పఱతు = చేస్తాను.
అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవరు చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా. అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్ల మయ్యేలా చెప్తాను.
1-20-క.కంద పద్యము

కొందఱకుఁ దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱికి గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్.
కొందఱు = కొంతమంది; కున్ = కి; తెనుఁగు = తెలుగు {తెనుగు గుణమగు - తెలుగు(దేశీయ) పదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుతుంది}; గుణము = బాగుగ; అగున్ = ఉండును; కొందఱకును = కొంతమందికి; సంస్కృతంబు = సంస్కృతము {సంస్కృతంబు గుణమగు - సంస్కృతమూలపదాల ప్రయోగం ఎక్కువ వుంటే నచ్చుతుంది}; గుణము = బాగుగ; అగున్ = ఉండును; రెండున్ = రెండూ; కొందఱి = కొంతమంది; కిన్ = కి; గుణములగు = బాగుగ ఉంటాయి; నేన్ = నేను; అందఱ = అందర్ని; మెప్పింతు = మెప్పిస్తాను; కృతులన్ = రచనలలో; ఆయ్యై = ఆయా; ఎడలన్ = సందర్భానుసారంగా.
తెలుగు పదాలతో కూర్చి వ్రాసినవి కొంతమందికి నచ్చుతాయి. సంస్కృత పదాలుతో కూర్చి వ్రాసిన రచనలను మరికొంతమందికి నచ్చుతాయి. ఇంకొంతమందికి రెండు రకాల పదప్రయోగాలు నచ్చుతాయి. నేను అందరు మెచ్చుకొనేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను.
1-21-మ.మత్తేభ విక్రీడితము

ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.
ఒనరన్ =ఇంపుగా; నన్నయ = నన్నయ; తిక్కన = తిక్కన; ఆది = మొదలైన; కవులు = కవులు; ఈ = ఈ; ఉర్విన్ = భూమ్మీద; పురాణ = పురాణ {పురాణలక్షణములు - సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము}; ఆవళుల్ = సమూహములు; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయుచున్ = చేస్తూ; మత్ = నాయొక్క; పురా = పూర్వ జన్మలలో; కృత = చేసిన; శుభ = పుణ్యపు; అధిక్యంబు = గొప్పతనం; తాన్ = అది; ఎట్టిదో = ఎలాంటిదో కాని; తెనుఁగు = ఆంధ్రీకరణ; చేయరు = చేయలేదు; మున్ను = ఇంతకు ముందుగ; భాగవతమున్ = భాగవతాన్ని; దీనిన్ = దీనిని; తెనింగించి = ఆంధ్రీకరించి; నా = నాయొక్క; జననంబున్ = జన్మని; సఫలంబు = సార్థకము; చేసెదన్ = చేసుకుంటాను; పునః = పునః; జన్మంబున్ = జన్మమును; లేకుండఁగన్ = లేకుండే లాగ.
సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను.
1-22-మ.మత్తేభ విక్రీడితము

లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
లలిత = చక్కని / అందమైన; స్కంధము = కొమ్మలతో / స్కంధములతో; కృష్ణ = నల్లని / కృష్ణుని కథలు; మూలము = వేళ్ళుతో / మూలాధారముగ; శుక = చిలుకల / శుక యోగి; ఆలాప = పలుకులతో / పలుకులచే; అభిరామంబు = రమణీయంగా / మిక్కిలి శోభాకరమై; మంజులత = అందమైన పూల తీగలతో / మనోహరమైన వాక్కులతో; శోభితమున్ = అలంకరింపబడుతూ / అలరారుతూ; సువర్ణ = మంచి రంగులు గల / మంచి అక్షర ప్రయోగాలు కలిగి; సుమనస్ = మంచి పువ్వులతో / మంచి మనసున్నవారికి; సుజ్ఞేయమున్ = చక్కగ కనిపిస్తున్న / చక్కగ తెలిసే లాగ; సుందర = అందంగా / అందమైన; ఉజ్జ్వల = బాగా పెరిగిన / విలాసవంత మైన; వృత్తంబున్ = గుండ్రముగా నున్న / చక్కటి పద్య వృత్తములతోను; మహా = పెద్ద / గొప్ప; ఫలంబు = పళ్ళతో / ఫలితా న్నిచ్ఛే లాగను; విమల = విస్తార మైన / నిర్మల మూర్తి యైన; వ్యాసా = చుట్టుకొలత గల / వ్యాసు డనే; ఆలవాలంబున్ = పాదుతో ఉన్నది/ పునాది కలిగినది; ఐ = అయి; వెలయున్ = రూపుకట్టి యున్నది / రూపొంది యున్నది; భాగవత = భాగవత మనే; ఆఖ్య = పేరు గల; కల్పతరువు = కల్పవృక్షము; ఉర్విన్ = భూమిమీద / లోకంలో; సద్ద్విజ = చక్కటి పిట్టలకు / సజ్జనులకు మరియు ద్విజులకు; శ్రేయము = మేలుకూర్చునది / శ్రేయస్కరము; ఐ = అయి.
బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్ఛమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.
1-23-వ.వచనము
ఇట్లు భాసిల్లెడు శ్రీ మహాభాగవతపురాణ పారిజాత పాదపసమాశ్రయంబునను, హరికరుణావిశేషంబునను గృతార్థత్వంబు సిద్ధించె నని, బుద్ధి నెఱింగి లేచి మరలి కొన్ని దినంబులకు నేకశిలానగరంబునకుం జనుదెంచి యందు గురు వృద్ధ బుధ బంధుజనానుజ్ఞాతుండనై
ఇట్లు = ఈ విధంగా; భాసిల్లెడు = ప్రకాశించే; శ్రీ = శుభప్రదమైన; మహా = గొప్ప; భాగవత = భగవంతుని గురించిన; పురాణ = పురాణమనే; పారిజాత = పారిజాత; పాదప = వృక్షమును; సమ = చక్కగా; ఆశ్రయంబునన్ = ఆశ్రయించుట వలనను; హరి = విష్ణుని; కరుణా = దయయొక్క; విశేషంబునను = విశిష్టత్వంవలనను; కృతార్థత్వంబు = ప్రయోజనకరమైనది; సిద్ధించెనని = సిద్దించిందని; బుద్ధిని = బుద్ధియందు; ఎఱింగి = గ్రహించి; లేచి = లేచి (ధ్యానస్థానంనుంచి); మరలి = వెనుకకు వచ్చి; కొన్ని = కొన్ని; దినంబుల = రోజుల; కున్ = కు; ఏకశిలానగరంబున = ఏకశిలానగరాని; కున్ = కి; చనుదెంచి = చేరి; అందున్ = అందు; గురు = గురువులు; వృద్ధ = పెద్దలు; బుధ = జ్ఞానవంతులు; బంధు = బంధువులు; జన = ఐన జనులచే; అనుజ్ఞాతుండన్ = అనుమతి పొందినవాడిని; ఐ = అయి.
ఈ విధం బహు ప్రకాశమానమైన పురాణరాజమైన భాగవతం అనే కల్పవృక్షాన్ని సమాశ్రయించటం వల్ల, శ్రీహరి విశేషంగా అనుగ్రహించటం వల్ల నా జన్మ చరితార్థమైంది అని చక్కగా అర్థమైంది. అప్పుడు నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదలి కొన్నాళ్ళకు ఏకశిలానగరానికి తిరిగివచ్చాను. అక్కడ గురువులూ, వృద్ధులూ, పండితులూ, బంధువులూ మొదలైన పెద్దలందరి అనుజ్ఞ తీసుకున్నాను.

కామెంట్‌లు లేవు: