**దశిక రాము*&
****
తృతీయ స్కంధం -38
విష్ణు సర్వాంగస్తోత్రంబు
అప్పుడే వికసిస్తున్న పద్మాలవంటి అందమైన కన్నులు కలవాడు, వక్షస్థలంపై అందమైన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలవాడు, నల్లని మేఘంలా, నల్లకలువలా శ్యామలవర్ణం కలవాడు, తుమ్మెదలకు విందుచేసే వైజయంతీ మాలికతో విరాజిల్లేవాడు, కౌస్తుభమణితో శోభించే ముత్యాలహారం కంఠమందు ధరించినవాడు, యోగిజనుల హృదయకమలాలకు దగ్గరైనవాడు, ఎప్పుడును ప్రసన్నమైన చిరునవ్వు చిందులాడే ముఖపద్మం కలవాడు, కోటి సూర్యుల తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశించేవాడు, విలువైన రమణీయ రత్నకుండలాలు, కిరీటం, హారాలు, కంకణాలు, కటకాలు, భుజకీర్తులు, అంగుళీయకాలు, అందెలు మొదలైన అలంకారాలతో విలసిల్లేవాడు, కటి ప్రదేశమందు ఘల్లు ఘల్లుమనే గజ్జెల మొలనూలు అలంకరించుకొన్నవాడు, భక్తులను లాలించి పాలించేవాడు అయిన శ్రీమన్నారాయణుని (ధ్యానం చేయాలి).ఇంకా...పద్మకేసరాల రంగుతో మిసమిసలాడే పసుపుపచ్చని పట్టువస్త్రం కట్టుకున్నవాడు, లోకాలను తనలో పెట్టుకున్నవాడు, శత్రుభయంకరాలైన శంఖ చక్ర గదా పద్మాలను చతుర్బాహువులలో ధరించేవాడు, మోహాన్ని హరించేవాడు, స్తోత్రం చేసే భక్తులకు జ్ఞాననేత్రాన్ని అనుగ్రహించేవాడు, సుగుణాలనే సురుచిర భూషణాలను పరిగ్రహించేవాడు, నిత్యయౌవనుడు, భువనపావనుడు, సౌందర్యశీలుడు, యశోవిశాలుడు, సమస్త లోకాలూ నమస్కరించే పాదపద్మాలు కలవాడు, భక్తజనులను ఆదరించే భావాలు కలవాడు, కోరిన కోరికలను ప్రసాదించేవాడు, మహనీయ కీర్తితో ప్రకాశించేవాడు అయిన శ్రీహరిని (ధ్యానించాలి).
ఇంకా సాటిలేని మేటి సుగుణాలతో నిండియున్న వానిని, పాపాలను చెండాడే వానిని, స్థిరమైన వానిని, నడచివస్తున్న వానిని, వచ్చి కూర్చున్న వానిని, సుఖంగా పరుండిన వానిని, హృదయాంతరాలలో నివసించిన వానిని, సర్వేశ్వరుని, శాశ్వతమైన వానిని, సంస్తుతింపదగిన సచ్చరిత్ర కలవానిని (ధ్యానించాలి).
పరిశుభ్రము, పరిశుద్ధము అయిన మనస్సుతో, విజ్ఞాన తత్త్వ ప్రబోధకమైన సంకల్పంతో ఆ దివ్యమూర్తి రూపవైభవాన్ని ధ్యానించి అన్ని అవయవాలను విడమరచి చూచేటట్లు చిత్తాన్ని తదాయత్తం చేసి ఆ పరాత్పరుని ఒక్కొక్క శరీర భాగాన్నే పరిశుద్ధమైన అంతరంగంలో అనుసంధానం చేసికొని ధ్యానించాలి.
అది ఎటువంటిదంటే...హలం, వజ్రం, అంకుశం, కమలం, ధ్వజం, ఛత్రం మొదలైన మంగళకరమైన రేఖలు కలవీ, చంద్రుని వెన్నెల వెలుగులవంటి గోళ్ళకాంతులతో భక్తుల మనస్సులలోని అజ్ఞానాంధకారాన్ని దూరం చేసేవీ, మనోజ్ఞమైన కాలి బొటనవ్రేలినుండి పుట్టిన గంగాతీర్థంచే శివుని జటాజూటాన్ని అలంకరించేవీ, భక్తితో ఆసక్తితో ధ్యానించే భక్తుల పాపాలనే పర్వతాలను వజ్రాయుధంలా పటాపంచలు చేసేవీ, దాసుల కోర్కెలు తీర్చేవీ, యోగుల హృదయాలనే పద్మాలలో విహరించే తుమ్మెదల వంటివీ అయిన హరి పాదపద్మాలను నిరంతరం హృదయాలలో స్మరిస్తూ ఉండాలి.బ్రహ్మకు తల్లియై, దేవతలందరికీ ఆరాధ్యురాలై, కమల దళాలవంటి కన్నులుగల లక్ష్మీదేవి తన హృదయేశ్వరుడైన శ్రీహరి మోకాళ్ళను ఎంతో భక్తితో ఒడిలో చేర్చుకొని ఒత్తుతూ ఉన్న మనోహర దృశ్యాన్ని మనస్సులో మననం చేసుకోవాలి.సొగసైన గరుత్మంతుని భుజాలమీద కాంతి సంపదలతో పెంపొందుతూ, విరిసిన దిరిసెనపువ్వు వన్నెలతో కన్నులవిందు చేసే పద్మనాభుని అందమైన ఊరుయుగ్మాన్ని అచంచలమైన భక్తితో భావిస్తూ మునులైనవారు తమ మనఃకమలాలలో నిల్పుకోవాలి.
అమ్మా! ఒయ్యారంగా అంచులు వ్రేలాడుతూ ఉండే మెత్తని పట్టుపీతాంబరం కట్టుకొని మొలనూలు మువ్వల సవ్వడి నివ్వటిల్లే పురుషోత్తముని కటిప్రదేశాన్ని భక్తితో భజించాలి. ఇంకా విను. అఖిల లోకాలకు ఆధారభూతమై, బ్రహ్మపుట్టుకకు హేతుభూతమైన పద్మంతో విరాజిల్లే సరోవరం వంటి విష్ణుమూర్తి నాభీమండలాన్ని సంస్మరించాలి. దివ్యమైన మరకతమాణిక్య దీప్తులు కలిగి, ముత్యాలహారాల కాంతులతో నిండిన కుచములు కలిగిన లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థ్సలాన్ని ఆత్మలో భావిస్తూ ఉండాలి.
యోగీశ్వరులచే నమస్కరాలు అందుకునేవాడూ, అందరికీ ప్రభువూ, లక్ష్మీపతీ అయిన ఆ మహావిష్ణువు యొక్క మెడ; నిత్యం కొలిచే సజ్జనుల మనోనేత్రాలకు ఆనందాలు పంచేటటువంటిదీ, అద్భుతమైన కౌస్తుభమణికాతులలో తేలియాడేదీనూ. అట్టి ఆ విష్ణుమూర్తి మెడను మనసులో నిలుపుకుని దాని గుణాలను ధ్యానం చేయాలి.సాగరమథన సమయంలో బరువైన మందర పర్వతం రాపిడిచే మెఱుగుపెట్టబడిన రత్నాల భుజకీర్తులు కలిగి లోకపాలకులకు అండదండలైన విష్ణుదేవుని బాహుదండాలను సంస్మరించాలి. ఇంకా శత్రుసమూహాలకు సహింపరాని వేయి అంచుల సుదర్శన చక్రాన్ని, పద్మనాభుని కరపద్మంలో రాజహంసవలె విరాజిల్లే పాంచజన్య శంఖాన్ని, రాక్షసుల నెత్తురు చారికలతో కూడి దామోదరునికి ఆమోదదాయకమైన కౌమోదకి అనే గదను, గుప్పుమంటున్న కొంగ్రొత్త నెత్తావులు గుబుల్కొన్న కమ్మ తెమ్మరల పిలుపు లందుకొని సంగీతాలు పాడే తుమ్మెదలతో కూడిన వైజయంతి అనే వనమాలికను, అఖిల లోకాలకు ఆత్మస్వరూపమైన కౌస్తుభమణిని వేరువేరుగా ధ్యానం చేయాలి. ఇంకా భక్తరక్షణ పరాయణత్వాన్ని స్వీకరించే దివ్యమంగళ రూపాపానికి తగినదై, మకరకుండలాల మణికాంతులు జాలువారే చక్కని చెక్కుటద్దాలతో ఎల్లవేళలా జయశ్రీకి మందిరాలైన అందాల కందమ్ములతో వంపులు తిరిగిన సొంపైన కనుబొమలతో, ఎలదేటి కదుపుల వంటి నల్లని ముంగురులతో, ముద్దులు మూటగట్టే ముకుందుని ముఖకమలాన్ని ధ్యానం చేయాలి. ఆర్తులై శరణాగతులైన భక్తులకు అభయమిచ్చే కరపద్మాలను మనస్సులో ధ్యానించాలి. 1) ఆదిభౌతికము, 2) ఆధ్యాత్మికము, 3) ఆదిదైవికము అనెడి కారణములు కలిగిన మూడు బాధలు (తాపములు) తాపత్రయం అనబడతాయి, భయంకరాతి భయంకరములు అయిన ఆ తాపత్రయాలను ఉపశమింప చేయగలిగిన శ్రీమన్నారాయణుని దివ్య కటాక్షవీక్షణాలను మనస్సునందు స్మరించుకోవాలి. సౌజన్యానికి నిధి వంటి ఓ తల్లీ! భక్తియోగాన్ని అవలంబించినవారు కమనీయకాంతులు ప్రసరించే విష్ణువుయొక్క ముసిముసి నవ్వులలోని ప్రసన్నతను మలినం లేని మనస్సులో మాటిమాటికి మననం చేసుకోవాలి. తలలు వంచి నమస్కరించే దాసుల శోకబాష్ప సముద్రాలను ఎండించి కోరికలు పండించే హరియొక్క సుందర మందహాసాన్ని ఎడతెగకుండా భావించాలి. మహామునులకే కాకుండా మన్మథునకు సైతం మరులు రేకెత్తించే మాధవుని మాయావిభ్రమ విరచితమైన భ్రూమండలాన్ని, మునీంద్రుల మనస్సులకు ఆనందాన్ని అందించే మందహాసాన్ని, క్రొంగ్రొత్త చిగురు తొగరు పెదవులను, ఆ పెదవుల కాంతికి జాజువారిన మొల్ల మొగ్గల చెలువాన్ని పరిహసించే పలువరసను తలపోయాలి. ఈ విధంగా అన్ని అవయవాలను వేరువేరుగా మనస్సులో నిలిపి ధ్యానం చేసుకోవాలి” అని దేవహూతికి కపిలుడు తేటతెల్లంగా తెలిపి మళ్ళీ ఇలా అన్నాడు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి