*భజన బృందం..*
2010 వ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం మరో ఇరవైరోజులు ఉందనగా..మా నాన్నగారి పేరుతో శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల అనే చిరునామా తో ఒక ఉత్తరం వచ్చింది..పంపిన వారు "శ్రీ వెంకటేశ్వరా భక్త భజన సుమాజం..చెన్నై" అని ఉన్నది..
"మేము సుమారు 12 సంవత్సరాల క్రిందట మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద మహాశివరాత్రి రోజున మా బృందం తరఫున భజన కార్యక్రమం నిర్వహించి ఉన్నాము..ఈసారి కూడా మాకు అవకాశం ఇవ్వవలసినదిగా కూర్చున్నాము.." అని ఆ ఉత్తరం లో ఉన్నది..మా నాన్నగారు అనారోగ్యం తో ఉన్నారనీ..ప్రస్తుతం మందిర నిర్వహనాబాధ్యతలు నేను నిర్వహిస్తున్నాననీ..మీరు మహాశివరాత్రి రోజు భజన కార్యక్రమం ఏర్పాటు చేస్తే..నాకెటువంటి అభ్యంతరమూ లేదని..వాళ్లకు తిరుగు జవాబు వ్రాసి పంపాను..మరో వారం కల్లా..నాకు ధన్యవాదాలు తెలుపుతూ..తాము శివరాత్రి నాటికి శ్రీ స్వామివారి మందిరానికి వస్తామని, తమ బృంద సభ్యులు మొత్తం పదిహేను మంది ఉంటారని తెలియచేసారు..
అనుకున్న విధంగానే మహాశివరాత్రి నాడు చెన్నై నుంచి ఆ భజన సమాజం వారు వచ్చారు..అందరూ తెలుగువాళ్లే కానీ..కొన్ని దశాబ్దాలుగా చెన్నై లో స్థిరపడిపోయిన వాళ్ళు..ఆ కారణంగా వాళ్ళ మాటల్లో తమిళ యాస ఎక్కువగా ఉంది..ఆ శివరాత్రి రోజు రాత్రికి శ్రీ స్వామివారి మందిరానికి ఆవల వైపు ఉన్న ఒక మంటపం లో వారి భజనకు ఏర్పాటు చేసాము..భజన మొదలైన గంట తరువాత మా దంపతులము ఆ కార్యక్రమం చూడటానికి వెళ్ళాము..
అదొక విలక్షణ రీతిలో సాగే భజన..అందులో పాడే పాటలన్నీ భద్రాచల రామదాసు కీర్తనలు..త్యాగరాజ స్వామి వారి కీర్తనలు..వాగ్గేయకారుల కీర్తనలే..ఒకరిద్దరు ఆ కీర్తనలకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు..వంటి పైభాగాన ఏ ఆచ్ఛాదనా లేకుండా ఒక్క పంచె మాత్రం కట్టుకుని, చిన్న తంబూరా చేత బూని శుద్ధ నారదీయ సాంప్రదాయం లో భజన చేస్తున్నారు..నాకు బాగా నచ్చింది..ఆ బృంద సభ్యులందరూ అత్యంత శ్రద్ధ, భక్తులతో..క్రమశిక్షణతో చేస్తున్న ఆ భజన మళ్లీ మళ్లీ చూడాలనిపించింది..
ఆరోజు భజన కార్యక్రమం ముగిసిన తరువాత, నా దగ్గరకు వచ్చి, తమకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు..శ్రీ స్వామివారి ఆరాధన మే నెలలో ఉన్నదనీ..ఆరాధానోత్సవాల్లో భాగంగా దత్తదీక్షాదారులు కళాశాలతో మందిరానికి వచ్చి..శ్రీ స్వామివారి విగ్రహానికి అభిషేకం చేస్తారని..ఆ సమయం లో మీ భజన ఏర్పాటు చేయగలరా...ప్రధాన మంటపం లో భజన చేయాల్సి ఉంటుందనీ చెప్పాను..అమిత సంతోషం తో అంగీకరించారు..
ఆ సంవత్సరం శ్రీ స్వామివారి ఆరాధానోత్సవాల్లో కలశాభిషేకం నాడు ముందు అనుకున్న విధంగానే వారి భజన ఏర్పాటు చేసాము..అప్పటివరకూ ప్రతి సంవత్సరం స్వామివారి అభిషేకం జరిగే నాటి రాత్రి..దత్తదీక్షాధారులను ఒక క్రమ పద్ధతిలో నిలబెట్టడానికి మేము ఇద్దరు ముగ్గురు పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చేది..కానీ ఈ భజన మొదలైన నాడు మాత్రం..అదేమి చిత్రమో కలశాలు తలమీద పెట్టుకొని మందిరం లోకి అడుగుపెట్టిన ప్రతి దీక్షాధారుడూ..ఈ భజన నే చూస్తూ..వరుసక్రమం లో నిలబడి..ఎటువంటి హడావుడి చేయకుండా..మెల్లిగా నడచి రాసాగారు..అభిషేకానికి తమవంతు వచ్చేదాకా లైన్ లో నిశ్శబ్దంగా నిలబడి, వున్నారు..అందరి కళ్ళూ భజన మీదే ఉండిపోయాయి..తమకు తెలీకుండానే..తమ చేతులతో లయకు తగ్గట్టు తాళం వేయసాగారు..పోలీసు వారి సహాయమే అక్కరలేకుండాపోయింది..భజన కార్యక్రమం చివర సభ్యులందరూ భజన చేస్తూనే వచ్చి, శ్రీ స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసారు..దాదాపుగా అందరూ ఉద్వేగానికి లోనై..సంతోషంతో కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారు..
ప్రధాన మంటపం లో సాక్షాత్తూ స్వామివారి సమాధి కి అతి సమీపంలో తాము భజన చేయడానికి అవకాశం వచ్చినందుకూ ఆ బృంద సభ్యులూ ఆనందపడ్డారు..ఆ మాటే పదే పదే చెప్పారు..ఆ సంవత్సరం మొదలుకొని..ఈ నాటిదాకా ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవం లోనూ..దత్తదీక్షాధారుల అభిషేకం నాడు "శ్రీ వెంకటేశ్వరా భక్త భజన సమాజం " వారిచే..శ్రీ స్వామివారి ప్రధాన మంటపం లో భజన కార్యక్రమం ఒక ఆనవాయితీగా మార్పియింది..మేము కూడా పోలీసు వారి సహాయం తీసుకోవడం ఆపేసాము..ఒకరకంగా చెప్పాలంటే..శ్రీ స్వామివారి ఆరాధానోత్సవాల్లో ఈ భజన బృందం కూడా ఒక భాగంగా మారిపోయింది..
"మాకు ఈ స్వామివారు శక్తిని ఇచ్చినంతకాలం..మేమందరమూ ఇలానే ప్రతి ఆరాధనకూ వచ్చి, ఆ స్వామి ఎదుట భజన చేసి.. స్వామివారి సమాధిని దర్శించి వెళుతుంటాము..ఇంతకుమించి మరే కోరికా లేదు.." అని అత్యంత భక్తిగా చెపుతుంటారు..
దత్తదీక్షాధారుల కొఱకు శ్రీ స్వామివారే ఈ ఏర్పాటు చేసుకున్నారేమో అని నేనూ మా సిబ్బంది అనుకుంటూ ఉంటాము..
సర్వం..
దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి