5, అక్టోబర్ 2020, సోమవారం

అమరలింగేశ్వర స్వామి*

 పరమ శివుడు కొలువైన పంచారామ క్షేత్రాలు శ్రీ అమరలింగేశ్వర స్వామి*


(అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం) దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు.


పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు.


రెండోది ‘ద్రాక్షారామం’. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలుస్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ.


మూడోది ‘కుమారారామం’. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్య సుందర స్వరూపంలో కుమారస్వామి ప్రతిష్టించాడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా వాసికెక్కారు.


నాలుగో ఆరామం ‘సోమారామం’. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా గునుపుండి (భీమవరం) లో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజ లందుకుంటున్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్య నూతనంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవక్షేత్రం ఇది.


ఐదో ఆరామం ‘క్షీరారామం’ (పాలకొల్లు). ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. అమ్మ పార్వతీ మాత. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టితమై ఈశాన్య ముఖుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు.


పంచారామాలన్ని ఒకే రోజులో సందర్శించాలను కుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను క్రమంగా దర్శించుకోవలసి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు, కాశీ క్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు.


*1. అమరారామం*


శంకరుడులో ‘శం’ అంటే శుభాన్ని, ‘కరుడు’ అంటే కలిగించే వాడనే అర్థం దాగుంది. స్థల పురాణం ప్రకారం తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి తారకుని కంఠంలో ఉన్న శివలింగాన్ని చేధించగా ఏర్పడిన అయిదు శకలాల్లో (ముక్కలు) పెద్దది, మొదటి శకలం పడిన చోటు ఈ అమరారామం. ఈ అమరావతి పూర్వ నామం ‘ధాన్య కటకం’.


కృష్ణా నదీ తీరంలో వెలసిన మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో అమరేశ్వర లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్టించాడు. అందువల్లే ఇక్కడి శివయ్య అమరేశ్వరుడయ్యాడు. ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంధ, బ్రహ్మ, పద్మ పురాణాలలో చెప్పారు. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్థంభాలున్నాయి. దక్షిణ ముఖంగా ముఖ మండపం, తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణవేణి ప్రవాహం ఉంది. దీనినే ‘పంచాయతన క్షేత్రం’ అంటారు. దీనికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. మూల విరాట్‌ శ్రీ అమరలింగేశ్వర స్వామి. ఈయన మూడు అడుగుల ఎత్తులో లింగాకారుడై కొలువు తీరాడు. పై అంతస్తులో తొమ్మిది అడుగుల ఎత్తైన లింగం ఉంది. అమరావతి క్షేత్రం నుంచి కృష్ణానది ఎనిమిది వందల మైళ్ళు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.


కృష్ణానదీ తీరానికి దగ్గరున్న ఈ అమరావతి క్షేత్రంలో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకునే భక్తులు జీవన ముక్తులవుతారని పురాణాలలో చెప్పారు. త్రిలోక ప్రసిద్ధమైన ఈ అమరేశ్వర తీర్థం ఉత్తమమైంది. అమరేశ్వరస్వామిని దర్శించడం వలన వేయి గోవులను దానమిచ్చిన ఫలితంతో పాటు, పునర్జన్మ ఉండదని పురాణ ప్రవచనం. ఇక్కడ శివుణ్ణి ప్రణవేశ్వరుడు, అగస్తేశ్వరుడు, కోసలేశ్వరుడు, సోమేశ్వరుడు, పార్థివేశ్వరుడు అనే నామాలతో కీర్తిస్తున్నారు. ఈ క్షేత్రంలో మూడు రోజులు ఉండి అమరేశ్వరున్ని భక్తితో సేవించినట్లయితే మంచి జరుగుతుందని శివ భక్తులు నమ్ముతారు.


శివుడు వెలసిన ఈ పంచారామ క్షేత్రాలను మీరూ దర్శించి తరించండి. 

కామెంట్‌లు లేవు: