9, డిసెంబర్ 2020, బుధవారం

శశాంకశేఖరప్రాణవల్లభాయై

 ౬. శశాంకశేఖరప్రాణవల్లభాయై నమో నమః! – 


చంద్రుని తన శిగపై పెట్టుకున్న పరమేశ్వరునికి ప్రాణసమానమైన ప్రియురాలు. 


శశాంకశేఖరుడు అంటే చంద్రశేఖరుడు అనగా శివుడు. చంద్రుని తన శిగపై పెట్టుకున్న పరమేశ్వరుడు. అయనకు ప్రాణవల్లభి’ ఈ తల్లి. ‘వల్లభ’ అంటే ప్రియురాలు అని అర్థం. ఆయనకి ప్రాణసమానమైనటువంటి, ప్రియమైనటువంటి జగదంబ. 


శివునికి ఉన్న నామాలలో చంద్రశేఖర నామం దివ్యమైనది. మనం లోకంలో చూసే చంద్రకళలు పదిహేను. ఇవి మార్పు చెందేవి. మారని పదహారవ కళకి సదాకళ, ధృవా కళ, అమృతకళ అని పేరు. అది శివుని శిగపై ఉంటుంది. ఇది శివుడు సదా ఉండే శాశ్వతమైన అమృత తత్త్వము అని తెలియజేస్తుంది. 


‘చంద్రశేఖరా’ అనే నామాన్ని పఠిస్తే మృత్యుబాధలు తొలగిపోతాయి. మృత్యుంజయ తత్త్వాన్ని తెలియజేస్తుంది. ఆ కారణం చేతనే మార్కండేయుడు యముడు వెంటపడినప్పుడు 


‘చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం! 

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం! 

చంద్రశేఖర మాశ్రయే కింకరిష్యతి వైయమః’ అన్నాడు. 


ఆయన అమృతస్వరూపుడు. ఆయనకి ప్రాణసమానమైన ప్రియమైన స్వరూపం అమ్మవారు. 


ప్రాణితి చేష్టాన్ కరోతి ఇతి ప్రాణః – చేష్టను కలిగించునది. శివుని చేష్ట అమ్మవారి వల్లనే కలుగుతున్నది. లేకపోతే ఆయన నిర్వికారుడై ఉంటాడు. సృష్టిస్థితిలయలు చేస్తున్నాడు అంటే శక్తివల్లనే చేస్తున్నాడు. అవి చేస్తున్నాడు అంటే ఆయనకి కదలిక వచ్చింది. అదే స్పందనశక్తి. శివుని యొక్క స్పందన శక్తియే అమ్మవారు. సంకల్పం ఉంటేనే స్పందన ఉంటుంది, స్పందన ఉంటేనే సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం ఇచ్ఛాజ్ఞానక్రియారూపముగా సృష్టిస్థితిలయలు చేస్తూ ఉంటుంది. ఈ రహస్యాన్నే శంకరభగవత్పాదుల వారు ‘న ఖలు కుశలః స్పందితుమపి’ అని సౌందర్యలహరి ప్రథమ శ్లోకంలో చెప్తున్నారు. 


ఇందులో భావించవలసినది శివశక్తుల అన్యోన్యదాంపత్యం. వారి అన్యోన్య దాంపత్యాన్ని భావిస్తే చాలు శాంతి లభిస్తుంది. ఇది సమయాచారం. దక్షిణాచారం, ఉత్తమ సంప్రదాయం. దంపతుల అన్యోన్య ప్రేమ ఎలా ఉండాలి అనేది శివశక్తుల ద్వారా నేర్చుకోవాలి. ఒకవేళ ఆ ప్రేమ కానీ లోపిస్తే శాంతి ఉండదు. అలాంటి అన్యోన్య ప్రేమ దంపతుల మధ్య ఉండాలంటె ఆదిదంపతుల అన్యోన్యతని ధ్యానించాలి, ఉపాసించాలి, ఆరాధించాలి. అప్పుడు ఆ కుటుంబాలలో అన్యోన్యత, శాంతి ఉంటుంది. ఈ నామం విడిగా జపం చేసుకుంటే అమృతత్త్వాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. 


౭. సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమో నమః! – 


ఎల్లప్పుడూ పంచదశీ మంత్ర స్వరూపముగా ఉన్న తల్లి. పంచదశీమంత్రముతో అభిన్నమైన స్వరూపము కలిగిన తల్లి. ధర్మార్థ కామ మోక్షములు నాలుగూ ఇవ్వగలిగే పంచదశీమంత్ర స్వరూపమే అమ్మవారి దివ్యమంగళ విగ్రహం అని ఈ నామంలో భావం. 


పంచదశీ మహామంత్రము. శ్రీవిద్యలో రాజరాజేశ్వరీ లలితామహాత్రిపురసుందరి మంత్రము పంచదశి. మంత్రములలో ఉన్నతమైన మంత్రము, శ్రీవిద్యలో ఉదాత్త మంత్రము, సంపూర్ణ మంత్రము. పంచదశీ మంత్ర స్వరూపమే అమ్మవారు. దేవతాకృతి అంటేనే మంత్రాకృతి. మంత్రం యొక్క చైతన్యమే దేవత. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క మంత్రము, ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవతాకారము. ఎన్ని మంత్రాలుంటాయో అందరు దేవతలుంటారు. లలితాదేవి మంత్రం అంటే పంచదశీ విద్య. 


అమ్మవారి స్వరూపం ఒకప్పుడు ఉండి మరొకప్పుడు పోయేది కాదు. క్రమక్రమంగా క్షీణించేదో, పెరిగిపోయేదో కాదు. ఎప్పుడూ పరిపూర్ణమైనది, నిత్యము, శాశ్వతం అని చెప్పడానికి ‘సదా’ అని చెప్పారు. అమ్మవారి స్వరూపాన్ని ధ్యానిస్తేనే ఆ మంత్రాన్ని జపించిన ఫలం. ఎల్లప్పుడూ పంచదశీ మంత్ర స్వరూపముగా ఉన్న తల్లి. 


శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా! కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ! శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ! మూలమంత్రాత్మికామూలకూటత్రయకళేబరా!” –


ఈ నామములో చెప్పింది పంచదశీ మంత్రం మూడు భాగాలుగా ఉంటుంది – వాగ్భవ, కామరాజ, శక్తికూటములు. వాగ్భవకూటం అమ్మవారి కంఠంవరకు ఉన్న భాగం. మంత్రంలో మధ్యభాగం కామరాజ కూటం అని చెప్పబడుతూ కంఠం నుండి నడుము వరకు ఉంటుంది. అటుతర్వాత కటినుంచి పాదం వరకూ ఉన్న మంత్రభాగం శక్తికూటం అని పంచదశిలో మూడవభాగం. ఇలా మంత్రంలో ఉన్న మూడు భాగాలు శరీరంలో మూడు భాగాలుగా చూపిస్తూ మంత్రానికీ, దేవతామూర్తికీ అభేదాన్ని చూపిస్తున్నారు. ఈ మూడు కూటముల మంత్రం ద్వారా లభించేది ఏమిటంటే ధర్మార్థకామమోక్షములు. 


వాగ్భవ కూట ధ్యానం వల్ల ధర్మము, కామరాజ కూట ధ్యానం వల్ల అర్థము, కామము; శక్తి కూట ధ్యానం వల్ల మోక్షం లభిస్తుంది. ధర్మార్థ కామ మోక్షములు నాలుగూ ఇవ్వగలిగే పంచదశీమంత్ర స్వరూపమే అమ్మవారి దివ్యమంగళ విగ్రహం అని ఈ నామంలో భావం.


అనంతవిశ్వమే అమ్మవారి స్వరూపం. ఎంత అనంత విశ్వమైనా పంచభూతాలతో కూడి ఉన్నది. పంచభూతాలలో ఒక్కొక్క భూతానికీ కొన్ని గుణాలుంటాయి. ఆకాశానికి ‘శబ్దము’, వాయువుకు ‘శబ్దము, స్పర్శ’, అగ్నికి ‘శబ్దస్పర్శరూప’; నీరుకి ‘శబ్దస్పర్శరూప రసములు’; భూమికి ‘శబ్దస్పర్శరూపరసగంధములు’. మొత్తం కలిపితే పదిహేను గుణాలు. ఈ పదిహేను గుణాలతోనే ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. పంచభూతాలు వాటి గుణములు కలిపితే పదిహేను అవుతున్నాయి. ఈ పదిహేనింటితో ఉన్న విశ్వమే అమ్మవారి యొక్క రూపము. ఈ విశ్వమునిండా అమ్మవారు ఈతత్త్వంగా ఎల్లవేళలా వ్యాపించి ఉన్నది గనుక ‘సదా’.

కామెంట్‌లు లేవు: