18, అక్టోబర్ 2020, ఆదివారం

 16-09-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ఏతాం దృష్టి మవష్టభ్య నష్ణాత్మానోఽల్పబుద్ధయః | 

ప్రభవన్త్యుగ్రకర్మాణః 

క్షయాయ జగతోఽహితాః || 


తాత్పర్యము:- ( అసురస్వభావము కలవారు) ఇట్టి నాస్తికదృష్టిని అవలంబించి చెడిన మనస్సుగలవారును, అల్పబుద్ధితో గూడియున్నవారును, క్రూరకార్యములను జేయువారును, ( జగత్తునకు) శత్రువులును (లోకకంటకులును) అయి ప్రపంచముయొక్క వినాశముకొఱకు పుట్టుచున్నారు.


వ్యాఖ్య:- "నష్టాత్మానః" అను ఈ పదముచే నాస్తికదృష్టి, కామస్వభావములు కలవారి మనస్సు తప్పకచెడిపోగలదని స్పష్టమగుచున్నది. మఱియు అట్టివారిబుద్ధి అల్పముగనే యుండును కాని విశాలముగా నుండదనియు తెలియుచున్నది. వారిది హ్రస్వదృష్టి.  విశాలదృక్పథము, విశాలదృష్టి వారికి ఉండదు. ఇవ్విధముగ నాస్తికత్వము, కామదృష్టి చిత్తవినాశకరములగుటచే త్యాజ్యములని పై భగవద్వాక్యముల వలన ఋజువగుచున్నది. మఱియు నాస్తికులు, కామమే సర్వస్వమని, సృష్టికి మూలమని తలంచు అవివేకులు తమను గొప్పగా తలంచుకొనినను భగవద్దృష్టిలో, పెద్దల దృష్టిలో వారు “అల్పబుద్ధులే” యని తేలుచున్నది.


“క్షయాయ జగతః” - జగత్తుయొక్క నాశముకొఱకే వారి పుట్టుక కాని ఉద్ధారముకొఱకుగాదు. పరప్రాణులను హింసించుటయే వారిపని గాని, వారికి ఉపకారము చేయుటగాదు. వారు లోకకంటకులేకాని, లోకహితులుకారు. వారు "కబంధులే” కాని లోకబంధువులుకారు. వెయ్యేల, అట్టివారు భూమికి భారభూతులే యగుదురు. 


ప్రశ్న: - అసురస్వభావముకలవారి లక్షణములను మఱికొన్నింటిని పేర్కొనుము?

ఉత్తరము:- (1) (ఇట్టి) నాస్తికదృష్టి నవలంబించి మనస్సును చెడగొట్టుకొందురు (2) స్వల్పబుద్ధి గలిగియుందురు (3) క్రూరకర్మలు చేయుదురు (4) లోకకంటకులై వర్తించుదురు (5) జగత్తు యొక్క క్షయమునకే జన్మించుదురు.

కామెంట్‌లు లేవు: