5, అక్టోబర్ 2020, సోమవారం

*పంకజం పదనిసలు :- 22*

  (1975 ఎ లవబుల్ స్టోరీ)

             🌷🌷🌷

బడికెళుతూ దారిలో పంకజంతో కబుర్లు చెబుతూ నడుస్తున్నాను. భుజాన చాకలి మూటలా స్కూలు బ్యాగూ, చేతిలో లంచిబ్యాగూ రెండూ మోస్తూ అచ్చం పొలంలో కాడిమోసే ఎద్దులా బడికెళ్ళే నేను, నేనేముంది లెండి. ఆరోజుల్లో అందరూ అంతే! ఈ రోజు లంచిబ్యాగు లేకుండా చేతులూపుకుంటూ నడుస్తుంటే" అయ్యో లంచి బ్యాగేదీ, మర్చిపోయావా" అని కంగారుపడింది పంకజం. అప్పట్లో పంకజంకూడా నా లానే చిన్నపిల్లేలెండి. 


"కాదు, ఈరోజు కార్తీక పౌర్ణమి నేను ఉపవాసం తెలుసా! " అన్నాను. "ఉపవాసమా హమ్మో ! మూడు కిలోమీటర్లు స్కూలుకి నడవాలి మళ్ళీ వచ్చేటప్పుడు అంతదూరం తిరిగి రావాలి అంతసేపు ఉండగలవా? రాత్రికేగా ఇంక అన్నం తినేదీ" అని ఆశ్చర్య పోయింది. 


"అవును పొద్దున్నే అమ్మమ్మతో సాగర్ కాలువలో స్నానం కూడా చేను తెల్సా" అన్నాను గొప్పగా." చాల్లే, గొప్పలు సాయత్రం దాకా ఎమీ తినకుండా ఉండు అప్పుడు చూద్దాం" అంది ఎగతాళిగా" ఏం ఫర్లేదు అరటి పళ్ళు తినొచ్చు ఇదిగో, అమ్మ ఇచ్చింది నాలుగు అరటి పళ్ళు. ఇంకా ఏవైనా పండ్లు తినమని రూపాయి ఇచ్చింది తెలుసా" అన్నాను.


స్కూలుకి వచ్చే సరికి మొదటి గంట మోగింది. బైట జామకాయల బండి మీద తెల్లజామ కాయలు ఊరిస్తున్నాయి. గబగబా వెళ్ళాను కొనుక్కుందాం ఎందుకైనా మంచిది మధ్యలో ఆకలేస్తుందేమో, అని. 


ఒక కాయ పదిపైసలు. పావలాకి మూడు కొన్నాను బేరం చేసి. జాగ్రత్తగా సంచిలో దాచి హడావుడిగా అసెంబ్లీలో వెనగ్గా నిలబడ్డాను. జనగణమన టైం కే కడుపులో ఆకలి మొదలైంది. గబగబా రెండరటిపండ్లు తినేసి క్లాసులోకి జొరబడ్డాను. 


ఇంగ్లీషు మనకి వీజీ! పైగా సూజన్ టీచర్ చెప్పే పాఠం భలే వినబుద్ధేస్తుంది. నా వెనక లైన్లో అన్నపూర్ణ చిన్నగా నా షర్టు పట్టుకు లాగుతోంది. లెక్కల హోంవర్క్ నోట్స్ దానికిచ్చేసి శ్రద్ధగా పాఠం విన్నాను. ఆరోజు ఇంగ్లీష్ హోవర్క్ పుస్తకం టీచర్ పక్కనే బొత్తిలో పెట్టేసాను. 


తరువాత లెక్కల పీరియడ్. ఇది మాత్రం మనకి గొంతులో పచ్చివెలక్కాయే. నెమ్మదిగా వెనక లైనుకి చేరిపోయాను. నా వెనుకే అన్నపూర్ణ కూడా దాని పుస్తకాల బుట్టేసుకుని వచ్చేసింది." ఇదుగోనబ్బా నీ హోంవర్కు. రోజూ నేనేచేస్తే నీకేమొస్తుందీ." అంది. హుష్ గట్టిగా అరవకు అన్నాను. ఏవిటో, తిన్న రెండరటిపళ్ళూ అప్పుడే అయిపోయాయి. నెమ్మదిగా బాగులోంచి జామకాయ తీసాను. "ఏంటదీ" అంది, అది గుడ్లగూబలా చూస్తూ "జాంకాయి" అన్నాను స్కర్ట్ కింద జాంకాయి పెట్టి పైనించి కొరికి దానికో ముక్క చేతిలో పెడుతూ" ఇవాళ నేను ఉపవాసం తెలుసా" చెప్పాను దానికి. 

లెక్కల టీచర్ క్లాసులోకి రాగానే "గుడ్మానింగ్ టీచర్" అని అందరం అరిచాం. ఆ రోజు మాటీచర్ బ్లాక్ బోర్డు జోలికి వెళ్ళకుండా పోయిన వారం జరిగిన యూనిట్ పరిక్ష పేపర్లు ఇవ్వసాగింది. అందరి పేపర్లూ వచ్చాయి నాదెందుకు రాలేదా అని చూస్తుంటే, "ఆరెస్సూ, ఇట్రా" అని పిలిచింది. 


మనకెలాగూ లెక్కల్లో ఫస్టు రాదు. ఇది నాకేకాదు మాక్లాసులో అందరికీతెలుసు. అలాగని సున్నరాదని గట్టి నమ్మకం. అన్నపూర్ణ పాపం బానే చూపిస్తుంది పరిక్షలో, సందేహంగా వెళ్ళిన నన్ను "ప్రేమాభిషేకం సినిమాలో హీరోయిన్నెవరు?" అని అడిగింది." ఇద్దరూ శ్రీదేవీ , జయసుధ" నాసమధానం. 


"మిస్సమ్మసినిమాలో ఒక పాటపాడూ, కరుణించుమేరి మాతా, శరణింక మేరిమాతా". "ఇంక ఆపు a+b హోల్ స్క్వేర్ ఎంతో చెప్పు". భయంకరమైన నిశ్శబ్దం. గొంతు పెగిలి ఒక్క మాట రాలేదు." ఇవ్వాళ హోం వర్క్ చేశావా." గబగబా బుర్రూపాను." నువ్వేచేశావా?" "అవునండీ". "రేపణ్ణించీ నా కుర్చీ పక్కనే కూర్చో,ఎంచక్కా క్లాసులో అందరూ కనిపిస్తారు" అన్నారు. పాపం ఆవిడకి మిగిలిన సబ్జెక్టుల్లో మంచిమార్కులు తెచ్చుకుంటూ లెక్కల్లో గుడ్లుపెడుతున్నానని బాధ. "అలాగేనండీ" అన్నాను. అంతా అబద్ధం అందరికీ నేనే కనిపిస్తాను. 


మిగిలిన సబ్జెక్ట్స్ బానే వస్తాయిగానీ, అదేంటో లెక్కల్లో మరీ బీదదాన్ని నేను. ఇంటర్వెల్ లో మిగిలిన జామకాయలు తినేసి , ఇంకో పావలాకి బోలెడు గంగి రేగ్గాయలు తెచ్చుకున్నాను. 


అన్నం బెల్లు లో అందరూ "రాబ్బా అన్నం తిందాం "అని పిలిచిన వాళ్ళకూ పిలవని వాళ్ళకూ ఉపవాసం సంగతి చెప్పేశాను. కానీ అన్నాల దగ్గర అదొక సందడి. అమ్మమ్మ వారానికి మూడురోజులు చేసే బంగాళాదుంప వేపుడు రాజీకి చాలా యిష్టం. అది నంచుకోటానికి తెచ్చుకునే బూందీ నాకిచ్చి , నాకూర అది తీసుకునేది. ఇక అన్నపూర్ణ తెచ్చే పప్పొడుం అందరికీ ఫావరెట్. దాన్ని గన్ పౌడర్ అనేవాళ్ళం లెండి. 


ఇంక మేరీ పెరుగన్నం లోకి తెచ్చుకునే గరుగ్గాయలు ఉప్పూ, నిమ్మరసంలో ఊరేసి భలే ఉండేవి. నా మాగాయి ముక్క దానికిచ్చి నేనవి తీసుకునేదాన్ని. ఈ రకంగా అన్నాలు తినేసి ఎంచక్కా బాక్సులు కడిగి పంపునీళ్ళు తాగేవాళ్ళం. అదంతా మిస్సయి ఒంటరిగా కూచుంటే, పార్వతీ టీచర్ చూసి" ఏంటోయ్ ఒంటరిగా కూచున్నావ్ అన్నం తిన్నావా" అంటే "నేను ఉపవాసం టీచర్" అని చెప్పేశాను. "అవునా,అయ్యో, ఆకలేస్తోందా ఇదితిను" అంటూ బాగులోంచి యాపిల్ తీసిచ్చింది. 


పంకజం మాత్రం అన్నం తింటున్న వాళ్ళమధ్య, నామధ్య తిరుగుతూ బాక్సుల్లోకి ఎవరేమి తెచ్చుకున్నారో చెబుతోంది. "చాల్లే ఇంక చెప్పకు, అసలే ఆకలేస్తుంటే" అని విసుక్కున్నాను. 


సాయంత్రం దాకా కాలక్షేపం చేసి చిన్నగా కాళ్ళీడ్చుకుంటూ ఇంటిదాకా నడిచివచ్చేసరికి బొత్తిగా గాలితీసేసిన బెలూన్ లా ఉంది పరిస్థితి. కాళ్ళూ, చెతులు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెడుతూనే అమ్మమ్మ "అమ్మడూ, చకచకా పాలు తాగేసి, స్నానం చేసేసి రా నాకు కాస్త వంటలో సాయం చెద్దువూ, నీకు మడి లంగా, జాకెట్టూ బాత్ రూం గోడ మీదపెట్టాను" అని కేకేసింది.

స్నానం చేసి వచ్చేసరికి తులసికోటకు పక్కగా వెలిగించిన కుంపటీ, పక్కనే కంచు తవ్వతప్పాలా, చిన్ని పప్పు గిన్నే, ఒక స్టీలు గిన్నే, ఒక చిల్లుల పళ్ళెం, ఇంకో రెండు సిబ్బిరేకులూ చక్కగా అమర్చి ఉన్నాయ్ అచ్చం బాపూగారి సినిమాలో లాగా. 

ఆసరికే పొంగలి చేసి , స్టీలుగిన్నెలో కుమ్మరించేసి మూత పెట్టేసింది. చామ దుంపలు కూడా ఉడకేసి చిల్లుల పళ్ళెం లో వేసి వొలుస్తోంది. "అమ్మడూ, కాస్త చెట్లన గోంగూర ఉంది కోసుకురా. ఆచేత్తోనే కొంచెం కొత్తిమీర కూడా" అని పురమాయించింది. గోంగూర, కోత్తిమీర కోసుకుని బావి దగ్గర వాటిని శుభ్రంగా కడిగి పట్టుకొచ్చాను. నాలుగు బాదమాకులు కూడ కడిగి తెచ్చిచ్చాను. ఈలోగా కూర తిరగమోత చేసేసి చిల్లుల పళ్ళెంలో బాదమాకులు వేసి కూర సర్దింది. కందిపప్పు గిన్నెలో కడిగి ఎసరు పోసి కుంపట్లో పెట్టి, "నేను దీపాలు రడీచేస్తాను ఈ లోగా వంట చూడు" అని ఇంట్లోకి వెళ్ళింది. ఈలోగా నేను మాదొడ్లో దూరంగా కనిపించే కోటప్పకొండా, అందమైన వరిచేలూ, పడమటివైపు ఆకాశానికి ఎర్రరంగు వేసుకుంటున్న సూరీడు వైపూ చూస్తూ ఆనందించేలోగా "అమ్మడూ పప్పుఉడికిందేమో చూడూ" అమ్మమ్మ కేక. "ఎలా చూడాలి అమ్మమ్మా" అంటే " గరిటతో పప్పు తీసి ఒక గింజ బండమీద వేసి వేలితో నొక్కు. కొంచెం చిదిగిందంటే, ఉడికినట్లు. ఇప్పుడు గోంగూరా, పసుపు, ఒక్క చింతుట్టీ వెయ్యి. ఐదు నిముషాలాగి నీ చిన్నచేత్తో చారెడు ఉప్పెయ్యి. పది నిముషాలాగి రెండు చెంచాల కారమెయ్యి" అమ్మమ్మసలహా. 


అలా అమ్మమ్మ సలహా, సంప్రదింపులతో, పప్పు పూర్తిచేసి, అన్నం పొయ్యికి ఎక్కించాను. పావుగంటకి "అమ్మలూ అన్నం ఉడికిందా, నీరు తీసిందా" అమ్మమ్మ కేక. "ఎలా చూడాలి అమ్మమ్మా" గిన్నె పక్కవైపు నీళ్ళు వేలితో అలా చిలకరించు,చుర్రుమంటే దింపెయ్." ఓహో అన్నం కూడా వండేశా!

"ఒక దోసకాయ్ తెచ్చి కుంపట్లో పడెయ్, నే వస్తున్నాలే" అమ్మమ్మ కేకవిని ఒక దోసకాయ తెచ్చి కుంపట్లో వేశాను. 


కాసేపటి తర్వాత అమ్మమ్మ వచ్చి కాలిన దోసకాయ పొట్టుతీసి విచ్చతీసి ఆరబెట్టి,

నిమ్మకాయంత చింతపండూ, పది పచ్చిమిర్చీ, చారెడు ఉప్పూ, కాసింత కొత్తిమేరా, కాల్చిన దోసకాయా నాచేత రోట్లో నూరిచ్చి కమ్మగా నేతి తిరగమోత పెట్టేసింది. 


చివరిగా కాస్త చింతపండు రసంతీసి కొత్తిమేరా, కరేపాకూ, ఉప్పూ , బెల్లమ్ముక్కా కలిపి కుంపటి మీద పెట్టి, పూజ చేసి నాచేత కూడా దీపాలు వెలిగించి వాకిట్లోనూ తులసెమ్మదగ్గరా పెట్టించింది. అప్పటికి చందమామ గుండ్రంగా వెండిపళ్ళెంలా ఆకాశం లో మెరిసిపోతున్నాడు. 

కుంపట్లో బొగ్గులు సరిచేసి పాలగిన్నె పెట్టింది. అందులో నెమ్మదిగా పొంగకుండా బాగా కాగి భలే రుచిగా ఉంటాయి పాలు. నన్ను అరిటాకులు కోసుకు రమ్మని అమ్మనీ, చెల్లినీ, ఉమక్కనీ, అన్నయ్యనీ, నాన్ననీ అందర్నీ రమ్మని భోజనాలు వడ్డించింది. అన్నాలు తింటూ మధ్యలో "మాచిట్టి తల్లి చిన్ని చేతులతో ఎంత బాగా చేసిందో, పప్పెంత రుచిగా ఉందో పచ్చడెంత బాగుందో" అని మెచ్చుకుంటూ తిన్నది. ఆ మెప్పుదల ఇప్పటిదాకా నాకు వండటం అనే పనిమీద ఎంతటి ఉత్సాహాన్ని కలిగించిందో చెప్పలేను. అందరం పరమాన్నం. పప్పూ, పచ్చడీ, చారూ, గడ్డపెరుగూ వేసుకుని సుష్టుగా తిన్నాం. 


కొద్ది కొద్దిగా మిగిలిన పప్పూ, అన్నం , కూరా అన్నీ ప్లేట్లో సర్ది వెనగ్గా ఉండే రిక్షా హనుమంతు భార్యను కేకేసి ఇచ్చేసింది. అమ్మడూ చిన్న బకెట్ తో నీళ్ళు పట్రా అని ఆ రెండు గిన్నెలూ ప్లేట్లూ అక్కడే కడిగేసింది. ఆనక వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ బజ్జుండిపోయాం. 


"వింటుంటే భలే భాగుంది కదా" అన్నాను పంకజంతో" అవును మంచి కృష్ణ వంశీ ఫామిలీ మువీలాగా బానే ఉంది అంది," నవ్వుతూ" అయితే పద" అని వంటింట్లోకి దారి తీసాను. వంటింట్లో కెందుకూ, ఇప్పుడు మీ అమ్మమ్మ చేసిన వంటేదో మళ్ళీ చేయాలా?" అంటూ నావెనకే వచ్చింది పంకజం. 

"సరిగా చూడు సింకునిండా స్థలం చాలకపొర్లిపోతున్నాయి గిన్నెలు,ఇంకా వాషేరియాలో కూడా బోలెడూ"


"కేవలం రెండుమూడు గిన్నెలతో రుచిగా, శుచిగా, అంతమందికి వండి, రెండు నిముషాల్లో గిన్నెలు కడిగేసేది మా అమ్మమ్మ, హౌ? ఎలా? నిన్న నలుగురు అతిథులు (గెస్ట్ లు) వచ్చి ఇవ్వాళ పనమ్మాయి రాకపోతే ఇదీ నా పరిస్థితి." 


"ఐ వాంట్ నెల్లూర్ పెద్దారెడ్డీ రైట్ నౌ, ఐ వాంట్ అమ్మమ్మా రైట్ నౌ, పంకజం ఐ వాంట్ అమ్మమ్మా రైట్ నౌ అంటున్న " నాకేసి జాలిగా చూస్తూ.


"నిజమే ఆరోజుల్లో ఆహారంలో సింప్లిసిటీ ఎక్కువ రుచికూడా ఎక్కువ. 

ఈ రోజుల్లో రుచిపక్కనబెడితే ఆర్భాటం ఎక్కువ, అందుకే పాత్రల వాడకం ఎక్కువ, అందుకే పనీ ఎక్కువ" అంది నావైపు జాలిగా చూస్తూ.


 *పద్మజ కుందుర్తి.*

కామెంట్‌లు లేవు: