17, డిసెంబర్ 2020, గురువారం

పంతులు గారి మెస్"🙏

 తిరుపతి నుండి వస్తూ ఒంగోలు లో భోజనం కోసం ఆగాము.మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందా?? అని విచారించగా ఒక ఆపద్బాంధవుడు "పంతులు గారి మెస్" కి వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. ఒంగోలు అంటే "అల్లూరయ్య మైసూర్ పాక్ " తెలుసుకాని పంతులు గారి మెస్ గురించి వినడం ఇదే మొదటిసారి.


నిజముగా సలహా ఇచ్చిన ఆ పెద్దమనిషికి కృతజ్నతలు చెప్పాలి. భోజనము ఆమోఘంగా ఉంది. విపరీతమైన రద్ధి.కూచోటానికి ఖాళీ ఒకపట్టాన దొరకలేదు.

అది ఒక పాతకాలం ఇల్లు. అయినా విశాలమైన గదులుతో సౌకర్యంగా ఉంది. షడ్రసోపేతమైనభోజనం. రోటి పచ్చడి అంటే రోటి పచ్చడే.. మిక్సిలు అసలు వాడరుట. కారప్పొడి దగ్గరనుండి ప్రతి పదార్ధము రుచిగా ఉంది. ఇక నెయ్యి వేస్తున్నారా ....పోస్తున్నారా??!! అన్నది సందేహమే. అసలే నేతి ప్రియుడి నైన నేను ఈ 

"నేతి పాతాన్ని " చూసి పులకించిపోయా. ఆ నెయ్యి పడేటప్పటికి " ఝటరాగ్ని" రాజుకుంది.

పప్పులో కానీ పులుసు లో కానీ తిరగమాత సరైన మోతాదులో ఉంది. వడ్డించేవాళ్ళు కొసరి కొసరి వేసేవాళ్లే కానీ కసిరి కసిరి వెయ్యడం లేదు.సుమారు 30 ఏళ్ళు నుండి ఇదే తంతట. 


మాంఛిఆకలి మీద విరుచుకు పడి తిన్నానేమో భుక్తాయాసం తో వెంటనే కార్ నడపడం కష్టం అనిపించినా మంచి భోజనం చేసామన్న తృప్తి ఆ కష్టాన్ని కప్పి పుచ్చింది.

ఇక నుండీ ఇటుగా వెళ్ళేటప్పుడు ఇక్కడే భోజనం చెయ్యాలని తీర్మానం ప్రవేశపెట్టగా మిత్రబృందం యావత్తూ ఆమోదించారు.  

మీరు కూడా ఒంగోలు వెళ్తే

"డోంట్ మిస్...పంతులు గారి మెస్"🙏🌷

కామెంట్‌లు లేవు: