18, అక్టోబర్ 2020, ఆదివారం

దైవలీల

 *దైవలీల*  


✍🏻 నారంశెట్టి ఉమామహేశ్వరరావు 


 మరణ భయమనేది  ప్రాణులన్నిటికీ  సహజమే. “మనుష్యుడు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నదని” భగవద్గీతలో వచించినట్టు గ్రహించే జ్ఞానులు అరుదుగా కనిపిస్తారు.  మరణానికి ముందే  బ్రహ్మానుభవాన్ని పొందిన వారు కాలాన్ని  సద్వినియోగం చేసుకుని ఆత్మజ్ఞాన సంపన్నులై చరిస్తారు.  అలాంటి కథ భారతంలో కనిపిస్తుంది. 

      కురుక్షేత్ర  యుద్ధం ముగిసింది. భీష్ముడు అంపశయ్య మీద మరణం కోసం  ఎదురు  చూస్తున్నాడు. పాండవులతో సహా  కృష్ణుడు  భీష్ముడి దర్శనానికి  వెళ్ళాడు. పాండవులను చూసిన భీష్ముడి నయనాలు అశ్రు పూరితాలయ్యాయి. 

భీష్మ పితామహుని ఆ స్థితిలో చూసిన ధర్మరాజు కలత చెంది “ఇచ్ఛామరణం వరంగా పొందిన మహానుభావుడైన భీష్ముని,  అనుమతి గ్రహించి మాత్రమే జయించగలిగాము. అంతటి మహాత్ముడి అశ్రు నయనాలను తిలకించడం చిత్రంగా ఉంది. మరణ భయం పీడిస్తున్నదేమో” అనే సందేహం వెంటాడగా కృష్ణుడితో  ప్రస్తావించాడు.

‘నీ సందేహాన్ని భీష్ముడినే ప్రశ్నించి సంతృప్తి చెందు” అని బదులిచ్చాడు కృష్ణుడు. జగన్నాటక సూత్రధారి కృష్ణుడికి తెలియందేమీ లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం అర్హులైన వారు చెబితే అధిక ప్రభావం ఉంటుందని అలా చేసాడు కృష్ణుడు. 

సమాధానం తెలుసుకోవాలన్న ఉత్సుకతలో ఉన్న ధర్మరాజు “పితామహా! నీ నాయనాలు అశ్రుపూరితం కావడం చూడలేక పోతున్నాను. మరణ భయమా? లేక మరేదైనా కారణమా? దయతో వివరించగలవా” అని అడిగాడు. 

భీష్ముడు “ధర్మజా! మీరు జీవితంలో చాలా కష్టనష్టాలు అనుభవించారు. బాధలు మీతో పక్క పంచుకున్నాయి. కష్టాలంటే సాధారణ  కష్టాలు కాదు సుమీ. ఇతరుల కష్టాలు వేరు. మీ కష్టాలు వేరు. మీకు సాక్షాత్తు భగవంతుడే ప్రక్కన నిలబడి సాయమందించినప్పటికీ ఎన్నో అవమానాలు అనుభవించారు. అలాంటప్పుడు ఇతరుల కష్టాలు కష్టాలే కాదు. భగవంతుడి యొక్క లీల, మాయ ఇంత విచిత్రంగా ఉంటుందా అన్న జ్ఞాపకం కలగగానే నయనాలు అశ్రు పూరితలయ్యాయి తప్ప మరణ భయం క్రుంగదీయలేదు” అన్నాడు.

దైవశక్తి, లీలలు గ్రహించి మెలగాలి నరులు. లోకాన్ని సృష్టించిన విధాత , పాలించే విష్ణువు, లయ  కారకుడైన పరమేశ్వరులకు సృష్టిలోని జీవులకు ఏమివ్వాలో తెలుసు. ఎనభై  నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన మానవ  జన్మ పొందిన మానవుడు  ఆధ్యాత్మిక చింతన మార్గంలో  పయనిస్తూ  పరోపకారాన్ని  కాంక్షిస్తూ  దైవస్మరణతో  గడుపుతూ  జన్మను సార్ధకం  చేసుకుని తరించాలి.  

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది.     9985831828*

కామెంట్‌లు లేవు: