5, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-22

 దశిక రాము**


🕉️ #🕉️


⚛️ శ్లోకం 16⚛️


**భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|**


**అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః||**


143. భ్రాజిష్ణుః --- స్వయంప్రకాశ స్వరూపుడు; తేజోమయుడు; (సాధన చేయు, శరణాగతులైన) భక్తులకు కనిపించువాడు.

144. భోజనం --- నోటితో గాని, జ్ఞానేంద్రియములతోగాని స్వీకరించు విషయములు (అన్నము, శబ్దము, స్పర్శ, గంధము వంటివి) అన్నియును భగవత్స్వరూపములే. ఇంద్రియముల ద్వారా గ్రహించు విషయముల రూపమునను, ఇతర పూజాదిక కార్యముల ద్వారా లభించు ఫల రూపమునను భక్తులకు ఆనందానుభూతిని ప్రసాదించువాడు; సచ్చిదానంద స్వరూపుడు.

145. భోక్తా --- భుజించువాడు; భోజన రూపమగు ప్రకృతి లేక మాయను పురుష రూపమున అనుభవించువాడు; భక్తితో నొసగిన కానుకలు స్వీకరించి సంతుష్టుడయ్యేవాడు; యజ్ఞములో అర్పించినదానిని గ్రహించువాడు.

146. సహిష్ణుః --- సహించి, క్షమించి, అనుగ్రహించు కరుణామయుడు; ఓర్పు కలిగి భరించు సర్వ సాక్షి, సహన మూర్తి; దుష్టులను సంహరించువాడు.

147. జగదాదిజః --- జగములన్నింటికంటే ముందుగా నున్నవాడు.

148. అనఘః --- పాపరహితుడు; కల్మషము లేనివాడు.

149. విజయః --- జయించుటయే స్వభావ స్వరూపముగా గలవాడు; బ్రహ్మ రుద్రాదుల విజయములకు కూడా కారణమైనవాడు; ప్రకృతిని జయించినవాడు; పాండవులలో అర్జునుడు.

150. జేతా --- జయించువాడు; అంతా ఆయన ఇచ్ఛానుసారమే జరుగును.

151. విశ్వయోనిః --- విశ్వమునకు జన్మ స్థానము, కారణము; విశ్వమే కారణముగా గలవాడు.

152. పునర్వసుః --- తన సృష్టి యందంతట సకల దైవములందును అంతరాత్మయై మరల మరల విలసిల్లువాడు; ప్రళయానంతరము మరల సృష్టి కావించువాడు.

శ్లో. భ్రాజిష్ణు ర్భోజనం భాక్తాః సహిష్ణు ర్జగదాదిజః


అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః !!16!!


32. వెలుగులకును తానె వెలుగు నిచ్చుచు నుండు


భోజనంబు మరియు భోక్తఁ దానె


సహన శీలి యతడె, సకల సృష్టికి యాది


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : భ్రాజిష్ణు ... అద్వయ ప్రకాశకుడు (Light of Lights), భోజనం ... భుజింప దగిన వాడు(భోజ్యము), భోక్త...భుజించువాడు, సహిష్ణు ... సహనశీలి, జగదాదిజ ... జగత్తుకు ముందు నుంచీ ఉన్నవాడు.


భావము : సూర్య చంద్రులకు, అగ్నికి సైతం వెలుగు ప్రసాదిస్తూ తానే స్వయం ప్రకాశకుడైనవాడు (ఆంగ్ల భాష్యంలో కూడా Light of Lights అనే ఉన్నది కదా) , భుజింప దగిన వాడు లేదా భోజ్యము అనగా అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం (అలాగే సర్వత్రా ఆయనే ఉన్నప్పుడు ఫలాదులలోనూ ఉన్నట్లే కదా) కనుక భోజ్యమే, అంతే గాక, జ్ఞానేంద్రియాలకు జీవం(ఆహారం) తానే అంటాడు కనుక ఆ ప్రకారంగానూ శ్రీహరిని భోజ్యమనవచ్చునేమో కదా, కాగా ... ఫలం, తోయం, రకరకాల ఆహారాలను నివేదిస్తుంటాం కనుక ఆయనను భోక్తగానూ వ్యవహరించ వచ్చు. భక్తులు యెన్ని ఎలా మాట్లాడినా సహనంతో ఉంటూ వారిని కాపాడుతుంటాడు కనుక సహిష్ణువే అనవచ్చు. సృష్టికి పూర్వం నుంచీ ఉన్నవాడు గనుక జగదాదిజ అనీ వ్యవహరించ బడుతున్న ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


33. అనఘు డనగ నతడె, అద్భుత విజయుడు,


జయమె శీల మాయె, జగతికంత


కారకుండు, మరియు కనగ పునర్వసు


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : అనఘ .. పాపరహితుడు, విజయ ... శ్రేష్ఠమైన విజయం సాధించినవాడు, జేతా ... జయుడు (సంస్కృత నిఘంటువు ప్రకాంర జయశీలి), విశ్వయోని ... విశ్వం పుట్టుకకు కారణమైనవాడు, విశ్వం వల్లనే పుడుతున్నవాడు. పునర్వసు ... పదే పదే పుడుతున్నవాడు, క్షేత్రజ్ఞుడవుతున్నవాడు.

భావము : కర్మలు చేయనివాడు, వాటి ఫలాలు కూడా అంటని వాడు గనుక పాపాలు పుణ్యాలు కూడా అంటని వాడే కదా, అసురులపై అద్భుతమైన విజయాలు సాదించిన వాడు, అంతేగా పార్థుని ద్వారా కూడా ధర్మ సంస్థాపనలో విజయం సాధింపజేసినవాడు(ఆంగ్ల పాఠం ప్రకారం విజయుడంటే పార్థుడే అనీ ఉంది) చెడుపై గెలుపు సాధించడమే తన తత్త్వంగా గలవాడు (సంస్కృత నిఘంటువులో జేతా అంటే జయస్వభావుడు అనే అర్థం ఉన్నది కదా), విశ్వం పుట్టుకకు కారకుడు, మరో పాఠం ప్రకారం విశ్వమే తన పుట్టుకకు కారణమైన వాడు, పదే పదే పుడుతూ( ఏదో ఒక జీవరాశిలో వసించి) యుండేవాడు (సంభవామి యుగే యుగే అన్నది ఆయనే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు. }


**ఓం నమో నారాయణాయ**

కామెంట్‌లు లేవు: