**దశిక రాము**
**మహాభారతము**
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
102 - అరణ్యపర్వం.
ఉపవాసాలతో క్రుంగికృశిస్తున్న సావిత్రిని చూసి, అత్తమామలు యెంతో బాధ పడుతున్నారు. కానీ, ఆమె సంకల్పబలం చూసి, పల్లెత్తుమాట అనలేక, బాధను దిగమింగుకుంటున్నారు.
ఎన్నాళ్ళనుంచో భయపెడుతున్న ఆరోజు రానేవచ్చింది. తెల్లవారింది. నిత్యపూజను పెందరాళే ముగించుకుని, సావిత్రి, పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుని, వారిచ్చిన మాంగళ్య సౌభాగ్య రక్షా దీవెనలను అందుకుని, స్థిరచిత్తంతో, గొడ్డలి భుజాన పెట్టుకుని అడవికి బయలుదేరిన సత్యవంతునితో, తానూ అడవికి వస్తానని బయలు దేరింది. ' నాధా ! ఈరోజు మిమ్ములను ఒంటరిగా వదలడానికి నామనసు అంగీకరించడం లేదు. నేనుకూడా మిమ్ములను అనుసరించి అడవికి వస్తాను. కాదనవద్దు ' అని సత్యవంతుని పాదాలు పట్టుకుని అడిగింది, సావిత్రి.
సత్యవంతుడు యెంతో ఆశ్చర్యంగా, ' సావిత్రీ ! సంవత్సరకాలంగా యేనాడూ నీవు యిట్టి కోరికకోరలేదు. గత మూడు నాలుగు రోజులుగా నీవు ఉపవాసదీక్షలో యెంతో నీరసంగా వున్నావు. నాతో యీరోజు అడవికి రావడం నీకు శ్రమగా వుంటుంది. నీకు అంతగా రావాలనిపిస్తే, అత్తమామల ఆశీర్వాదం తీసుకుని బయలుదేరు. ' అన్నాడు
అత్తమామల అనుమతి తీసుకుని, సత్యవంతునితో అడవికి బయలుదేరింది, సావిత్రి, ముఖం పై చిరునవ్వు చిందిస్తూ, హృదయంలో ఆవేదన సుడులు తిరుగుతుండగా. సత్యవంతుని మనసు మాత్రం యెంతో ఆహ్లాదంగా వున్నది, తన ప్రియపత్నితో కలసి వనవిహారం చెయ్యడం తో. కొత్త అనుభూతులకు లోనవుతున్నారు. రోజూ చూసే ప్రకృతి అయినా యెంతో రమణీయంగా కనబడుతున్నది, సత్యవంతునికి. సావిత్రిని పొదివి పట్టుకుని, యెంతో లాలనగా, ఆ అడవిలోని సౌందర్యాలను, వివరించి మరీ చెప్పి ఆనందిస్తున్నాడు. ఆసమయంలో శ్రీరాముడు సీతతో, వనవాస సమయంలో ఆమెతో ముచ్చటించిన తీరు జ్ఞప్తికి వచ్చే విధంగా వున్నది, సత్యవంతుడు, సావిత్రితో సంభాషించిన తీరు.
సావిత్రి మాత్రం మృత్యువు యేవైపు నుండి వచ్చి తన ప్రాణనాధుని కబళిస్తుందో అని ఆందోళనగా అటూ యిటూ చూస్తూ, తొట్రుపాటు యేమాత్రం చూపించకుండా, భర్త చూపించే రమణీయ దృశ్యాలని ఆస్వాదిస్తున్నట్లు అభినయించసాగింది.
ఆ సమయంలో... ఆసమయంలో, వున్నట్లుండి, గొడ్డలితో చెట్టు ఛేదిస్తున్న సత్యవంతుడు, ' సావిత్రీ ! తలపోటు అధికంగా వున్నది, అవయవాలు వశం తప్పుతున్నాయి. నోరెండి పోతున్నది. కాసేపు విశ్రమిస్తాను. ' అని అంటూ సావిత్రి వొడిలో తన తలను ఉంచి, రొప్పుతున్నాడు. కొద్దిసేపటికి, శరీరం చల్లబడసాగింది. శ్వాస భారంగా వున్నది, సత్యవంతునికి. చూస్తూ వుండగానే, సత్యవంతుడు చలనం లేకుండా వుండిపోయాడు, సావిత్రి వొడిలో.
సరిగ్గా అప్పుడే, సువర్ణ కిరీటంతో ప్రకాశిస్తూ, తేజోవంతుడు, నల్లని దేహంతో, ఎరుపెక్కిన నేత్రాలతో, మధ్యాహ్న సూర్యుని వలే వెలిగిపోతూ, చేతిలో నల్లని నిగనిగలాడుతున్న ఒక దివ్య పాశమును ధరించిన, బలిష్ఠుడు అయిన, ఒక దివ్య పురుషుని, సావిత్రి చూసింది, తన కనులముందు.
ఆ మహానుభావుని చూడగానే, సావిత్రి, తన భర్త శిరస్సును క్రిందకు దింపి, యేమాత్రం తొట్రుపడకుండా,' మహానుభావా ! మీరెవరో, దైవస్వరూపుల వలే వున్నారు. తమరిరాకకు కారణమేమి ? నా సామాన్య నేత్రాలకు మీరెలా కనబడుతున్నారు ? దయచేసి చెప్పండి, తమకు అభ్యంతరం లేకపోతే. ' అని వినయంగా అడిగింది.
' సావిత్రీ ! సాధ్వీ !! నీవు గొప్ప పతివ్రతవు అవడం వలన, నీకంటికి నేను కనబడుతున్నాను. నన్ను చూడడం మానవులకు జీవించి వుండగా సాధ్యం కాదు. అంతెందుకు, నన్ను చూసి, జీవించి వుండడమే మానవులకు దుర్లభం. నీ భర్త ఆయుష్షు తీరడం వలన, అతని సూక్ష్మ శరీరాన్ని, నా పాశంతో బంధించి తీసుకు వెళ్ళడానికి వచ్చాను. ' అని యెంతో గౌరవంగా చెప్పాడు, యమధర్మరాజు, సావిత్రితో.
సావిత్రి యముని మాటలకు యేమాత్రం భయపడకుండా ' మా మానవులకు తెలిసినంతవరకూ, యిట్టిపనులకు యమకింకరులు వస్తారని విన్నాము. కానీ, యెంతో ఆశ్చర్యకరంగా, ఈ చిన్నపనికి, స్వయంగా తమరే వచ్చిన కారణమేమి మహానుభావా ? ' అని కుతూహలంగా అడిగింది. ' సావిత్రీ ! నీవు విన్నది నిజమే ! మామూలు ప్రాణులను నా కింకరులు తీసుకువస్తారు.కానీ సత్యవంతుడు అసామాన్యుడు. ధర్మాత్ముడు. అందువలన నేనే స్వయంగా వచ్చాను.' అంటూనే, క్షణం ఆలశ్యం చెయ్యకుండా తన చేతిలోని పాశాన్ని, సత్యవంతుని దేహంలో వున్న జీవుని పట్టుకునేటట్లు వేసి, జీవుడిని బయటకు లాగాడు, యముడు. దక్షిణ దిక్కుగా కొనిపోసాగాడు.
సావిత్రి కూడా యీదృశ్యాన్ని స్పష్టంగా చూడగలిగింది. తన తపోనిష్ఠతో , ఆమె యమధర్మరాజును వెంబడించింది. అచ్చెరువొందాడు, సమవర్తి. ఇది ఆయనకూడా వూహించనిది. తన తలపుతోనే వణికిపోయే, మానవజాతిలో పుట్టిన ఒక అబల, ఇంత సాహసం చేసి, మృత్యువునే వెంబడించడం, ఆయనకు అంతుబట్టడం లేదు.
' సావిత్రీ ! నీ పతిభక్తికి మెచ్చాను. చాలు, నీ పయనం దక్షిణ దిక్కుకు. ఇది నీకు నిషిద్ధమార్గము. వెళ్లి నీ భర్తకు అంత్యక్రియల ఏర్పాట్లు చూడు. వృధా ప్రయాస మానుకో ! ' అని సలహా యిచ్చాడు యమధర్మరాజు, సావిత్రికి.
' యమధర్మరాజా ! భర్తతో కూడినదే భార్య జీవనం. ఇదే మేము నమ్మిన సనాతన ధర్మం. ధర్మరాజా ! నాతపస్సు, ,గురుభక్తి, , భర్తపై నా ప్రేమ, ముఖ్యం గా మీ దయ నాపై వుంటే, నేను నాభర్తతో యెంత దూరమైనా ప్రయాణించగలను, అనుగ్రహించండి. నేను యింతసేపు మీతో కలిసి ప్రయాణించాను, మీరు మిత్రభావం ప్రదర్శించి, నన్ను రానివ్వండి, నా భర్తతో. ' అని ధైర్యంగా చెప్పింది సావిత్రి.
' మహానుభావా ! నీలాంటి సత్పురుషునితో, కలిసి నడిచేభాగ్యం విధి నాకు కలిపించింది. మీ దర్శనం నాకు మేలుచేస్తుంది. ఆమేలు మీరు నాపై చూపించకుండా నేనెలా వెనుకకు మరలగలను ? ' అని యముని అభిమానం చూరగొనే ప్రయత్నం చేసింది.
ఆమె మాటలకు యముడు యెంతో సంతోషించాడు. తృప్తిగా ఆమె వాక్కులు వింటూ, కిమ్ కర్తవ్యమ్ ? అని ఆలోచిస్తున్నాడు, ధర్మవర్తి.
స్వస్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి