Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 31 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
‘కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంథరా’
ఈ నామములో వశిన్యాదిదేవతలు అమ్మవారి కంఠము గురించి మాట్లాడుతున్నారు. మహాకామేశ్వరుని చేత కట్టబడిన మంగళసూత్రము కంఠములో ప్రకాశిస్తున్న తల్లి. లోకములో అందరూ కట్టించుకుంటారు. అందరూ కట్టించుకోవడానికి ఆవిడ కట్టించుకోవడానికి చాలా పెద్ద భేదము ఉన్నది. మంగళసూత్రధారణ వివాహములో అంతర్భాగము. కామమును ధర్మబద్ధము చేసుకోవడానికి లోకములో అందరూ సాధారణముగా వివాహము చేసుకుంటారు. అమ్మవారు శుశ్రూష చేస్తున్న ఈశ్వరుని మీద మన్మధుడు బాణం వేస్తే ఆయన మన్మధుని కాల్చేసాడు. లోకములో పెళ్ళికి, అమ్మవారి పెళ్ళికి చాలా తేడా ఉన్నది. ఎంతో గొప్పగా తపస్సు చేసి మహాకామేశ్వరునితో మంగళసూత్రము కట్టించుకున్నది. అమ్మ అలా కట్టించుకున్నది కాబట్టే శివుని దర్శనము అవుతున్నది. ‘కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంథరా’ అన్నది చాలా గహనమైన మాట. అమ్మవారు షరతు పెట్టి తాళి కట్టించుకున్నది. శంకరుడు బ్రహ్మచారిగా వచ్చి – నీ తపస్సుకి మెచ్చాను నా చిటికిన వేలు పట్టుకో కైలాసమునకు తీసుకుని వెళతాను అంటే వేదప్రమాణము చెప్పిన వైదిక ధర్మము ప్రకారము నన్ను వివాహము చేసుకోవలసిందని చెప్పింది. మహాకామేశ్వరునితో మంగళసూత్రము కట్టించుకున్నఓ తల్లీ అని పిలిస్తే మగవారు దీర్ఘాయుష్మంతులై ప్రతి కుటుంబము పార్వతీ పరమేశ్వర స్వరూపమై, లక్ష్మీ నారాయణ స్వరూపమై ఆనందమునకు ఆలవాలమై ఉంటుంది. మంగళసూత్రములో అమ్మవారు పరిపూర్ణముగా ఆవాహన అయి ఉంటుంది. స్త్రీ ప్రతి రోజు ఒకసారి అమ్మవారి దగ్గరకు వెళ్ళి చిటికెడు పసుపు కుంకుమలను చేత్తో పట్టుకుని ‘అమ్మా ! నీ మెడలో మంగళసూత్రము ఎలా ఉన్నదో అలా నా మెడలో మంగళసూత్రము నిలబెట్టమ్మా’ అని పసుపు కుంకుమలను వేసి ఆ కుంకుమను తీసి శతమానమునకు రాసుకుంటే ఆమె నిండు పసుపు కుంకుమలతో హాయిగా, సంతోషముగా, భర్తను అనువర్తించినదై ధర్మమార్గములో ఇద్దరూ ప్రస్థానము చేసి పరమేశ్వరునిమీద నిశ్చలభక్తితో మూడుతరములు చూసి జీవితమును పండించుకుంటారు. సర్వమంగళ స్వరూపిణి అయిన అమ్మవారికే మంగళసూత్రము మీద అంత మర్యాద ఉంటే లోకమంతా ఎంత భక్తి ప్రపత్తులు పొందాలన్న విషయమును పరోక్షముగా సూచన చేస్తున్నది.
https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి