5, అక్టోబర్ 2020, సోమవారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఎనిమిదవ శ్లోక భాష్యం - మొదటి భాగం


సుధాసింధోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే

మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే .

శివాకారే మంచే పరమశివపర్యంక నిలయాం

భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ ..


(అమ్మా! అమృత సముద్రం మధ్యలో ఉన్న కల్ప వృక్షాలు చుట్టూ ఉన్న మణిద్వీపంలో కడిమిచెట్ల ఉద్యానవనం మధ్యలో గల చింతామణులచే కట్టబడిన యింటిలో శివస్వరూపమయిన మంచమున పరమశివుని తొడపైనున్న జ్ఞానానంద ప్రవాహమైన నిన్ను కొందరు ధన్యులు సేవిస్తారు.)


శివుని ఆవాసము కైలాసం. విష్ణుమూర్తిది వైకుంఠం. ఆ విధంగానే లలితాంబికకూ తనదైన ప్రపంచమున్నది. శివకేశవులకు ఒకొక్క నెలవే! లలితాంబికకు రెండు ఇళ్ళు. ఒకటి బ్రహ్మాండంగా పిలవబడేది. ఇది గ్రహాలన్నీ ప్రదక్షిణం చేసే ఒక మేరు శిఖరం. మిగతా మూడు మేరు శృంగాలకు నడుమ నున్న ఉన్నతమైన శృంగంపైన ఉన్నది. లలితా సహస్రనామాలలో *సుమేరు శృంగమధ్యస్తా* అన్న నామం ఈ విషయాన్ని తెలియజేస్తోంది.


అంబిక రెండవ నివాసం బ్రహ్మాండమునకు ఆవలి ప్రక్కనున్నది. ఆమె విశాలమైన అమృతపు సముద్రాన్ని సృష్టించి, దానిమధ్యలో ఉన్న ద్వీపంలో నివసిస్తుంది. లలితా సహస్రనామాలలో అమృత సముద్రంలో ఉన్న ఈ నివాసాన్ని చెప్పిన వెంటనే కామాక్షీ నామం చెప్పబడింది. *సుధాసాగర మధ్యస్తా కామాక్షీ కామదాయినీ*. ఆచార్యులవారు ఈ శ్లోకంలో వివరించినది ఈ నివాసం గురించే! ముందే చెప్పుకొన్నట్లు ఈ లోకం అంబికచేత సృష్టించ బడిందే! మేరుపర్వతంపైన నివాసమున్నదే అది అంబిక చేత కటాక్షించబడిన శక్తితో విశ్వకర్మ నిర్మించినది. 


దేవతలకు శత్రువైన భండాసురుని పరిహరించడానికి అంబిక ఆవిర్భవించినపుడు, దేవతలందరూ ఆమెను తమ మహారాజ్ఞి అయిన రాజరాజేశ్వరీగా పట్టాభిషిక్తను చేశారు. ఆ రాణిగారి కోసం విశ్వకర్మ మేరు పర్వతపు మధ్య శృంగంపై అనేక కోటలతో ప్రకాశించే శ్రీపురాన్ని నిర్మించాడు. అయితే ఆచార్యులవారు ఇక్కడ ప్రస్తావించినది సుధాసముద్రంలోని శ్రీపురం గురించి.


మేరు అగ్రంపై ఉన్నదైనా సుధాసముద్రంలోనిదైనా అంబిక నివాసంలో వ్యత్యాసమేమీ లేదు. బహిఃప్రాకారపు దుర్గముల నుండి, ఆమె ఆసీనురాలయే సింహాసనం వరకూ ఉన్న ప్రాకారాలు, సరస్సులు, ద్వారాలు రెండు నివాసాలలోనూ ఒకేరకంగా ఉంటాయి. అది ఆమె రాజధాని. శ్రీనగరమని, శ్రీపురమని పిలవబడుతుంది. ఈ శ్రీపురము ఇరవై అయిదు కోటలు, ప్రాకారాలతో చుట్టబడి ఉన్నది. ఆ కోటలు ఇనుము నుంచి బంగారం వరకు వివిధ లోహాలతో, నవరత్నాలలోని ఒకొక్క జాతి రత్నాలతో నిర్మించబడ్డాయి.


ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే బుద్ధి, చిత్తము, అహంకారాల దుర్గాలు, సుర్యచంద్రుల ప్రకాశాలతో మన్మథుని కాంతితో కట్టబడిన కోటలు ఉంటాయి. ఈ కోటలన్నిటి మధ్యలో అరణ్యాలు, కల్పవృక్షపు తోటలు, ప్రవాహాలు, కాలువలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ దాటుకుంటూ ఇరవై అయిదవ ఆవరణలోనికి వెళితే అది మహాపద్మవనం. వికసించిన పద్మాలతో నిండి ఉన్న అగడ్త. ఆ లోపల అంబిక భవంతి. ఇటుకలతో కట్టబడింది కాదు. చింతామణులతో కట్టబడింది. ఆ రమ్యహర్మ్యంలో నివసిస్తున్న మహారాణి పేరు రాజరాజేశ్వరి.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: