18, అక్టోబర్ 2020, ఆదివారం

 రామాయణమ్ 151

..............

ఎదో స్వరము దీనముగా వినపడుతున్నది ,

అది ఎవరిదో ఆర్తనాదమే !

 అవును! ఆ స్వరము నా నాధుడిదే !

ఏమి ఆపదలో చిక్కుకున్నాడో ఏమో,

 పాపము ఆమె హృదయము తల్లడిల్లిపోయింది .

.

వెంటనే లక్ష్మణునితో " నీవు వెళ్లి రామునికి ఏమైనదో తెలుసుకోనిరా !" అని పలికింది సీతమ్మ.

.

ఆ అరుపులు సింహము నోట్లో చిక్కి విలలవిల లాడుతూ రక్షించమని అంబారవములు చేసే ఎద్దు దీనాలాపములుగా ఉన్నవి ,.

.

నా ప్రాణము హృదయము పరితపిస్తున్నాయి 

రామునికి ఏ ఆపద వచ్చినదోయని .

నీ సోదరుడు రక్షణ కోరుతున్నాడు .

నీవు త్వరగా వెళ్ళు అని సీత మరలమరల పలికింది .

.

సీత అంతగా చెప్పినప్పటికీ లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞకు బద్ధుడై అంగుళము కూడా కదలలేదు.

.

సీత కుపితురాలైంది.

 ఒక ప్రక్క తన భర్తకు ఏమైందో అన్న ఆందోళన ఆమెలోని ఆలోచనను, విచక్షణను కోల్పోయేలా చేసింది ,

.

లక్ష్మణా! నీకు నామీద గల కోరిక చేత నీ అన్నకు వచ్చిన ఆపదను పట్టించుకోవటములేదు.

.

నీవు మిత్రుడి రూపములో ఉన్న శత్రువు ,ఆ విషయము నీ అన్న తెలుసుకోలేకపోయాడు .నీకు నా మీద ఆశ ఉండుట చేత అన్నకు కష్టము వచ్చినప్పటికీ అడుగు ముందుకు వేయడములేదు ,ఆయనకా కష్టము కలగాలనే నీవు కోరుకొంటున్నావు.

.

ఇప్పుడు రాముడు కష్టాలలో ఉన్నాడు ఆయనను రక్షించడమే నీ  ప్రధాన కర్తవ్యము నన్ను రక్షించడము కాదు .

.

అని ఒక ఉన్మాదినిలాగా మాట్లాడుతున్న సీతను చూసి ,

.

ఓ సీతా ! రాముడంటే ఏమనుకున్నావు  పరాక్రమము లో ఆయన సాటి నిలువగల వారు మూడులోకాలలో ఎవరూ లేరు .

.

పన్నగ,గంధర్వ,అసుర,మానవ ,దేవతా గణాలలో నీ భర్తను జయించగలవారేవ్వరూ లేరు. .

.

రాముణ్ణి యుద్ధములో జయించగలగటము కలలో కూడా జరుగని పని.

.

నీవు ఈ విధముగా మాటలాడటము తగదు '

.

నిన్ను ఒంటరిగా ఈ అడవిలో విడిచి వెళ్ళను ఇది రామాజ్ఞ.

.

నిన్ను నా రక్షణలో ఉంచి ఆయన వెళ్ళాడు .

.

నీవు విన్నది రాముని స్వరము కాదు అది మాయావులైన రాక్షసుల పని . 

అది ఒక ఇంద్రజాలము.

.

ఖరుడితో మనకు కలిగిన వైరము ,అతనిని సంహరించడము వలన మన మీద ప్రతీకారము తీర్చుకొనుటకు రాక్షసులు పన్నిన ఎదో పన్నాగమది .

.

అని పలికి నిలుచున్నాడు రామానుజుడు.

.

రామాయణమ్ 152

..........

తను ఆ విధముగా ఆందోళన పడుతూ మాట్లాడినప్పటికీ ఏమీ పట్టించుకోకుండా స్థిమితముగా ,నిమ్మకు నీరేత్తినట్లున్న లక్ష్మణుని చూసి ఆవిడకు వళ్ళు మండిపోయింది .

.

చాలా కోపముతోఎర్ర బడ్డ  కళ్ళతో ,

.

నీవు కులములో  చెడబుట్టావు ,మనసులో దుష్టపు ఆలోచనతో రాముడి ఆపద గురించి ఏ మాత్రమూ ఆలోచించటము లేదు .ఆయనకు ఆవిధముగా జరగాలని కోరుకుంటున్నావు అని గట్టిగా అరిచింది సీత

.

పాపపు అభిప్రాయాలు కడుపులో పెట్టుకొని రహస్యముగా ప్రవర్తించే నీ వంటి వాడు మిత్రుడి రూపము లోని  శత్రువు.

.

దుష్టబుద్దివి నీవు ,భరతుడిచే ప్రేరేపింపబడి మమ్ములను అనుసరిస్తూ వస్తున్నావు .ఇది నీ పన్నాగమైనా ,భరతుడి పన్నాగమైనా ,మీ కోరిక సిద్ధించదు .ప్రాణాలైనా నేను తీసుకుంటాను కానీ మీకెప్పటికీ వశము కాను. 

.

ఉన్మాదినిలా మాట్లాడుతున్న ఆవిడ మాటలు విని 

 ఇంద్రియ నిగ్రహ వంతుడైన లక్ష్మణుడు అంజలిఘటించి నమస్కరిస్తూ , 

.

సీతా ! నీ మాటలకు బదులు చెప్పటము నా కిష్టము లేదు నీవు నాకు దైవము . ఈవిధముగా మాటలాడటము స్త్రీ సహజ లక్షణమే !జనకుని కొమరితవైన ఓ సీతా పదునైన బాణముల వంటి నీ పలుకులు ములుకులలాగా నా హృదయాన్ని పీడిస్తున్నాయి సహించలేకున్నాను .

.

స్త్రీవైన నీవు అన్నగారి ఆజ్ఞ పాటించుచున్న నన్ను అనరాని మాటలంటున్నావు ,ధర్మవిరుద్ధముగాప్రవర్తిస్తున్నావు .

అందుకు ఈ వన దేవతలే సాక్షి !  

.

ఛీ ! నీ విప్పుడు నశించెదవుగాక!

.

నేనిప్పుడే రాముడున్న చోటికి వెళ్లేదను ,ఇప్పుడు అగుపడుతున్న శకునాలు చూడబోతే నేను మరల నిన్ను తిరిగి చూస్తాననే నమ్మకము కలగటము లేదు అని బాధ నిండిన హృదయముతో పలికిన లక్ష్మణుని చూసి ,

.

రాముడు లేకపోతే నేను ఇప్పుడే ఇదుగో ఈ గోదావరిలో దూకిచస్తాను ,లేదా ఉరి వేసుకుంటాను ,లేదా అదుగో ఆ కనపడుతున్న ఎత్తైన గిరిశిఖరము మీదనుండి దూకి చస్తాను అని పలికింది సీత.

.

విషమైనా త్రాగుతాను ,అగ్నిలో దూకనైనా దూకుతాను కానీ అన్యుడైన పరపురుషుని పాదములతోనైనా తాకను.అని అంటూ గుండెలు బాదుకొంటూ ఏడుస్తున్నది సీత.

.

ఆవిడను ఓదార్చడానికి విఫల యత్నము చేసి తనవల్లగాక ఆవిడకు అభివాదము చేసి మాటిమాటికీ వెనుదిరిగిచూస్తూ విడిచిపెట్టలేక ,విడిచిపెట్టలేక రాముడి కొరకు అడవిలోకి పయనమయ్యాడు సుమిత్రా నందనుడు.

రామాయణమ్ 153

.............

పాపమా పిచ్చితల్లి ఒంటరిగా భర్తనుగురించిన తలపులతో ఆయనకు ఏ  ఆపద వాటిల్లినదో అనే భీతితో తల్లడిల్లిపోతూ దిగులుగా కూర్చొని ఉన్నది .

.

ఇంతలో ఆ పర్ణశాల ముందు వేదఘోష చేసుకుంటూ .  .అత్యంత మృదువైన కాషాయ వస్త్రము ధరించి ,శిఖను,ఛత్రమును,పాదుకలను ధరించి ,మంగళకరమైన దండ కమండలములను ఎడమ భుజానికి తగిలించుకొని  ఒక సన్యాసి వస్తున్నాడు.

.

అతడు మారు వేషములో వచ్చిన సర్వలోక భయంకరుడైన రావణుడు .

.

చంద్ర సూర్యులు లేని సంధ్యను అంధకారము ఆవరించినట్లు ఆమె సమీపములోకి వచ్చాడు రావణుడు.

.

ఆతని చూడగానే జనస్థానము లోని పశు పక్ష్యాదులన్నీ కూడా గజగజవణికి పోయిననాయి ,గాలికూడా భయముతో మెల్లగా వీచసాగింది ,అప్పటివరకు గలగలా ప్రవహించే గోదావరీ నది తన వేగాన్నీ ఉధృతిని తగ్గించుకొని చాలా నెమ్మదిగా ప్రవహించసాగింది .

.

రామ లక్ష్మణులిరువురూ లేని సమయాన్ని చూసుకొని ఇదే అదనుగా భావించి లోకకంటకుడైన రావణుడు సీతా దేవిని సమీపించి నిలిచాడు.

.

ఈ లోకములో లేదు సీతమ్మ ! 

మనసంతా మగని గూర్చిన ఆలోచనలే ! 

పరిపరి విధాలుగా పోతున్న మనస్సును అదుపు చేసుకోలేక భర్తకు ఆపద వాటిల్లినదేమో అని చింతిస్తూ ఉన్న  ఆవిడ తనకు వాటిల్లబోయే విపత్తును లేశమాత్రము కూడా గ్రహించలేని స్థితిలో దైన్యముతో అలాగే కూర్చుని ఉన్నది.

.

 రావణుడు సీతను చూశాడు 

,వాడి మీద మన్మధుడు తన పని చేసుకు పోతున్నాడు .

వాడిలో వికారము మొదలయ్యింది .


పద్మములో కూర్చున్న లక్ష్మీదేవిలాగా ప్రకాశించే సీతమ్మను కామాతురుడై నిర్లజ్జగా ,నిర్భయముగా చూస్తూ ఆవిడ సౌందర్యాన్ని చూపులతో గ్రోలుతూ ఇలా పలికాడు.

.

ఓ దేవి! నీ శరీరము అంతా పద్మముల వరుస లాగా ఉన్నది .పద్మలత లాగా ఉన్నది నీ తనువు( అనగా ముఖము పద్మము ,హస్తములు పద్మములు ,పాదములు పద్మములు ,నేత్రములు పద్మములు ..)

.

 ఇన్ని పద్మములు ధరించిన నీవు ఎవ్వరవు ?

.

శుభకరమైన ముఖము కలదానా ! 

నీవు పార్వతివా ?

నీవు కీర్తికి అదిష్ఠాన దేవతవా ?

కాంతికి అదిష్ఠాన దేవతవా?

ఐశ్వర్యానికి అదిష్ఠాన దేవతవా ?

మంగళ ప్రదురాలైన శ్రీ లక్ష్మివా ?

అప్సరసవా ?

 స్వేచ్ఛాసంచారిణి అయిన రతీ దేవివా ?

ఎవరవు? 

నీవెవరవు ?



రామాయణమ్ .154


అందమైన చిరునవ్వు, ముత్యములవంటి పలువరుస, చక్కని నేత్రములు గల ఓ విలాసవతీ!

 నీవు నా హృదయాన్నిమనస్సును 

వరద ఉధృతితో ఉన్న నది ఒడ్డులను ఎలా కోసివేస్తుందో అలా కోసివేశావు.

.

జగదేకమోహినివై భాసిల్లుతున్న నీవు ఎవరు?

 గంధర్వ కాంతవా?,

అప్సరసవా? ,

కింనర స్త్రీవా ?

లేక యక్షజాతికి చెందిన దానివా ?

 అయినా నేను ఇంతకుమునుపు నీ వంటి స్త్రీని ఏ జాతిలోనూ చూసి ఉండలేదు .

.

క్రూరమృగాలకు  ఆలవాలమై ,భయంకరమైన రాక్షసులు స్వేచ్చగా సంచరించే ఈ ఘోరాటవిలో నీ వెందుకు ఒంటరిగా నివసిస్తున్నావు ? నిన్ను చూసి నా మనసు తల్లడిల్లుతున్నది .

.

నీ వంటి అపురూప సౌందర్యరాశి ఉండదగ్గ ప్రదేశము కాదిది !

.

రమణీయ ప్రాసాదోపరిభాగాలు,సుందర ఉద్యానవనాలు  ఉన్న నగర ప్రాంతములు నీవు సంచరించుటకు అనుకూలమైనవి !

.

నల్లని కన్నులు కల ఓ కోమలాంగీ నీవు 

శ్రేష్ఠమైన పూలమాలలు ధరించి,

శ్రేష్ఠమైన ఆహారము,

శ్రేష్ఠమైన వస్త్రములు ,

శ్రేష్టుడైన భర్తతో సుఖించటము యుక్తము అని నా అభిప్రాయము .

.

అని పలుకుతున్న బ్రాహ్మణ రూపములోనున్న రావణుని చూసి సీతమ్మ సమస్త అతిధి ఉపచారములతో సేవించింది ,అర్ఘ్య పాద్యాదులిచ్చి భోజనము సిద్దముగా నున్నది అని కూడా పలికింది .

.

కాషాయ వస్త్రము ధరించి బ్రాహ్మణ వేషముతో ఉన్న రావణుడు ఏ మాత్రము ద్వేషింప రాని ప్రశాంత చిత్తుడి లాగా కనపడుతున్నాడు సీతమ్మకు.

.

అలాంటి రావణునికి ,ఇంటికి వచ్చిన అతిధికి ఏ ఏ మర్యాదలు చేయాలో ఆయా మర్యాదలన్నీ చేసి నిండుగా మాటలాడుతున్నది సీతా మహాసాధ్వి.

.

కానీ రూపుదిద్దుకున్న దురాలోచనతో ఉన్న రావణుడు తన చావును ఆహ్వానిస్తూ సీతను బలాత్కారముగా అపహరించాలని మనస్సులో నిశ్చయించుకున్నాడు.

కామెంట్‌లు లేవు: