5, అక్టోబర్ 2020, సోమవారం

ఆదిపర్వము-40

 

వశిష్టుడు, కల్మాషపాదుని వృత్తాంతం


అప్పుడు అర్జునుడు అంగారపర్ణుని చూసి “గంధర్వా, మా పూర్వులకు గురువులు, పురోహితులు అయిన వశిష్టుని గురించి వినాలని ఉంది” అని అడిగాడు. అప్పుడు అంగారపర్ణుడు, అర్జునునితో ఇలా చెప్పసాగాడు.

పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఒక రోజు తన సేనలతో వేటకు వెళ్ళాడు. వేటాడి అలసిపోయి సమీపములో ఉన్న వశిష్ట మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. వసిష్టుడు విశ్యామిత్ర మహారాజుకు అథితి సత్కారాలు గావించాడు. వశిష్టుని వద్ద నందిని అని ఒక కామధేనువు ఉంది. విశ్వాంత్రునికి, అతని అపార సేనావాహినికి భోజన సత్కారాలు చెయ్యమని నందినికి చెప్పాడు. నందిని వారందరికి ఇష్టమైన వంటకాలతో భోజనం పెట్టింది. ఇది చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు.

లక్ష పాడి ఆవులు ఇస్తాను ఆ కామధేనువును ఇమ్మని వశిష్టుని అడిగడు విశ్వామిత్రుడు. వసిష్టుడు దానికి నిరాకరించాడు. బలవంతంగా ఆ ధేనువు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు. నందిని వశిష్టుని వైపు చూసింది. వసిష్టుడు మౌనంగా చూస్తున్నాడు.

నందిని విజృంభించింది, తన శరీరం నుండి అనేక మంది సైన్యాలను పుట్టించింది. వారందరూ విశ్వామిత్రుని సైన్యాలను చీల్చి చెండాడారు.

విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయింది. క్షాత్రబలం కన్నా తపోబలం గొప్పది అని తెలుసుకున్నాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోయాడు. దివ్య శక్తులను పొందాడు. కాని వశిష్టుని మీద మత్సరం మానలేదు.

వశిష్టుడు కల్మాష పాదుడు అనే మహారాజుకు యాజకుడు(యజ్ఞములు చేయించే పురొహితుడు)గా ఉంటున్నాడు. కల్మాష పాదునకు యాజకుడు కావాలని విశ్వామిత్రుడు కూడా ప్రయత్నిస్తున్నాడు.

ఒకరోజు కల్మాషపాదుడు వేటకు వెళ్ళాడు. అలసిపోయి సమీపములో ఉన్న వశిష్టుని ఆశ్రమానికి వెళుతున్నాడు. దారిలో వశిష్టుని నూర్గురు కుమారులలో పెద్ద వాడైన శక్తి ఎదురుగా వస్తున్నాడు. కల్మాష పాదుడు గర్వంతో శక్తిని తప్పుకొని తనకి దారి ఇవ్వమన్నాడు.

“రాజా, ఎంతటి గొప్ప వారైనా, బ్రాహ్మణులు ఎదురుగా వచ్చినపుడు తప్పుకొని దారి ఇస్తారు. ఇది ధర్మం” అని అన్నడు. ఆ మాటలకు కోపంచి, కల్మాష పాదుడు తన చేతికర్రతో శక్తిని కొట్టాడు.

శక్తికి కోపం వచ్చి “నన్ను రాక్షస బుధ్ధితో అవమానించావు. నువ్వు రాక్షసుడివై నరమాంసం తింటూ జీవించు” అని శాపం ఇచ్చాడు.అప్పుడు కళ్లు తెరిచాడు కల్మాష పాదుడు. అతనిని వశిష్టుని పెద్ద కుమారుడిగా గుర్తించి, శాప విమోచన కొరకు ప్రార్థించాడు.

ఇదంతా దూరం నుండి చూస్తున్న విశ్వామిత్రుడు, కల్మాష పాదుని మనసులోకి కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి కల్మాష పాదుడు రాచ కార్యాలు మానివేసాడు.

ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కల్మాష పాదుని వద్దకు వచ్చాడు. తనకు మాంసాహార భోజనం కావాలని అడిగాడు. సరే అని వెళ్లాడు కాని మరిచిపోయాడు. రాత్రి పొద్దు పోయిన తరువాత ఆ విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే వంట వాడిని పిలిచి “నేను ఒక బ్రాహ్మణుడికి మాంసాహార భోజనం పెడతాను అని చెప్పాను. అతనికి భోజనం పెట్టు” అని చెప్పాడు.

దానికి వంట వాడు “మహారాజా, ఈ రాత్రప్పుడు మాంసం ఎక్కడ దొరుకుతుంది?” అని అన్నాడు. అప్పటికే కింకరుడు కల్మాష పాదుని మనసులో ఆవేశించి ఉండటం వల్ల “నీ ఇష్టం. నర మాంసమైనా వండించు పెట్టు” అని అన్నాడు.


సరే అని వంటవాడు ఆ బ్రాహ్మణుడికి నరమాంసం రుచిగా వండి పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు దానిని తిన్నాడు. కాని తాను తిన్నది నరమాంసం అని గ్రహించాడు. ఆ బ్రాహ్మణునికి కోపం వచ్చి, “నర మాంసంతో నాకు భోజనం పెట్టావు కాబట్టి నువ్వు నరమాంసం తినే రాక్షసుడివై పో” అని శాపం పెట్టాడు. వెంటనే కల్మాష పాదుడు రాక్షసుడిగా మారిపోయాడు.

కల్మాష పాదుడు వెంటనే శక్తి వద్దకు వెళ్లి “దీనికంతా నువ్వే కారణం ముందు నిన్నే తింటాను” అని శక్తిని చంపి తిన్నాడు. అంతటితో ఆగకుండా వశిష్టుని పుత్రులందరిని చంపి తిన్నాడు.

తన నూర్గురు పుత్రులూ రాక్షసునికి ఆహారం కావడం చూసి వశిష్టుడు తట్టుకోలేక పోయాడు. పుత్ర శోకంతో కుమిలి పోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఎంతో ప్రయత్నించాడూఉ. కాని సఫలం కాలేదు.

ఇదంతా శక్తి భార్య, వశిష్టుని కోడలు, అదృశ్యంతి చూస్తూ ఉంది. అప్పుడు ఆమె గర్భవతి. ఆమె కడుపులో ఉన్న బిడ్డ వేద్దాలు సుస్వరంతో వల్లె వేస్తున్నాడు. అది విని వశిష్టుడు ఆశ్చర్యపోయాడు. తన మనుమడిని చూడాలని అనుకున్నాడు. ఆత్మహత్యా యత్నం విరమించాడు.

ఒకరోజు రాక్షస రూపంలో ఉన్న కల్మాష పాదుడు అదృశ్యంతి మీద పడి చంపపోయాడు. వశిష్టుడు మంత్ర జలం చల్లాడు. కల్మాష పాదుడు శాప విముక్తుడు అయ్యాడు. కల్మాష పాదుడు వశిష్టునకు నమస్కరించి “మహామునీ నీ దయవల్ల నాకు శాప విమోచనం అయింది” అన్నాడు.

“బ్రాహ్మణులను అవమానితే వచ్చే అనర్థాలు చూసావు కదా. ఇంకనైనా బ్రాహ్మణులను పూజించు” అని హితభోధ చేసాడు. వశిష్టుని ఆశీర్వాదము తీసుకొని కల్మాష పాదుడు అయోధ్యా నగరానికి వెళ్లి రాజ్యం చేస్తున్నాడు.


కాని రాక్షస రూపంలో ఉన్నపుడు కల్మాష పాదుడు, ఒకనాడు, ఒక బ్రాహ్మణ దంపతులు కామ క్రీడలలో ఉండగా, ఆ బ్రాహ్మణుడిని చంపి తిన్నాడు. దానికి కోపించి ఆ బ్రాహ్మణ వనిత “స్త్రీతో సంభోగం చేసినపుడు నువ్వు కూడా నా భర్త మాదిరి చస్తావు” అని శపించింది. అందువలన కల్మాష పాదుడు భార్యతో కలిసి సంతానం పొందలేకపోయాడు.

సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో, వశిష్టుని తనకు సంతానం ప్రసాదించమని కోరాడు. వశిష్టుడు అలాగె అన్నాడు. కల్మాష పాదుడు ఋతుస్నానం చేసిన తన భార్య మదయంతిని వశిష్టుని వద్దకు పంపాడు. అతని అనుగ్రహంతో మదయంతి గర్భం దాల్చింది. పన్నెండేఅళ్లు గడిచాయి. కాని ఎంతకూ ప్రసవం కాలేదు. అందుకని ఒక పదునైన రాతి ముక్కతో తన గర్భం చీల్చుకుంది. ఆమెకు అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు.

అదే సమయానికి వశిష్టుని పెద్ద కుమారుడైన శక్తి భార్య అదృశ్యంతికి కూడా ఒక పుత్రుడు కలిగాడు. అతనే పరాశరుడు. పరాశరుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. తన తంద్రి శక్తిని ఒక రాక్షసుడు చంపాడని తన తల్లి వలన తెలుసుకున్నడు. తన తపో మహిమతో లోకాలన్నీ భస్మం చెస్తానని శపథం చేసాడు. అది విని వశిష్టుడు అతనిని వారించాడు.Cont...

“పరాశరా, అది ధర్మము కాదు. పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు భృగువంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలను, యాగాలను చేసారు. కృతవీర్యుడు వారికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు. దానిని వారు దాచుకున్నారు. తరువాతి కాలంలో కొంత మంది క్షతియులు “భృగువంశ బ్రాహ్మణులు కృతవీర్యుయుని ధనాన్ని అపహరించి దాచుకున్నారు” అని అపప్రధ పుట్టించారు.

అదివిని కొంతమంది బ్రాహ్మణులు తమ వద్ద ఉన్న ధనాన్ని ఆ క్షత్రియులకు ఇచ్చారు. మరికొంతమంది బ్రాహ్మణులు ఆ ధనాన్ని భూమిలో పాతిపెట్టారు. క్షత్రియులు ఇది చూసి, ఆ బ్రాహ్మణులను చంపి ఆ ధనం తీసుకుని వెళ్లారు. భృగువంశ బ్రాహ్మణులనందరిని, గర్భంలో ఉన్న బిడ్డలతో సహ చంపారు. ఆడు వారందరూ వీరికి భయపడి హిమాలయాలకు వెళ్లిపోయారు.

అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తొడలో గర్భం ధరించింది. ఆమె తొడలో నుండి ఔర్వుడు అనే అత్యంత తేజోవంతుడైన కుమారుడు జన్మించాడు. అతని తేజస్సుకు, కృతవీర్యుని వంశంలోని క్షత్రియులందరు దృష్టి కోల్పోయి గుడ్డి వాళ్లయ్యారు.

తరువాత ఔర్వుడు తన తండ్రి, మిగిలిన బంధువులు ఒక్కసారి చనిపోయారని తెలుసుకొని, లోకాలన్నింటిని నాశనం చెయ్యాలని సంకల్పించి, ఘోర తపస్సు చెయ్య సంకల్పించాడు. అతని పిత్దేవతలు ఔర్వుని చూసి “మేము అసమర్థులమై క్షత్రియులచేత చంపబడ లేదు. మేము ధనమునకు ఆశపడి ధనమును దాచలేదు. మేము ఎంతో తపస్సు చేసాము. మా తపో మహిమ వలన మాకు మరణం రావడం లేదు. ఆత్మహత్య చేసుకుందామంటే అది పాపము అని తెలుసు. ఈ మనుష్య లోకంలో ఎక్కువ కాలము ఉండలేము. అందువలన మేము కావాలనే క్షత్రియులతో వైరం తెచ్చుకుని వారి చేతిలో చంపబడ్డాము.కాబట్టి ఆ కారణం చేత నువ్వు లోకాలను నాశనం చెయ్యడం ధర్మం కాదు” అని పలికారు.

వారి మాటలు విని, ఔర్వుడు సంకల్పం విరమించుకున్నాడు. కాబట్టి పరాశరా! కోపంతో నువ్వు చెయ్యబోయె తపస్సు మంచిది కాదు. కనుక శాంతం వహించు” అని చెప్పాడు. వశిష్టుడు. తాతగారి మాటను మన్నించి, ఆ సంకల్పం విరమించుకున్నాడు పరాశరుడు.

కాని తన తండ్రి శక్తిని, పిన తండ్రులను చంపిన రాక్షసుడి మీద కోపం పోలేదు. రాక్షసవినాశనానికి సత్రయాగం చెయ్యడానికి సంకల్పించాడు. దానికి వశిష్టుడు కూడా అడ్డు చెప్పలేదు. ఆ సత్రయాగంలో దుర్మార్గులైన రాక్షసులందరూ పడి మల మలా మాడిపోతున్నారు.

అలా రాక్షస జాతి అంతరిస్తుంటే చూసి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు వశిష్టుని దగ్గరకు వచ్చారు. పరాశరుడు చేసే రాక్షస వినాశనాన్ని ఆపమని కోరారు. వారి కోరిక మేరకు పరాశరుడు తన సత్రయాగాన్ని, రాక్షస వినాశనాన్ని ఆపుచేసాడు.” అని అంగార పర్ణుడు అనే గంధర్వుడు అర్జునునితో చెప్పాడు.

తరువాత అర్జునుడు ఆ గంధర్వుని చూసి, “మిత్రమా, ఇక్కడ మాకు ఎవ్వరూ తెలియదు. నువ్వే మాకు దారి చూపించాలి. మంచి పురోహితుడు ఎవరో చెప్పాలి” అని అడిగాడు.

“అర్జునా, ఇక్కడికి సమీపంలో ఉత్కంచం అనే పుణ్యతీర్థం ఉంది. అక్కడ ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నాడు. మీరు అతనిని పురోహితునిగా చేసుకోండి” అని చెప్పాడు

కామెంట్‌లు లేవు: