5, అక్టోబర్ 2020, సోమవారం

పౌరాణిక చిత్రబ్రహ్మ కమలాకర కామేశ్వరరావు*


*


( *నిన్న కమలాకర కామేశ్వరరావు జయంతి* 

4 అక్టోబర్ 1911- 29 జూన్ 1998)


_"చిత్రంలో అన్నిశాఖలూ, అందరూ కనిపించాలి గానీ, దర్శకుడు కనిపించగూడదని నా ఉద్దేశ్యం. అన్నిశాఖలనూ కనిపింపజెయ్యడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రముంటుంది. అది పైకి కనిపించదు. కానీ అన్ని మణులనూ కలిపి హారంగా రూపొందిస్తుంది. చిత్ర దర్శకుడు అలాంటి సూత్రం." -కమలాకర కామేశ్వరరావు." *కమలాకర కామేశ్వర రావు* *పౌరాణిక బ్రహ్మ*

దర్శకుడు కమలాకర కామేశ్వరరావు పేరు వినగానే ఆయన రూపొందించిన పౌరాణిక చిత్రాలు మన స్మృతిపథంలో మెదులుతాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పాతికపైగా పౌరాణిక చిత్రాలను రూపొందించారు ఆయన. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాలు రూపొందినా ఆయనకు పేరు సంపాదించి పెట్టినవి పురాణగాథల ఆధారంగా రూపొందిన చిత్రాలే ఎక్కువ.


కమలాకర కామేశ్వరరావు కళలకు నెలవైన బందరులో 1911 అక్టోబర్ 4న జన్మించారు. ఆయనకు చిన్నతనం నుంచీ లలితకళలపట్ల ఎనలేని అభిమానం ఉండేది. ఆయన బి.ఏ డిగ్రీ తీసుకున్న తర్వాత ఏ ఉద్యోగానికీ ప్రయత్నించలేదు. చిత్రాల్లో ప్రవేశించాలనేది ఆయన ధ్యేయం. ఆ ధ్యేయంతోనే సినిమాలు చూస్తూ చిత్రాలకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ వుండేవారు. 1934-37 మధ్యకాలంలో కామేశ్వరరావు, సినీ ఫ్యాన్ పేర కృష్ణాపత్రికలో సినిమా రివ్యూలు రాసేవారు. అప్పట్లో ఆయన బందరులో వుంటూ హిందీ, తెలుగు సినిమాల మీద కృష్ణాపత్రికలో విమర్శనాత్మకమైన వ్యాసాలు రాస్తూ వుండేవారు. నేడున్న పరిస్థితుల్లో సినిమాలను నిజాయితీగా సమక్షిస్తే అందులోని నిజానిజాలను మనస్ఫూర్తిగా అంగీకరించే నిర్మాత, దర్శకులు భూతద్దం వేసి చూసినా కానరారు. మరి కమలాకర కామేశ్వరరావు అదృష్టమేమో కానీ ఆయన విమర్శే ఆయనను సినిమా రంగంవైపు నడిపించింది. 1936లో టాకీపులిగా పేరుగాంచిన హెచ్.ఎం.రెడ్డి రూపొందించిన ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’, బళ్ళారి రాఘవ నటించిన ‘ద్రౌపదీ మానసంరక్షణం’ చిత్రాలు ఒకే ఇతివృత్తంతో పోటీగా విడుదలయ్యాయి. వీటిలో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ విజయం సాధించినా, ప్రేక్షకాదరణ పొందని ‘ద్రౌపదీ మానసంరక్షణ’ చిత్రంలో సాంకేతిక విలువలు, కథా కథనం బాగుందని కమలాకర కామేశ్వరరావు తన అభిప్రాయాన్ని కృష్ణాపత్రికలో వెలిబుచ్చారు. ఈ రివ్యూ అప్పట్లో తెలుగు సినిమా నిర్మాతలలో పెద్ద చర్చగా నిలచింది. అయితే తన సినిమాలోనూ లోపాలు కనిపెట్టిన సమీక్షకుడు ఎంతో తెలివైనవాడని హెచ్.ఎం.రెడ్డి భావించారు. తర్వాత హెచ్.ఎం.రెడ్డి కామేశ్వరరావును మద్రాసుకు పిలిపించి తన ‘గృహలక్ష్మి’ (1938) చిత్రంలో పనిచేసే అవకాశం కల్పించారు. అలా ఆయన సినీరంగ ప్రవేశం జరిగింది.


‘గృహలక్ష్మి’ చిత్రం తర్వాత బి.ఎన్.రెడ్డిగారితో పరిచయం ఏర్పడి, ఆయన రూపొందించిన ‘వందేమాతరం’ (1953), సుమంగళి (1940), దేవత (1941), స్వర్గసీమ (1945) వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు కామేశ్వరరావుగారు. అలాగే కె.వి.రెడ్డి దగ్గర కూడా కామేశ్వరరావు కథ, దర్శకత్వ శాఖలలో సహాయకునిగా పనిచేశారు. కె.వితో కలిసి భక్తపోతన (1942), యోగి వేమన (1947), గుణసుందరి కథ (1949), పాతాళభైరవి (1951) చిత్రాలకి పనిచేసినపుడు కె.వి.రెడ్డి అసోసియేట్ డైరెక్టరుగా కామేశ్వరరావుకు తన ప్రక్కనే ఆయన పేరు కూడా వేసి గౌరవించారు. స్క్రీన్‌ప్లే రూపొందించడంలో కూడా కె.వి.రెడ్డి, కామేశ్వరరావు సహాయం పొందారు.


ఆనాటి దర్శకులు అందరూ ముందుగా స్క్రిప్ట్‌కే ప్రాధాన్యమిచ్చేవారు. స్క్రిప్టు బాగా రావడానికి కొన్ని నెలలు కృషి చేసేవారు. స్క్రిప్టు దశలోనే నటీనటుల నుంచి ఎలాంటి అభినయం రాబట్టుకోవాలో నోట్సు రాసుకునేవారు. స్క్రిప్ట్ పక్కాగా పూర్తయితేనే షూటింగ్ ఆరంభించేవారు. కమలాకర కామేశ్వరరావు పనిచేసిన హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి- ముగ్గురూ ఇదే పద్ధతికి ప్రాధాన్యమిచ్చేవారు. దాంతో కామేశ్వరరావు కూడా అదే పద్ధతికే ప్రాధాన్యమిచ్చేవారు. ఆయనలోని దర్శకుడికి తొలి అవకాశం ఇచ్చిన ఘనత ‘విజయా’ అధినేతలు నాగిరెడ్డి-చక్రపాణికే దక్కుతుంది. 1954లో విజయా సంస్థ నిర్మించిన ‘చంద్రహారం’ చిత్రం ద్వారా కమలాకర కామేశ్వరరావు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. అందుకు కారణం ఆ సమయంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంటున్న సావిత్రి ‘చంద్రహారం’లో దుష్టనాయిక పాత్రను పోషించడమేనని తరువాత కామేశ్వరరావు అభిప్రాయపడ్డారు. తరువాత ఆయన దర్శకత్వంలో రూపొందిన 1956లో ‘పెంకి పెళ్ళాం’ చిత్రం కూడా అట్టే విజయం సాధించలేకపోయింది.


కమలాకర కామేశ్వరరావుకు దర్శకుడిగా తొలిసారి బ్రేక్‌ నిచ్చిన చిత్రం ఎన్.ఎ.టి. సంస్థ నిర్మించిన ‘పాండురంగ మహత్మ్యం’ (1957). ఈ చిత్రంతో తానేమిటో నిరూపించుకోవాలని ఆయన ఎంతో తపించారు. అలాగే ఎన్టీ రామారావు తాను ఆల్‌రౌండర్‌నని ఈ చిత్రం ద్వారానే నిరూపించు కున్నారు. అప్పటివరకు భక్తిరస చిత్రాలలో నటించాలంటే ఒక్క నాగయ్యకే చెల్లుతుందనే భావన తెలుగునాట ఉండేది. ఎన్టీ రామారావు కూడా భక్తిరస పాత్రలను అద్భుతంగా పోషించగలరని పాండురంగ మహత్మ్యం నిరూపించింది. ఇందులో భక్తపుండరీకునిగా ఎన్టీఆర్ నటించారు. ఈ తరహా కరుణరస పాత్రలను నాగయ్యచే భక్తపోతన, యోగివేమన చిత్రాల్లో పోషింపజేసి కె.వి.రెడ్డి తెలుగువారిని అలరించారు. ఆ రెండు చిత్రాలకు కె.వి దగ్గర సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో కమలాకర, గ్లామర్ హీరోగా పేరొందిన రామారావు చేత కూడా కరుణరసాన్ని అద్భుతంగా పండించేలా చేసి మెప్పించారు.


ఈ చిత్రం తరువాత కామేశ్వరరావు మరి వెనుతిరిగి చూడలేదు. ఆ తరువాత ఆయన దర్శకత్వంలో రూపొందిన రేచుక్క పగటిచుక్క, మహాకవి కాళిదాసు (1960), గుండమ్మకథ (1962), నర్తనశాల (1963), పాండవ వనవాసం (1965), శ్రీకృష్ణావతారం (1967), శ్రీకృష్ణవిజయం (1971) తదితర చిత్రాలు రూపొందించారు. ఆయన దర్శకత్వంలో పెంకిపెళ్లాం, గుండమ్మకథ, శోభ, మాయనిమమత వంటి సాంఘిక చిత్రాలు రూపొందినప్పటికీ ‘గుండమ్మకథ’ మాత్రమే ఘనవిజయం సాధించింది.


నేడు దర్శకేంద్రుడిగా నీరాజనాలు అందుకుంటున్న కె.రాఘవేంద్రరావు తన డిగ్రీ పూర్తికాగానే తొలుత కమలాకర కామేశ్వరరావు వద్దనే సహాయ దర్శకుడిగా పండవ వనవాసం సినిమాకి పనిచేశారు. చిత్రమేమో గాని అంతకుముందు ఎన్టీ రామారావుతో అధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వారిలో ఒకరిగా కమలాకర కామేశ్వరరావుకు పేరుంది. ఆయన శిష్యుడే ఆయిన రాఘవేంద్రరావు కూడా ఆ గౌరవాన్ని తరువాత కాలంలో పొందారు.


ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను సొంతం చేసుకున్నాయి. నర్తనశాల ఎంతో పేరుతెచ్చుకుని జకార్తాలో కూడా ప్రదర్శింప బడింది. సినిమా పరిశ్రమకు గౌరవం కల్పించిన సీనియర్‌లకు ఇవ్వడానికి నిర్దేశించిన రఘుపతి వెంకయ్య అవార్డు కామేశ్వరరావుకు దక్కలేదు. ఆణిముత్యాల్లాంటి చిత్రాలు అందజేసి గొప్ప రివార్డులు అందుకున్న కమలాకర కామేశ్వరరావుగారు 1998 జూన్ 29న తనయుడి ఇంటిలో మరణించారు.

పురాణగాథలను తెరకెక్కించడంలో తనదైన బాణీ పలికించిన కామేశ్వరరావు ‘పౌరాణిక బ్రహ్మ’గా కీర్తిపొందారు. ఆయన రూపొందించిన చిత్రాలు నేటికీ పర్వదినాల సమయంలో బుల్లితెరపై ప్రత్యక్షమై మనకు కనుల విందు చేస్తుంటాయి.

🙏

కామెంట్‌లు లేవు: