18, అక్టోబర్ 2020, ఆదివారం

శోభాయమాన

 (18/10/2020, ఈనాడులో నా ఆదివారం సంపాదకీయం..ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి)

------------------------------------

 శోభాయమాన సంప్రదాయం

--------------------------------------


శాస్త్రీయ నాట్యసంప్రదాయానికి జీవం పోసిన భరతుణ్ని మునిగాను, కూచిపూడి నృత్యరీతులకు పురుడుపోసిన సిద్ధేంద్రుణ్ని యోగిగాను సంభావించే జాతి మనది. సంగీతం నృత్యం శిల్పం చిత్రలేఖనం వంటి కళలను గంధర్వ విద్యలుగా ఆరాధించే దేశమిది. వరాలుగా వాటిని స్వీకరించి, భక్తితో ఉపాసించి, భగవంతుడికే నివేదించడం  భారతీయ సంస్కృతి! తన ఆశ్రయం కోరివచ్చినవాడే అయినా, బృహన్నల నాట్యవిద్యా విశారదుడని గ్రహించగానే ‘నా కూతురు ఉత్తరకు మీవద్ద నృత్యం అభ్యసించే యోగ్యత ఉన్నదా, ఉంటే నేర్పండి’ అని విరాటరాజు వినయంగా యాచించాడే తప్ప- శాసించలేదని భారతం చెబుతోంది. అది గంధర్వ విద్యలకు దక్కే లౌకిక మర్యాద. నాట్య శాస్త్ర ప్రవీణురాలిని ‘శైలూషి’ అంటారు. ‘కరతలామలకంబుగా కరాంబుజముల అర్థము ఆద్యంతంబు అభినయించు...’ సాహిత్యభావానికి అద్దంపట్టేలా హస్తముద్రలతో ఆకట్టుకొంటుంది. ‘భావింప అరుదైన భావ మర్మంబులు మెరుగు చూపులలోన మేళవించు...’ రసజ్ఞులు మాత్రమే గ్రహించగల సూక్ష్మభావాలను చూపుల్లో ప్రదర్శిస్తుంది. ‘తాళమానములతో తాళ నిర్ణయలీల చరణ పల్లవముల సంగ్రహించు...’ లయవైవిధ్యాన్ని తన కాలి అందియల శబ్దంతో శ్రావ్యంగా సమన్వయిస్తుంది... అంటే, నృత్తం నృత్యం నాట్యం మూడింటికీ ప్రాణభూతమైన- ఆంగికాభినయం, నేత్ర విలాసం, పాద విన్యాసాలతో శైలూషి పరిపూర్ణంగా శాస్త్రవిద్యను ఆవిష్కరిస్తుందని విక్రమార్క విజయంలో జక్కనకవి వివరించాడు. ఆంగిక వాచిక ఆహార్యాభినయాలు దశరూపకాల వంటి ఎన్నో అంశాలతో 36 అధ్యాయాల సమగ్ర ‘నాట్యశాస్త్ర’ సర్వస్వాన్ని భరతముని రూపొందించాడు. లాస్య తాండవ రీతులకు పార్వతీపరమేశ్వరులను ఆదిప్రవర్తకులుగా నిరూపిస్తూ ‘నృత్తరత్నావళి’ని జాయపసేనాని(జాయసేనాపతి) అందించాడు. ఆయన తెలుగువాడు!


భారతీయ కళారూపాలన్నీ రుషితుల్యుల ఆవిష్కరణలే కనుక- ఆయా ప్రక్రియలు, సంప్రదాయాలన్నీ వేటికవే  సమగ్రంగాను, సంపూర్ణంగాను ఆవిర్భవించాయి. వాటి అధ్యయన సాధనలు రుషుల మార్గంలోనే నడిచాయి. ‘కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏలఏడ్చెదో...’ పద్యంలో పోతన చెప్పినట్లు- కళారాధనకు, కైవల్యానికి మధ్యలో కాసుల బెడద కమ్మేయకుండా సంస్కారాలు కాపలా కాశాయి. కళలు భగవదంకితాలై తరించాయి. అధ్యయనం శాస్త్రీయంగా, ప్రదర్శనం కళాత్మకంగా ఉండటంలో రుషుల పాత్ర గణనీయం. శాస్త్రీయ నృత్య ప్రదర్శనల్లో ఆహార్యమూ ముఖ్యాంశమే. విరాటరాజుతో అర్జునుడు ‘నేను నిపుణ నైపథ్య విధులలో నేర్పరి’నని చెప్పుకొన్నాడు. రంగప్రవేశానికి ముందుచేసే  వస్త్రాభరణాది అలంకారాలు నైపథ్యవిధులలోకే వస్తాయి. అలంకరణ విద్యలో ఆదినుంచీ పురుషులదే ముందంజ. బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి చీరకట్టు ఎంత సొగసుగా ఉండేదంటే ‘పట్టుచీర కట్టుకొన్న పుత్తడి బొమ్మా నీ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అనుకొంటూ సినీతారలు వచ్చి చీరకుచ్చిళ్లు అంత అందంగా ఎలా మడవాలని ఆయనను అడిగేవారట. ‘సవ్యహస్తంబు అర్ధచంద్రాభినయముతో కౌను అంటి...’ దేవదేవి కుడిచేయి నడుముకు చేర్చి అలా నిలబడితే చాలు ముగ్ధమోహనంగా ఉందన్నాడు వైజయంతీ విలాసంలో సారంగు తమ్మయ్య. వేదాంతం సత్యనారాయణశర్మ నిలువెత్తు ఆహార్యాన్ని చూస్తే అచ్చంగా అలానే అనిపించేది. యామినీ కృష్ణమూర్తి, శోభానాయుడు లాంటి నర్తకీమణులు సైతం అంతటి విఖ్యాతిని సాధించారు. జక్కన చెప్పిన సకల శాస్త్రమర్యాదల్లోనూ ప్రవీణులు కావడం ఒకటే కాదు... రుషుల మార్గంలో నడిచారు, పోతన దారినే అనుసరించారు! సినిమా అవకాశాలను సైతం కాదనుకొన్న శోభానాయుడు, తన రంగంలో గురుపీఠాన్ని అధిరోహించి కూచిపూడి ప్రతినిధిగా, పరంపరకు దీపధారిగా ఘనచరిత్ర సృష్టించారు... సంప్రదాయానికి సొబగులద్దారు... నటరాజులో లీనమయ్యారు!

--(ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి)

కామెంట్‌లు లేవు: