5, అక్టోబర్ 2020, సోమవారం

తెలుగు సాహిత్యంలో

 తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో చూద్దాం.


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

*-దేవులపల్లి కృష్ణ శాస్త్రి*


2. ‘‘కప్పివుంచితే కవిత్వం విప్పి చెబితే విమర్శ’’

*డా.సి.నారాయణరెడ్డి*


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

*- కాళోజి*


4. ‘‘గత కాలము మేలు వచ్చుకాలముకంటెన్‌’’ 

*- నన్నయ*


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

*-సుబ్బారావు పాణిగ్రాహి*


6. ‘‘రాజే కింకరుడగు కింకరుడే రాజగు’’ 

*-బలిజేపల్లి లక్ష్మీకాంతం*


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

*-బసవరాజు అప్పారావు*


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

*-గుర్రం జాషువా*


9. ‘‘అత్తవారిచ్చిన అంటు మామిడి తోట

 నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

*- కాళ్ళకూరి నారాయణరావు*


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

*- దాశరధి*


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

*-నార్ల వెంకటేశ్వర రావు*


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

*- తిరుపతి వెంకట కవులు*


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

*- గురజాడ*


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

*- గరిమెళ్ళ సత్యనారాయణ*


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

*- శ్రీనాథుడు*


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

*- పోతన*


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

*- గద్దర్*


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

*- శ్రీ శ్రీ*


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 *- వెన్నలకంటి*


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

*- కొనకళ్ల వెంకటరత్నం*


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

*- అల్లసాని పెద్దన*

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

*- చేమకూరి వేంకటకవి*


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

*- త్యాగయ్య*


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

*- ధూర్జటి*


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు......’’ 

*- బద్దెన*


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

*- వేమన*


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

*- కంచర్ల గోపన్న*


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

*- సుద్దాల హనుమంతు*


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

*- ఆరుద్ర*


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

*- వేముల శ్రీ కృష్ణ*


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

*- త్రిపురనేని రామస్వామి*


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

*- బాలాంత్రపు రజనీకాంతరావు*


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

*- అడవి బాపిరాజు*


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

*- కరుణశ్రీ*

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

*- గుడ అంజయ్య*


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

*- అలిసెట్టి ప్రభాకర్*


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

*- సావిత్రి*


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

*- ఖాదర్ మొహియుద్దీన్*


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

*- బాలగంగాధర తిలక్*


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

*- అన్నమయ్య*


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

*- ఏనుగు లక్ష్మణ కవి*


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

*- పాలగుమ్మి విశ్వనాథం*


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

*- చెలం*


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

*- విమల*

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

*-నండూరి సుబ్బారావు*


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

*- అందెశ్రీ*


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

*- చెరబండరాజు*

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

*- కందుకూరి రామభద్రరావు*


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

*- నందిని సిధారెడ్డి*


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

*- మిట్టపల్లి సురేందర్*


"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".(శ్రీకృష్ణదేవరాయలు)...


వీరినందరినీ మీ పిల్లలకు పరిచయం చేయండి..

........

...........

కామెంట్‌లు లేవు: