5, అక్టోబర్ 2020, సోమవారం

శివ సహస్రనామాలు

 మొదటగా అసలు శివ సహస్రనామాలు ఎలా ఉద్భవించాయో తెలుసుకొందాం ..🌼🌿*


విష్ణు సహస్ర నామాలను గురించి, వాటి విశేషాలను గురించి మహాభారత కథ వివరిస్తుంది. 


అయితే మళ్ళీ అంతటి శక్తి కలిగిన శివ సహస్ర నామాలు ఎలా ఉద్భవించాయి? 


దాంతో పాటుగా శ్రీ మహావిష్ణువు చేతిలోకి సుదర్శన చక్రం ఎప్పుడు వచ్చి చేరింది? 


ఈ విషయాలను గురించి వివరించి చెప్పే ఈ కథా సందర్భం శివపురాణం కోటి రుద్ర సంహిత ముప్పై అయిదు, ముప్పై ఆరు అధ్యాయాలలో కనిపిస్తుంది.


సర్వ ఆపదల నుండి ముక్తిని పొందటం కోసం శివ రూప ధ్యానం, శివ సహస్రనామ పఠనం ఉపకరిస్తాయి.

నిత్యం శివ సహస్ర నామాలను పఠించినా, పఠింపచేసినా దుఃఖమనేది ఉండదు. 


ఈ స్తోత్రం సర్వ రోగాలను నాశనం చేసి విద్యను, ధనాన్ని, సర్వ కామనలను నిత్య శివభక్తిని ఇస్తుంది. 


పూర్వం ఓసారి దేవతలకు, రాక్షసులకు భీకర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో దేవతలు ఎన్నో రకాలుగా బాధలను పొందుతూ ఉండేవారు. 

చివరకు వారంతా కలిసి శ్రీ మహా విష్ణువు దగ్గరకు వెళ్ళి తమ కష్టాలను తీర్చమని వేడుకొన్నారు. మహావిష్ణువు వారందరికీ ధైర్యం చెప్పి క్షణకాలం పాటు మనస్సులో శివుడిని ధ్యానించారు.


శ్రీమహావిష్ణువు దేవతల జయం కోసం కైలాసానికి వెళ్ళి అక్కడ కుండాన్ని స్థాపించి దానిలో అగ్నిని ప్రతిష్ఠించి, ఆ పక్కన ఓ పార్థివ లింగాన్ని కూడా ప్రతిష్టించి తపస్సుకు ఉపక్రమించాడు. 


ఎంతకాలానికీ శివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో తన తపస్సును, శివారాధనను మరింత వృద్ధి చేశాడు.


హిమాలయాల చెంతనే ఉన్న మానస సరోవరంలో లభించే అరుదైన వెయ్యి కమలాలను తెచ్చి ప్రతి రోజూ భక్తితో పూజ చేస్తూ ఉండేవాడు. 

దీక్షతో మహావిష్ణువు చేస్తున్న ఆ పూజను పరీక్షించాలనుకొన్నాడు పరమశివుడు.


ఓ రోజున మహావిష్ణువు మానస సరోవరం నుండి వెయ్యి పూవులను తెచ్చి ప్రతిరోజూ తాను శివ సహస్ర నామాలతో పూజ చేస్తున్నట్టుగానే ఆ రోజు కూడా పూజకు ఉపక్రమించాడు. శివ సహస్ర నామాలలోని తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలను పఠిస్తూ అన్ని పూవులతోనూ పూజ చేశాడు. చిట్టచివరి నామం పఠిస్తూ పువ్వు కోసం చూసిన విష్ణువుకు అది కనిపించలేదు. ఎలాగైనా సహస్ర నామాలను పువ్వులతో కలిపి పూజ చేయాల్సిందేనని దీక్ష పట్టిన విష్ణువు కమలాన్ని పోలిన తన కన్నునే పరమశివుడికి అర్పించి పూజ చేయాలని నిర్ణయించుకొన్నాడు.ళ


దేవతల కోసం అంతటి త్యాగానికి సిద్ధపడిన మహావిష్ణువును చూసి పరమశివుడు ఎంతో ఆనందించి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. లోకకల్యాణం కోసం గొప్ప త్యాగానికి సిద్ధపడిన శ్రీ మహావిష్ణువుకు రాక్షస సంహారం కోసం తేజో రాశిలాంటి సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు.


అంతేకాక దీక్షతో శ్రీ మహావిష్ణువు పఠించిన శివ సహస్ర నామాలను ఎవరు పఠించినా వారికి సకల శుభాలు, విజయాలు చేకూరుతాయని పలికి అంతర్ధానమయ్యాడు. 


ఆ తర్వాత విష్ణుమూర్తి నిరంతరం సుదర్శన చక్రాన్ని ధరిస్తూ దేవతల శత్రువులను సంహరిస్తూ వారికి శాంతిని కలిగించాడు. 

కామెంట్‌లు లేవు: