5, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యము



✍️ గోపాలుని మధుసూదన రావు


భృగువీరీతిగ కుందుచు 

భగవానుని పదములంటి ప్రార్థనసేయిన్ 

'వగవకు’ మనుచును శ్రీహరి 

యగణితమగు ప్రేమతోడ యనెనీరీతిన్. 47                                                                                                                                         


“కలవరమందకు మునివర !

నిలజనులకు మోక్షమిచ్చు నిచ్ఛతొ నేనే 

కలియుగమున తిరుమలపై 

కలకాలము నుండనెంచి కల్పించితిటుల్. 48 


ఇది యంతయు నా లీలయె 

వ్యధ చెందకు సంయమీంద్ర ! వెడలుముభువికిన్ 

సదమల చిత్తముతోడను 

ముదమున జన్నంబు జేసి మోక్షముగనుడీ”. 49 


మునితోడను నీ విధముగ 

ననునయముగ బలికి విష్ణువానతి నీయన్ 

మనమున శాంతిని బొందియు

ముని చనె భూలోకమునకు మోదముతోడన్. 50 


తన నెలవగు పతి నురమున 

కను కావరమెక్కి భృగువు కాలితొ తన్నన్ 

కని శ్రీలచ్చిమి సుడివడి 

మనమందున కుంది దలచె మాధవు వీడన్ 51 


మనమున , భృగుముని నీ విధి 

సదమలమగు తనదునెలవు తన్నిన కతనన్ 

మదిరోషమంది కటువుగ

మధుసూదను జూచి ననియె మానిని లక్ష్మీ. 52 


“ మాన్యుడవగు మిము యా సా 

మాన్యుడు తన్నంగ సైచి, మమతతొ వానిన్ 

మాన్యుని జేసిన కతమున 

మాన్యత గోల్పోయితీవు , మఱియును నేనున్ 53 



భృగుముని జేసిన చర్యకు 

వగపొందియు కుందుచున్న వరలచ్చిమితో

భగవానుడైన విష్ణువు 

మగువా ! శాంతిచుమనుచు మఱి యిటులియెన్. 54 



“ ఎదపై నాడెడు బిడ్డడు 

పదములతో తన్నినంత పాటించదమే ! 

ముదమున నాతని ముద్దిడి 

పదిలముగా జూచుకొనమె పావనగాత్రీ! 55 



పిత యేరీతిగ సుతుడిని 

పతి యేరీతిగ నతివను పాలనసేయున్ 

మతిమాలి తప్పుజేసిన 

నతనిని క్షమియించవలయు నతివా ! నటులే ! 56 


తెలియనితనమున భృగుముని 

కలిపురుషుని మహిమవలన కాలితొ తన్నెన్ 

యలుగక మనమిటు వానిని 

తలపున మన్నించతగును తప్పెన్నకనూ. 57 


యుక్తాయుక్తము దెలియక 

భక్తుడు యీరీతి జేసె పామరుపగిదిన్ 

శక్తిగల నీవు యితనిని 

రక్తితొ మన్నించదగదె రమణీ ! చెపుమా !”. 58 


అని ననునయముగ బల్కిన 

మనమున యవమానపడిన మానిని లక్ష్మీ 

ముని జేసిన యవమానమె

ననయము తా దలచుకొనుచు ననెనిటు పతితో. 59

కామెంట్‌లు లేవు: