తరువు లతిరసఫలభార గురుత గాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజగుణము...!
తాత్పర్యం :
ఎవరికైనా మేలు చేస్తున్నప్పుడు "పరోపకారార్థమిదం శరీరమ్" అంటుంటారు చాలామంది. ఇతరులకు ఉపకారం చేసేందుకే ఈ శరీరం ఉన్నది అని దీని అర్థం వచ్చే ఈ వాక్యం మూలం భర్తృహరి సుభాషితాల్లో కనిపిస్తుంది. పరోపకారం మంచివారి సహజ లక్షణం అంటూ భర్తృహరి చెప్పిన పై పద్యాన్ని ఏనుగు లక్ష్మణకవి తేటతెలుగు మాటల్లో అలా వర్ణించారు.
బాగా పండ్లున్న చెట్లు ఆ భారంతో వినమ్రంగా వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు ఆ బరువుతో ఆకాశంలో మరీ పైపైన కాకుండా కిందుగా సంచరిస్తుంటాయి. ఉత్తములు కూడా అంతే, సంపదవల్ల వారికి గర్వం రాదు. నమ్రత, వినయంగా ఉండటం, గర్వం లేకపోవడం.... లాంటివన్నీ పరోపకారం చేసేవారికి సహజంగానే ఉంటాయని పై పద్యం యొక్క భావం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి