18, అక్టోబర్ 2020, ఆదివారం

 *మనశ్శాంతి*

🕉️🌞🌎🏵️🌼🚩


 *మామిడి తోపులో స్వామీజీ  ప్రవచనాలు చెబుతున్నాడని తెలిసి సాంబయ్య వెళ్ళాడు. "మనిషి ఆశకు అంతంలేదు . ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలని,మనశ్శాంతి ని పోగొట్టుకుంటున్నాడు.అవసరమైన వరకు సంపాదించి ఉన్నదానితో తృప్తి పడితే మనశ్శాంతి వుంటుంది" అన్నాడు.* 

 *ఆమాటలను ఆచరణలో పెట్టాడు సాంబయ్య.* 

 *ప్రక్కింటి కల్లయ్యకు బోలెడన్ని కష్టాలున్నాయి. ఇంతకాలం మనమే కాదు సాంబయ్య కూడా కష్టాలలోనే వున్నాడని సంబరంతో వుండేవాడు.* 


 *ఇప్పుడు ఆయన ప్రశాంతత చూచి కడుపు మండిపోతుంది. ఎలాగైనా మనదారిలోకి తెచ్చుకోవాలని,ఒకరోజు* *వచ్చి"సాంబయ్యా! నువు ఎంత పిచ్చివాడవయ్యా! నీ ఆస్తెంత నీ ఆదాయ మెంత?ఇంతవరకు చాలని గిరిగీసుకుని కూర్చున్నావే* *కోట్లున్నవారుకూడా పుట్టెడు జబ్బులున్నా బిస్కెట్లు తిని రేయీపగలూ పనిచేస్తున్నారే వారు* *అమాయకులనుకున్నావా? సరైన జబ్బువస్తే నీ ఆస్తి ఒకముక్కులోకి చాలుతుందా? కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అనేపాట మరిచావా? నీ ఇష్టమబ్బా చెప్పాను"* 

 *అని వెళ్ళి పోయాడు.* 


 *ఆయనచెప్పింది కూడా నిజమనిపించింది.మళ్ళీ* *మాయలో పడ్డాడు.* *రేయింబవళ్ళు కష్టం చేసి అనారోగ్యం పాలైనాడు సాంబయ్య.* 

 *కళ్ళు చల్లబడ్డాయి కల్లయ్యకు.* 


 *మళ్ళీ స్వామీజీ చెంతకు వెళ్ళి జరిగింది చెప్పాడు.* 

 *స్వామి ముసిముసిగా నవ్వుతూ"నువు సుఖంగా వుంటే ఇరుగు పొరుగువారు అంత సులభంగా ఒప్పుకుంటారనుకుంటున్నావా? నిన్ను చెడగొట్టే ప్రయత్నాలు అనేకం చేస్తారు. నిజంగా అంతజబ్బే వస్తే ఎంత డబ్బైనా బ్రతికించ గలదా?* 

 *ఇప్పుడు పోయేవారంతా డబ్బులేకనా? చెప్పుడు మాటలు విని అమృత తుల్యమైన మనశ్శాంతి ని పోగొట్టుకో వద్దు"అన్నాడు.* 

 *సాంబయ్యకు జ్ఞానోదయం అయింది.* 

 *మంచి పనికి ఒకరి సలహా అవసరం లేదని పాత పద్దతులనే* *అవలంబించసాగాడు.* 


 *కల్లయ్యకు కడుపు మండిపోతున్నది. ఈ దపా మరో రాయి వేద్దామని పొడిదగ్గులు దగ్గుతూ పొద్దుగూకా వచ్చాడు. బైట చెప్పు చీపుర కట్ట వుంది.  అరే!ఎన్నడూ లేనిది ఈరోజు ఎందుకున్నాయి ఏదో ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయని తలచి మెల్లిగా పిల్లిలా ఇల్లు చేరుకున్నాడు కల్లయ్య.* 


✍🏻జంజం కోదండ రామయ్య


🕉️🌞🌎🏵️🌼🚩

కామెంట్‌లు లేవు: