5, అక్టోబర్ 2020, సోమవారం

రామాయణమ్.82

 

...

అన్నగారు కోరినదే తడవుగా మంచి దృఢమైన వృక్షశాఖలు తెచ్చి చక్కటి స్థిరమైన పర్ణశాల నిర్మించాడు లక్ష్మణుడు.మెత్తటిచాపలల్లి విశాలమైన ఆవరణం ఏర్పరచి అన్న ఎదుట సావధాన చిత్తుడై నిలిచాడు లక్ష్మణుడు.

.

అందంగా నిర్మింపబడిన ఆ పర్ణశాలను చూస్తూ రామచంద్రుడు ,లక్ష్మణా ఈ పర్ణశాలలో మనము చాలాకాలము జీవించవలసి ఉంటుంది కావున ప్రవేశించే ముందు వాస్తుదేవతా శాంతి చేసుకోవాలి.అందు నిమిత్తమై నీవు లేడిమాంసము తీసుకొనిరమ్ము శాలాపూజ చేసుకుందాము.శాస్త్ర విహితమైన కార్యముకదా ! 

.

రాముడినోట మాటవెలువడిన మరుక్షణమే అక్కడ కృష్ణసారము అనే లేడిమాంసం సిద్ధంచేశాడు లక్ష్మణుడు.

.

ఆ మాంసాన్ని ప్రజ్వరిల్లే అగ్నిలో రక్తముపూర్తిగా తొలగిపోయేటట్లు బాగా కాల్చి పక్వమైనదని తెలుసుకొని ,రామునితో ,రామా ! ఇక దేవతాపూజ ప్రారంభించవచ్చు అని తెలిపాడు.

.

ఒక స్థిరముహూర్తంలో రాముడు శుచిగా నదిలో స్నానం చేసినవాడై విశ్వేదేవతలను,రుద్రుని,విష్ణువును ఉద్దేశించి బలులు సమర్పించి వాస్తుశాంతి నిమిత్తమై మంగళములు చేసి నియమానుసారముగా వాస్తుపూజాసమయంలో పఠించవలసిన మంత్రములు స్వయంగా తానే చదివి పర్ణశాలలో ప్రవేశించగనే ఆయన మనస్సులో అమితమైన ఆనందం కలిగింది.

.

అంత సీతారామలక్ష్మణులు అడవిలోదొరికే పూలు,పండ్లు కందమూలములు ,పక్వమైనమాంసముతో సకల భూతములకు తృప్తికలుగచేశారు.

.

లక్ష్మణుడుఆపర్ణశాలలోవేదికలు ,చైత్యములు,అగ్నిగృహాలు

కూడా ఏర్పాటు చేశాడు.

.

మనోహరమైన చిత్రకూటపర్వతసానువులు,మాల్యవతీనదీ ,రమణీయమైన ప్రకృతి ,ఆహ్లదకరమైన వాతావరణంలో నిర్మింపబడిన ఆ పర్ణశాలలో ప్రవేశించగనే అయోధ్యను విడవటం వలన వారిలో కలిగిన దుఃఖం మటుమాయమయ్యింది....

....

అక్కడ! ..

రాముడు గంగదాటినవైపే వారు కనుమరుగయ్యేంతవరకు చూస్తూ నిలుచున్న సుమంత్రుడు రాముడు చిత్రకూటము చేరుకున్నాడన్న వార్త తెలిసేవరకు గుహుని వద్దనే ఉండి భారమైన మనస్సుతో ఆనందశూన్యమైన అయోధ్య చేరాడు.

.

సుమంత్రుని చూడగనే రాముడెక్కడ? మా రాముడెక్కడ ? అంటూ నగర ప్రజలందరూ ఆయన చుట్టూ గుమికూడి ప్రశ్నలవర్షం కురిపించారు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: