9, డిసెంబర్ 2020, బుధవారం

ధార్మికగీత - 104

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 104*

                                    *****

        *శ్లో:- సంపత్సు మహతాం చిత్తం ౹*

               *భవ  త్యుత్పల కోమలం ౹*

               *ఆపత్సు చ మహా శైల- ౹*

               *శిలా సంఘాత కర్కశమ్ ౹౹*

                                       *****

*భా:-  మనోవాక్కాయాలు ఏకంగా ఉన్నవారిని "మహాత్ములు" అని అంటారు. వారిలో శాంతిసామరస్యాలు, అగ్రహానుగ్రహాలు సరి సమానంగా ఉంటాయి. వారి హృదయం సంపదలలో కలువపూవు వలె మృదువుగా, మార్దవంగా, సుకుమారంగా ఉంటుంది. ఆపదలలో వారి హృదయం  సమీకృత కఠిన శిలలతో  కరుడుకట్టిన మహా పర్వతము వలె దృఢంగా, కర్కశంగా ఉంటుంది. కారుణ్యము కాగడా పెట్టి వెతికినా పొడసూపదు. శ్రీరాముడు పట్టాభిషేక వార్త వినగానే, మందస్మితవదనారవిందంతో  నిర్మలంగా, శాంతంగా ఉన్నాడు. మరునాడు  అరణ్యవాస వార్తవిని,  పితృవాక్యపరిపాలనా నిబధ్ధతతో కానలకు ఉద్యుక్తుడు అయినాడు. ఇలాంటి "స్థితప్రజ్ఞత"  మహాత్ములకే సాధ్యపడుతుంది. రాక్షసరాజు, త్రిలోకాధిపతి "బలి" తన గురువైన శుక్రుని ఆజ్ఞను థిక్కరించి, తన అస్థిత్వానికే ముప్పు వాటిల్లుతున్నదని తెలిసినా,        సత్యవాక్పరిపాలనకై మూడడుగులు దానం చేసి, త్యాగశీలిగా భాసించాడు.  అదీ మహాత్ముల హృదయ స్పందన. వారు సుఖాలలో పొంగిపోరు. కష్టాలలో కృంగిపోరు. వారి హృదయాలలో శిరీషకుసుమపేశలత్వము , వజ్రకాఠిన్యము రెండును సహజాతములుగా పొదగబడి ఉంటాయని సారాంశము*.

                               *****

               *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: