అన్నం పరబ్రహ్మ స్వరూపం ...
🍁🍁🍁🍁
ఆకాశంలో వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథ్వి. పంచభూతాల సృష్టి క్రమమిది. పృథ్వి నుండి ఔషధులు, ఓషధుల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణం ఉద్భవించాయి.
అన్నమే ప్రాణం.
అందుకే అన్నాన్ని పరబ్రహ్మంగా భావించాలి.
అన్నం లేకుండా ఎక్కువ కాలం ప్రాణం నిలబడదు. అన్నాన్ని పారవేయకూడదు, ప్రశంసించాలి. అన్నాన్ని వృద్ధి చేసుకోవాలని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది
. అన్నం వల్లనే ప్రాణ రక్షణ, శరీర రక్షణ. ప్రాణ, శరీరాల రక్షణ జరిగితేనే మానవుడు సాధకుడు కాగలుగుతాడు.
అన్నమును నిషేధింపరాదు. అన్నం ఉండీ కూడా లేదని చెప్పడాన్ని నిషేధం అంటారు. ఇంటికి వచ్చిన అతిథికి భోజనం లేదనక సిద్ధంగా ఉన్న అన్నాన్ని అతిథికిచ్చుట గృహస్థుల ధర్మం.
నీరు భోజ్యవస్తువులలోనిది కాబట్టి నీరు కూడా అన్నమే. నీరు జీవనాధారం. అన్నాన్ని తినేది అగ్ని. అది మనలోని జఠరాగ్ని. జలాగ్నులు పరస్పరాశ్రితాలు.
అంటే..
నీటిలోన అగ్ని, అగ్ని యందు నీరు ఉన్నాయి. అన్నార్తుల ఆకలి తీర్చడానికి అన్నమును ఎక్కువగా సమకూర్చుకోవాలి, పోగు చేసి పెట్టుకోవాలి. అన్నాన్ని ఎక్కువగా దానం చేయాలి. దానం చేసే గుణం ఉన్న వారికే సకలైశ్వర్యాలు లభిస్తాయంటుంది యుజుర్వేదం. ‘
కేవలాఘో భవతి కేవలాదీ’ (ఋగ్వేదం).. తన పొట్ట మాత్రమే నింపుకొనేవాడు పాపాన్నే ఒడిగట్టుకుంటాడు.
ఎవడు కేవలం తన కోసమే అన్నం వండుకుంటాడో వాడు నరకం పొందుతాడని శుక్ర నీతిసారం చెబుతోంది
. అతిథి లేకుండా భోజనం చేయడం కేవలం పాపాన్ని భుజించినట్లే అంటుంది విష్ణుపురాణం.
ఒకానొకప్పుడు శునక పుత్రుడైన శౌనకుడు, కక్షసేనుని కుమారుడు అభిప్రతారి భోజనం చేయడానికి కూర్చుంటారు.
వారికి భోజనం పెట్టే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి అన్నం కోసం యాచిస్తాడు. వారు తనకు భిక్ష వేయకపోవడంతో.. ‘‘ఈ బ్రహ్మాండంలో గొప్పవి నాలుగున్నాయి. అవి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలం. ఈ నాలుగింటిని వాయువు తనలో ఇముడ్చుకొంటుంది. అట్లే పిండమున, శరీరమున వాక్కు, నేత్రం, శ్రోత్రం, మనసు అనే నాలుగు ఇంద్రియాలు ముఖ్యమైనవి. ఈ నాలుగింటినీ ప్రాణం తనలో ఇముడ్చుకొంటుంది. వాయువు, ప్రాణం మిగిలిన వాటిన తమలో కలుపుకోనుటకు చూస్తుంటాయి. సచ్చిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడు అఖిల భువానాన్ని ఏలుతూ తానే రక్షకుడు, భక్షకుడు అవుతున్నాడు. అట్టి దేవుని మహిమ చేతనే పిండమున ప్రాణము, బ్రహ్మాండమున వాయువు తమ స్వీయ కర్మలను చేస్తున్నాయి. అంతటా ఉండి వెలుగుతూ, అన్నింటినీ అందజేస్తున్న ఆ పరమ పురుషుని ఈ మనుష్యులు గుర్తించరు. ఈ అన్నం ఆ దేవత కొరకే. ఆ ప్రాణరూప బ్రహ్మము కొరకే నేను అన్నము అర్థించాను. కానీ మీరు ఇవ్వలేదు. మీరు అన్నం ఇవ్వనిది నాకు కాదు.. ఆ ప్రాణరూప బ్రహ్మానికే అన్నం ఇవ్వకుండా తిరస్కరించారు’’ అని చెప్పాడా బ్రహ్మచారి.
దీంతో వారికి జ్ఞానోదయం కలిగి అతడికి భిక్ష పెట్టారు.
అందరిలోనూ ఉండే జీవాత్మే ఆ పరమాత్మ అని.. ఆ పరమాత్మే అన్ని దిక్కులకూ వ్యాపించి అన్నాన్ని గ్రహిస్తున్నాడని,
కాబట్టి అన్నార్తులకు లేదనకుండా అన్నం పెట్టాలని తెలిపే కథ ఇది.
🍁🍁🍁🍁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి