🙏శివానందశలహారీ🙏
నతి నుతి తోడను సతతమౌ ధ్యానాన
భవ పూజ సేయగా పట్టదాయె !
యెటువంటి పూజల నేర్పడన్ జేయంగ
సంతుష్టి పడుదువు సర్పభూష !
ఫల్గుణు డానాడు బాహుబలంబుతో
ముసలంబుతో గొట్టె విసరె రాళ్లు
ధనువుతో మోదెను దారుణ రీతిగా
నీతోడ తలపడి నీలకంఠ !
నాటి పార్ధ ప్రహారముల్ నచ్చె నేని
ఇందు నీకేమి యిష్టమో యెఱుక సేయ
నటులె సేతును నేనును నిటలనేత్ర !
భక్త వత్సల ! శంకరా ! పాహి పాహి ! 89 #
ఉన్నతంబైన యధ్యాత్మ యోగవిద్య
తెలియనందున శంకరా ! తేటగాను
వాక్కు తోడనె నీ భవ్య వరచరిత్ర
పలుకుచుందును నిరతంబు భక్తిమీర
మనసుతోడనె నీదగు మహిత రూపు
ధ్యాన మొనరించు చుంటి దివ్యాగ్ని నేత్ర
చిత్త మానందమొందగా శిరసు వంచి
ప్రణతు లర్పించుచుంటిని పార్వతీశ ! 90 #
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి