5, అక్టోబర్ 2020, సోమవారం

15-14-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - జీవులు భుజించు ఆహారమును తానే పచనమొనర్చుచున్నానని భగవానుడు చెప్పుచున్నారు -

 

అహంవైశ్వానరో భూత్వా 

ప్రాణినాం దేహమాశ్రితః | 

ప్రాణాపానసమాయుక్తః 

పచామ్యన్నం చతుర్విధమ్ ||


తాత్పర్యము:- నేను ‘వైశ్వానరుడ'ను జఠరాగ్నిగానయి ప్రాణులయొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపానవాయువులతో గూడుకొని నాలుగువిధములగు అన్నమును పచనము చేయుచున్నాను.


వ్యాఖ్య:- క్రిందటిశ్లోకములో భగవానుడు తాను సస్యములను పోషించుటద్వారా జీవులు తిను అన్నమును సృష్టించుచున్నానని పలికి, ఇపుడా యన్నమును తానే జీవుల శరీరములందు పచనమొనర్చుచున్నానని వచించుచున్నారు. శరీరము ఆహారముచే నేర్పడుచున్నది. ఆ యాహారము జఠరాగ్నిచే పక్వముకానిచో, రక్తాదులద్వారా శరీరమంతటను వ్యాపించనేరదు. కావున జఠరాగ్ని శరీరమున కీలకస్థానమాక్రమించుకొనియున్నది. భగవానుడు తానే జఠరాగ్నిరూపమున అచ్చోట వర్తించుచున్నారని చెప్పుటవలన, దేహ నిర్మాత, దేహపోషణకర్త వారేయని స్పష్టమగుచున్నది. ఈ ప్రకారముగ ఆహారమును ధాన్యాదులద్వారా సృజించి, మఱల దానిని చక్కగా పచనముచేసి శరీరమునకు పుష్టిని కలుగజేయుచు జీవులకు మహోపకృతి నొనర్చుచున్న ఆ పరమాత్మకు కృతజ్ఞత చెల్లించక, ఆ అన్నము వారికి నివేదించక భుజించువాడు ఎంతటి కృతఘ్నుడు? అట్టివాడు దొంగయే యగునని పూర్వము శ్రీకృష్ణమూర్తి చెప్పియుండుట గమనించదగినది. [యో భుఙ్క్తే స్తేన ఏవ సః (3-12)] కనుకనే ఆహారమును భుజించుటకు ముందు దేవునకు ‘నైవేద్యము’ సమర్పించు ఆచారము లోకములో నేర్పడినది. అట్లు దేవునకు నివేదింపకుండ, దైవభావనలేకుండ భుజించునది అపవిత్రమే కాగలదు. కాబట్టి ప్రతివారును తాము భోజనముచేయుటకు ముందుగా, తమ యాహారమును దైవమునకు సమర్పించి, లేక అందలి కొంతభాగమును దైవస్వరూపులేయగు భూతకోట్లకు పెట్టి, భగవద్భావనతో భుజించవలెను. అప్పుడా భోజనమను క్రియ యజ్ఞముగాను, భుజించుపదార్థము అమృతముగాను మారిపోవును. 

  ‘ప్రాణినాం దేహమాశ్రితః’ - అని చెప్పుటవలన భగవంతుడు అతిసమీపమున దేహమందే యున్నాడని నిశ్చతమగుచున్నది. కావున తమ శరీరమున దైవసన్నిధానమును అనుభవించుచు, భగవద్భక్తిగలిగి, పాపాచరణలేక జనులు పవిత్రమార్గమునే చేబట్టవలెను.

      'పచామ్యన్నం చతుర్విధమ్’ - పరమాత్మ జీవుల శరీరములో జఠరాగ్నిరూపమున వర్తించుచు, వారు తిను నాలుగు విధములైన ఆహారమును జీర్ణమొనర్చుచున్నారని తెలుపబడినది.

నాలుగు విధములైన ఆహారము - (1) భక్ష్యము (2) భోజ్యము (3) లేహ్యము (4) చోష్యము.

(1) భక్ష్యము = దంతములచే కొఱకి తినబడు కఠినపదార్థములు, పిండివంటలు, కూరగాయలు మున్నగునవి.

(2) భోజ్యము = నాలుకచే చప్పళించి మ్రింగబడు మెత్తటి వస్తువులగు అన్నము మొదలైనవి. 

(3) లేహ్యము = నాలుకచే రుచిచూడబడు పచ్చళ్లు మొదలైనవి.

(4) చోష్యము = నోటిచే జుఱ్ఱబడు పాయసము, చారు, మజ్జిగ మున్నగునవి.

 ఇట్టి యాహారమును భగవానుడే జీర్ణమొనర్చుచుండుటవలన ఇక ఆహారవిషయమై మనుజుడెంత జాగరూకుడుగా నుండవలెనో యోచించుకొనవలయును. ఆహారసంబంధముగ ఈ క్రింది జాగ్రతలను పాటించుట ఉత్తమము - (1) అమితముగా భుజించి జీర్ణకర్తయగు భగవంతునకు పనిని కల్పించరాదు. (2) సాత్త్వికాహారమునే భుజించవలెను. రాజస, తామసాహారములను వర్జించవలెను*. (3) తిను ఆహారమును భగవంతునకు ముందుగా భక్తితో నివేదించవలెను. (4) ఆ యాహారము న్యాయార్జితవిత్తముచే నేర్పడినదిగా నుండవలెను. అధర్మమార్గముద్వారా సంపాదించిన ధనముతో పంచభక్ష్యపరమాన్నములను భుజించుట కంటె, న్యాయార్జితమైన సొత్తుతో లభించిన అంబలి త్రాగి బ్రతుకుట ఉత్తమము. భగవానుడు ప్రతివాని కడుపులో దాగి అంతయు గమనించుచున్నారు. కావున ఆహారాదివిషయములలో జనులు బహుజాగరూకులై యుండవలెను.

ఈ ప్రకారముగ ఈ అధ్యాయములో ఆహారవిషయమైన ప్రస్తావన విశేషముగ వచ్చియుండుటంబట్టి భోజనకాలమున ఈ అధ్యాయమును పఠించు ఆచారము లోకమున ఏర్పడినది. అనేక ఆశ్రమములందును, మఠములందును, గృహములందును ఈ అధ్యాయమును సమష్టిగా గాని వ్యష్టిగా గాని భోజనకాలమున జనులు పఠించి తదుపరి ఆహారమును సేవించుచుందురు. ఈ ప్రకారముగ భగవద్భావనతో భుజించువానికి పెట్టబడు అన్నము సాక్షాత్ భగవంతునకు పెట్టబడినట్లేయగును. అంతటి పుణ్యమాతనికి తప్పక లభింపగలదు. మఱియు దైవధ్యానముతో భుజించుటవలన మనుజుని శరీరములోని అణువణువు దైవశక్తితో గూడియుండును.

భోజనముచేయుటకు ముందుగా 15వ అధ్యాయమంతయును చెప్పి చివఱకు చేతిలో తీర్థమును గ్రహించి " బ్రహ్మార్పణం బ్రహ్మహవిః -' అను గీత 4వ అధ్యాయములోని 24వ శ్లోకమును భక్తితో పఠించి పిదప ఆ నీటిని అన్నముపైచల్లి ఆ పిదప భుజించుట ఉత్తమము.

ప్రశ్న:- పరమాత్మ జీవుల శరీరములందు ఏ రూపమున వెలయుచున్నాడు? 

ఉత్తరము:- (వైశ్వానరుడను) జఠరాగ్నిరూపమున. 

ప్రశ్న:- అట్లుండి యాతడేమి చేయుచున్నాడు?

ఉత్తరము:- ప్రాణాపానవాయువులతో గూడి జీవులు భుజించు ఆహారమును పచనమొనర్చుచున్నాడు.

ప్రశ్న:- కాబట్టి జను లేమి చేయవలెను?

ఉత్తరము:- తమశరీరముననే వెలయుచున్నట్టి ఆ పరమాత్మను భక్తితో ధ్యానించుచు, తాము భుజించుటకు ముందుగా నాతని కర్పించి, దైవభావనతో భుజించవలెను.

~~~~~~~~~~~~~~

* సాత్త్విక, రాజస, తామసాహారముల వివరణమునకై 17వ అధ్యాయములోని 8,9,10వ శ్లోకములను జూడుడు. 

~~~~~~~~~~~

కామెంట్‌లు లేవు: