రామాయణమ్.96
.
ఇంత సైన్యము గంగ ఒడ్డుకు ఎందుకు వచ్చింది? కారణమేమై ఉంటుంది ? అనుమానం వచ్చింది గుహుడికి.ఆ రధము మీద కనపడే ధ్వజాన్ని బట్టి చూస్తే ఇది భరతుడిసేనావాహిని అని తేటతెల్లమవుతున్నది.
.
భరతుడు ఇప్పుడెందుకు వచ్చినాడు ? ఇక్కడున్న పల్లెలోని జనులను బంధించటానికి రాలేదుకదా! మనలను చంపటానికి కాదుకదా ! లేక రాజ్యాన్ని పూర్తిగా నిష్కంటకం చేసుకోవాలనే ఉద్దేశంతో రాముని చంపివేయటానికి కాదుకదా!
.
రాముడు నాకు ప్రభువే కాదు ,నాకు మిత్రుడు కూడా ఆయన ప్రయోజనం కాపాడటానికి అందరూ సన్నద్ధం కండు అని సేనను ఆజ్ఞాపించాడు .
.
ఐదువందల నావలలో ఒక్కొక్క దానిపై నూర్గురు యోధులు కవచధారులై సిద్ధంగా ఉండండి ! రాముడివిషయంలో భరతుడికి ఏ విధమైన దుష్టబుద్ధిలేదని తేలిన తరువాతనే ఆతని సేన గంగను సుఖంగా దాటగలుగుతుంది.అని పలికి అందరినీ సిద్ధం చేసి తాను మాత్రం భరతుడికి మత్స్యమాంసములు,తేనె పట్టుకొని వినయంగా భరతుడికి ఎదురు వెళ్ళాడు.
.
సుమంత్రుడు ఆతనిని చూపి భరతునితో ఈయన పేరు గుహుడు నీ అన్నకు ప్రాణస్నేహితుడు ఆయనను నీవుకలిసి మాట్లాడితే రాముని ఆచూకీ మనకు తెలుస్తుంది.అని చెప్పాడు.
.
అప్పుడు భరతుడు శీఘ్రంగా గుహుని తనవద్దకు తీసుకురమ్మన్నాడు.
.
గుహుడు వినయంగా భరతుడితో మేమంతా నీకు లొంగిఉండేవారము.ఇది నీదాసుని గృహము. దీనిలో నీ ఇచ్ఛానుసారము నివసింపు అని కోరినాడు
.
.నీకునీసైన్యమునకుసరిపడునంతదుంపలు ,పండ్లు,పచ్చిమాంసము,ఎండుమాంసము ఉన్నది నీ సైన్యము సుఖముగా నేటిరాత్రికి భుజించి ,విశ్రమించి రేపు బయలుదేరవచ్చును అని వినయంగా పలికాడు గుహుడు.
.
రాముని మిత్రుడా ఇంత సేనకు నీవు ఒక్కడవే ఆతిధ్యమివ్వాలనుకొనే నీ మనస్సు ఎంతగొప్పది ! .
.
మాకు ఒకటే కోరిక ఈ గంగ దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి మేమంతా సుఖంగా గంగదాటే మార్గం చూపించు అని భరతుడు కోరాడు.
.
అదెంత పని మేమంతా నీ వెంట వచ్చి దాటించగలము కానీ నాకొక సందేహమున్నది ,ఇంత సేనతో నీవెందుకు బయలుదేరావు రామునికి కీడు తలపెట్టే ఉద్దేశ్యమేమీ లేదుకదా!
.
అతని మాటలు విన్న భరతుడు ,రాముడికి కీడు తలపెట్టే దుష్కాలము ఎన్నడునూ రాకుండు గాక రాముడు నాకు తండ్రివంటి వాడు ! ( భ్రాతా ! జ్యేష్టః పితృసమో).
.
వనములో నివసిస్తున్న రాముని వెనుకకు తీసుకొని వచ్చుటకే వెళుతున్నాను .గుహుడా మరొక విధముగా తలపకుము .
ఇది సత్యము!.
.
భరతుడి మాటలువిన్న గుహుడి ముఖం వికసించింది.
.
ఆహా ! అప్రయత్నముగా లభించిన రాజ్యలక్ష్మిని తృణప్రాయంగా విడిచిపెట్టే నీవంటివాడు నాకీ లోకంలో ఎవ్వరూ కనపడలేదు.నీ కీర్తి లోకంలో శాశ్వతంగా వ్యాపించగలదు .
.
ఇంతలో రాత్రి అయ్యింది .అందరూ విశ్రమించారు.
.
రాముడిగురించిన ఆలోచనలతో భరతుడికి దుఃఖము చుట్టుముట్టింది.ఆయనను అది కాల్చి వేయసాగింది.అన్ని అవయవాలనుండీ ధారాపాతంగా చెమట కారటం మొదలుపెట్టింది.
.
ఆయన దుఃఖమే ఒక మహా పర్వతము
ఆయన ఆలోచనలే ఆ పర్వతమందలి శిలలు
ఆయన నిట్టూర్పులు ధాతువులు
ఆయన దైన్యమే ఆపర్వతమందలి వృక్ష సముదాయము
ఆయనకు కలిగే శోకము,ఆయాసము ,మనస్తాపము దాని శిఖరములు.
ఆయనకు కలిగిన మోహము అనంతమైన జంతుసముదాయము
ఆయనకు కలిగిన సంతాపము దానిమీదున్న వెదురుపొదలు.
.
ఏమి చేయాలో తోచటం లేదు నిదురరాదు !కనులు మూత పడటం లేదు. దుఃఖము దుఃఖము ఒకటే దుఃఖము.మనశ్శాంతి కరవై అల్లల్లాడిపోతున్న భరతుడిని గుహుడు ఆ రాత్రి అంతా ఓదారుస్తునే ఉన్నాడు.
.
NB
చుట్టూ అష్టదిగ్బంధము చేసి వచ్చాడు గుహుడు .రాముడికి హాని జరుగుతుందేమో అని ఏమాత్రం అనుమానంకలిగినా భరతుడి సేన ముందుకు కదలలేదు.
.అందుకే "రామస్య ఆత్మ సమో సఖా" అని గుహుడి గురించి మహర్షి వ్రాసింది.
.
వూటుకూరు జానకిరామారావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి