5, అక్టోబర్ 2020, సోమవారం

👌 *చిన్న నీతి కథ* 👏

__________________. ఒకసారి ఒక వ్యక్తికి, ఓ అడవిదారిలో చాలా దూరం నడుచుకుంటూ వెళుతూండగా, అధికం గా దాహం వేయడంతో పాత్రలో మిగిలిన కొద్దిపాటి నీరూ త్రాగుతూండగా, యమధర్మరాజు మాయావేషాన కలిశారు. అందుకే ఆ వ్యక్తికి కలిసిన ఆయన యమధర్మరాజు గారని తెలియదు. యమధర్మరాజు ఆ వ్యక్తితో చాలాసేపటి నుండి దప్పికతో బాధపడుతూన్నాననీ, ఎక్కడా నీళ్లు దొరకడం లేదనీ.. తాగడానికి కాసిన్ని నీళ్ళు కావాలని కోరారు. యమధర్మరాజు రావడం ఓక్షణం ఆలస్యమై ఉంటే ఆ నీళ్లను ఆ వ్యక్తి తాగేసేవాడే ! కానీ, వెంటనే యమధర్మరాజు పరిస్థితి కి జాలిపడి నీళ్లు ఇచ్చేసాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు సంతోషించి, ఆ వ్యక్తితో చెప్పాడు "నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యమధర్మరాజునే.. కానీ నీవు తాగడానికి నాకు నీళ్ళిచ్చి, నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మార్చుకోడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. యమధర్మరాజు ఆ వ్యక్తికి తన చేతనున్న పుస్తకాన్నిచ్చి "ఇది అందరి జాతకాలున్న భవిష్యద్వాణి. నీపై కాలపాశమేసి తీసుకుపోయేందుకు మరో ఐదు ఘడియల సమయముంది. కనుక, ఇందులో నీ జాతకం చదువుకొని నీకున్న ఆనందం, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు, ప్రశాంతతసౌఖ్యం లను ఒక ఐదు ఘడియల సమయం లో మరికొంచెం పెంచుకునే అవకాశం తో మార్చి రాసుకో.. జరుగుతుంది కానీ ఇచ్చిన సమయం లోపలే పూర్తవాలన్నారు. దాంతో ఆవ్యక్తి గబగబా మొదటిపేజీలోనిది చదివాడు.. అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది - అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అన్నది చదివి, ఆ వ్యక్తికి లాటరీ తగలకూడదని మార్చేసాడు. తర్వాత పేజీ చదవగా "తన స్నేహితుడు ఎన్నికలలో గెలిచి, మంత్రి పదవి రాబోతోందని చదివి, అతడు ఓడిపోవాలి అని మార్చేసాడు. ఈ విధంగా, వేరేవారి జాతకాలు చదువుతూ, చివరికి తన పేజీలకొచ్చి కావాల్సినది రాసుకుందామనుకునే లోపుగా, సమయమాసన్నమై, యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి డైరీని తీసేసుకుని, నీకిచ్చిన అమూల్యమైన సమయాన్ని పక్కవారి వినాశనానికి ఆలోచించావు తప్ప నీవు స్వయం గా ఉద్ధరింపబడటానికి ఉపయోగించుకోలేదు. పరచింతన లో వృధా చేసుకుని నీ జీవితాన్ని స్వయంగా నీవే కష్టాలలోకి నెట్టు కున్నావు అనగా, చాలా పశ్చాతాప పడ్డాడు వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నందుకు.


ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉండమని దాదాపు సమాన ఆయుఃప్రమాణం, ఆనందకరమైన మనసూ, ఆరోగ్యకరమైన అవకాశాలనూ ఇస్తాడు. కానీ మనము వ్యర్ధాలోచనలు, అలసత్వాలతో వాటన్నింటినీ మనమే వృధా చేసేసుకుని, ఆయువూ ఆరోగ్యాలను ఆభగవంతుడు లాగేసుకున్నాడంటున్నాము. అలాకాక, ఎవరైతే చక్కటి సమయపాలనతో పెద్దలు నేర్పిన యోగా ధ్యానం శౌచ సదాచారాలతో భగవంతుడిచ్చిన ఆయువూ ఆనందాల ప్రమాణాన్ని పెంచేసుకునీ, ఇతరులతో కూడా సదా పంచుకుంటారో వారి పైన సదా ఆ భగవంతుని కృప వర్షిస్తూనే ఉంటుంది! సర్వేజనాః సుజనాభవంతు.. సర్వేసుజనా సుఖినోభవంతు!


ఈ సంగమ యుగంలో, భగవంతుడు కలం మనచేతికే ఇచ్చి "మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి "అని ఇస్తూన్న ఈ సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోమని మరో సారి విన్నవించుకుంటూ, భవదీయ- జగన్నాథ🙏

కామెంట్‌లు లేవు: