18, అక్టోబర్ 2020, ఆదివారం

 విదురనీతి 23


తమోగుణము గురించి విదురుడు ఈవిధంగా చెప్తున్నాడు.


మంచి చెడులను తెలుసుకోలేని అజ్ఞానం, మూర్ఖత్వం, మోహం, చపలత్వం, బుధ్ధిహీనత, ఇతరులను పీడించే దుష్టస్వభావం, తప్పుడు భ్రమ, సోమరితనము వంటి తమోగుణాలతో జీవుని ఆత్మ బంధింపబడుతోంది. 

తమోగుణము కలవారు భూత ప్రేత గణాలను ఆరాధిస్తారు.


1. దానం: తిరస్కరించదగినదియై, దానమునకు తగని సందర్భమునందు, అర్హులు కానివారికి ఇవ్వబడే దానం "తామసదానం" అనబడుతుంది.

2. త్యాగం: ఇక్కడ త్యాగమంటే మానవుడు తాను చేయవలసిన సత్కార్యాలను విడిచిపెట్టుట, వేదాలు, మహాత్ములు తెలిపినటువంటి సత్కార్యాలను నిర్వర్తించకపోవడం వగైరా అవివేకాన్ని, అలసత్వాన్ని తెలియచేస్తుంది.

3. జ్ఞానం.: ఏ జ్ఞానమైతే ఒక్క దాని యందే సమస్తమూ ఉన్నట్లుగా భావించి, దాని యందే ఆసక్తి, మనసు కలది అగుతున్నదో అట్టి జ్ఞానం తామస జ్ఞానం.

4. కర్త: ఆత్మస్థైర్యం లేనివాడు, మూఢుడు, నమ్రతలేనివాడు కుత్సితుడు, ఇతరుల జీవితాలను చెరచుటలో ఆసక్తి కలవాడు, వ్యసనపరుడు మొదలైన వారలు తామసకర్తలు.

5.బుధ్ధి: అజ్ఞానముతో పూర్తిగా నిండి అధర్మమును ధర్మముగా, మానవుడు తెలుసుకోదగిన, ఆచరించదగినా వాటినన్నిటినీ అందుకు విరుధ్ధముగా తలచుచున్నదో ఆ బుధ్ధి తమోగుణ ప్రధానమైనదిగా చెప్పబడుతుంది. 

6. ధైర్యము: దుష్ట స్వభావం కలవాడు తన గుణాలను ఏ ధైర్యముతో విడువడో అట్టి ధైర్యము తామస ధైర్యము. 


జీవుని లొని ఆత్మ సత్వ, రజో, తామస అనే మూడు గుణాలచేత బంధింప బడుతోంది. ఎవరిలో ఏ గుణము అభివృధ్ధిలో ఉంటే అందుకు తగినట్లుగానే వారి కార్యకలాపాలు ఉంటాయి.

మోహం, కోపం, లోభం, అనే ఈమూడు నరకానికి మూడు దారుల్లాంటివి . మనిషి వ్యక్తిత్వాన్ని ఇవి సంకుచితపరుస్తాయి. మోహం బారిన పడిన మానవుడు దానిని తృప్తి పరిచే ప్రయత్నంలో లోభానికి, అందులో విఫలమైతే అసహనానికి, కోపానికీ గురవుతాడు. మానవుని ఆత్మ భౌతిక బంధాల నుండి విముక్తి చెందకుండా ఈ మూడు అడ్డుపడుతుంటాయి.


కనుక సజ్జనుడు ఈ మూడింటి విషయంలో సర్వదా అప్రమత్తుడై మెలగాలి. ఆధ్యాత్మికానందానుభూతిని పరిపూర్ణంగా పొందాలంటే కూడ ఈ మూడింటికి హృదయంలో చోటివ్వకూడదు. అపుడే మనిషి తన జీవితంలో నియమనిబంధనలు పాటించి, సత్కర్మలనే ఆచరిస్తాడు. తద్వారా మోక్షప్రాప్తి పొందుతాడు. నాలుగు 

ఆశ్రమాలలోని వైదిక ధర్మాలను వ్యక్తి తన జీవితంలో ఆచరించినపుడు ఆధ్యాత్మికంగా సంపూర్ణ అనుభూతిని అతడు పొందగలుగుతాడు.


(ఇంకా ఉంది)

కామెంట్‌లు లేవు: