18, అక్టోబర్ 2020, ఆదివారం

నవరాత్రులు


నవరాత్రులు - బాలాత్రిపురసుందరీదేవి


అమ్మవారిని మనము రెండవ రోజున బాలాత్రిపురసుందరీదేవిగా ఆరాధన చేసి ఆ తల్లి కృపకు పాత్రులం అవుతాము. అసలు ఈ బాల అంటేనే లలితమ్మ యొక్క ప్రాణశక్తి, జ్ఞ్యానశక్తి - శ్యామలాదేవి, క్రియాశక్తి - వారాహీదేవి. ఈ బాలాత్రిపురసుందరి ప్రాణశక్తి కాబట్టి లలితమ్మకు మరియు బాలాత్రిపురసుందరికి భేదం లేదు. ఇద్దరూ ఒక్కటే. ఆ తల్లి మహాశక్తి సంపన్నురాలు. పైగా, బాలారూపంలో ఆ తల్లి మనలను త్వరగా అనుగ్రహిస్తుంది. ఇప్పటి వరకు అమ్మను మనము అమ్మా!! అని పిలిచినప్పుడు...ఆ తల్లే చుబుకం పట్టుకుని ఒక పసిపిల్లను బుజ్జగించి బువ్వ తినిపించిన రీతిగా ఆ తల్లి చుబుకం పట్టుకుంటే మరి ఎంత అదృష్టం?? అలాంటి అదృష్టం ఆ హిమవంతునికి కలిగింది. నిజానికి ప్రతి ఇంట్లో తిరుగాడుతున్న 10 సం: లోపు పిల్ల ఆ బాలా రూపమే. ఈ బాలాత్రిపురసుందరిని ఆరాధించిన వారికి వాక్శుద్ధి, వాక్సిద్ధి కలుగుతాయి. ఈ తల్లి శ్రీచక్రంలోని చిన్మయానంద బిందువులో కొలువై ఉంటుంది. నిజానికి బాలారూపం అనగానే ఆ శ్రీచక్రంలో కొలువై ఉన్న తల్లే కాదు. ఆ తల్లి ఎక్కడో లేదు. మన యొక్క శరీరంలోనే ఉంది. మన శరీరంలో కూడా చంద్రకాంతి, సూర్యకాంతి, అగ్నికాంతి ఉంటాయి. మూలాధార, స్వాధిష్టాన చక్రాలలో - అగ్నికాంతి, ఆజ్ఞా, విశుద్ధి చక్రాలలో - చంద్రకాంతి, అనాహిత, మణిపూరాబ్జా చక్రాలలో - సూర్య కాంతి తో ఉంటాయి. అవి ఒక త్రికోణంగా ఏర్పడి ఈ మూడింటిలో ఉండే చిత్ శక్తి రూపమే బాలాత్రిపురసుందరి. 


బాల అంటే చిన్నపిల్ల. మరి త్రిపుర అనగా 3 పురాణాలు. అలాగే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. శరీరంలో ఉండే 3 నాడులు - పింగళ, సుషుమ్న నాడులు. సత్వ, రజో, తమో గుణాలు. అలాగే త్రయి వేదాలు - ఋగ్వేద, యజుర్వేద, అధర్వణ. వీటన్నిటి గుర్తుగా ఆ తల్లి త్రిపుర. అందుకే ఆ తల్లి బాలాత్రిపురసుందరి. తల్లి మంచి అరుణ వర్ణంలో ఉంటుంది. మన యొక్క సహస్రార చక్రంలో కల్హారము అనే కమలం పైన కూర్చుని ఉంటుంది. ఈ తల్లి 9 సం: వయస్సు ఉన్న చిన్న పిల్లగా ముద్దులు మూటకడుతూ పట్టు పరికిణీ వేసుకుని చేతులకు గాజులు, కాళ్ళకి అందియలు పెట్టుకుని ఎంతో అందంగా చూసి చూడగానే బుగ్గలు పుణికిపుచ్చుకుని ముద్దు గొలిపే రూపంలో ఈ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తల్లి తన నాలుగు చేతులలో - పై రెండు చేతులలో పుస్తకం, అక్షమాల పట్టుకుని అలాగే క్రింది రెండు చేతులలో అభయహస్తం, వరదహస్తం పట్టుకుని మనలను అనుగ్రహించి వాక్సిద్ధిని, బుద్ధిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే ఈ బాలోపాసనను ముఖ్య ప్రాణోపాసన అని కూడా అంటారు. ఎంతో మంది ఈ బాలను ఉపాసన చేసి తరించినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ రోజు మనము శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం. మనకు కూడా అలాంటి ఉపాసనా శక్తిని అనుగ్రహించమని ఆ తల్లిని కొలిచి సాక్షాత్కారం పొందిన మహనీయులను వేడుకుందాము. మనకి ఈ దేవీనవరాత్రులలో సువాసినీ పూజ మరియు బాలపూజ ముఖ్యంగా చెప్పబడ్డాయి. 3 సం: వయసు నుండి 10 సం: బాలిక వరకు మనము బాలపూజ చేసి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులం కావచ్చు. 2 సం: కుమారి అని 3 సం: త్రిమూర్తి అని, 4 సం: కళ్యాణి అని, 5 సం: రోహిణి అని, 6 సం: కాళీ అని, 7 సం: చండిక అని, 8 సం: శాంభవి అని, 9 సం: దుర్గ అని, 10 సం: సుభద్ర అని వయసుని బట్టి ఆయా తల్లుల పేర్లతో వారిని సంబోధించి బాలపూజ చేసుకుంటాము. మనందరిని కూడా ఆ బాలాత్రిపురసుందరి మందస్మితవదనంతో ఉండి మనలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. మనం వెళ్లి ఆ తల్లి దగ్గిర చేతులు రెండూ జోడించి వేడుకోవడమే తరువాయి.


"అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే"


సర్వేజనా సుఖినోభవంతు.


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

+91 8886240088

[18/10, 5:00 pm] +91 99489 31150: దేవీనవరాత్రులు - మహేశ్వరీ


ఈ దేవీనవరాత్రులలో ఆలయముయొక్క ఆగమమునుబట్టి ఆ ఆలయం ఏ సంస్థకు చెందినదో దానినిబట్టి ఆ దేవాలయంలో అమ్మవారికి ఈ శరన్నవరాత్రులలో అలంకరించి భక్తులు ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు.


మరి శృంగేరి సంస్థానానికి సంబంధించిన శారదాలయంలో ఈరోజు ఆ తల్లిని మహేశ్వరిగా ఆరాధన చేస్తూ ఉంటారు. మహేశ్వరి అనగా మహేశ్వరుని శక్తిస్వరూపురాలు అని అర్ధం. ఇంకో రకంగా చూస్తే త్రిగుణాతీతుడగు మహేశ్వరుని శక్తిస్వరూపురాలు ఆ తల్లే! ఓంకారీతీతమైనది.


మనము వేదాలను ఉచ్ఛరించేటప్పుడు వాటియొక్క మొదలు చివర్లయందు ఉచ్చరింపబడే ఏ స్వరము కలదో అదే ప్రకృతియందు లీనమగు ప్రణవము అనగా ఓంకారము. దీనికంటే ముందునుంచి ఉన్నవాడు మహేశ్వరుడు. అనగా ప్రకృతిని అతిక్రమించిన నిర్గుణరూపుడను తెలుపలేదు. లక్షణముచే తెలిసికొనవలెను. ఈ మహేశ్వరునికి త్రిగుణాతీతతత్వము కలదు.


త్రిగుణాతీతుడు అనగా సత్త్వ, రజో, తమోగుణములకు అతీతుడు అని అర్ధము. సత్త్వగుణముతో బ్రహ్మచర్యంతో మనము ఈతనిని యదార్ధముగా ఉన్న లింగరూపాన్ని పూజించుచున్నాము. కావున ఇతను మహేశ్వరుడు అని చెప్పబడుచున్నాడు. అంతేకాక మహాభూతాలకు ఈశ్వరుడు కాన మహేశ్వరుడు. యీతని భార్య కాబట్టి మహేశ్వరి అయ్యింది. ఈ తల్లి కూడా త్రిగుణాతీతాలకు అతీతంగా ఉంది. ఆ మహేశ్వరుడికి శక్తి స్వరూపురాలుగా ఆయన చేత పనులన్నీ చేయిస్తూ ఉంటుంది. 


ఈ తల్లి వృషభ వాహనంపైన దర్శనమిస్తుంది. వృషభమనగా ధర్మం. మనమెవ్వరిమైనా ఆ తల్లి పాదాలు పట్టుకున్నా వేడుకున్నవారందరికీ కూడా ధర్మమునందు అనురక్తిని పెంచి మనలను సన్మారంగములో పెట్టే నామము ఈ నామము.


"జయ జయ శంకర హర హర శంకర"


'అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే'


సర్వేజనా సుఖినోభవంతు


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

WhatsApp Number: +91 8886240088

 +91 99489 31150: బ్రహ్మచారిణీ


ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ!

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్!

పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ!

సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం!

నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః 


ఒక్క దుర్గ నవదుర్గలుగా భాసించి తొమ్మిది రూపాలను ధరించింది. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శక్తిగా, ఒక్కొక్క అవతారమూర్తిగా మనలను అందరినీ అనుగ్రహించడానికి ఆ తల్లి ఇన్ని మూర్తులలో మనలను అనుగ్రహించింది. ఆ కోవలో రెండవ రోజు బ్రహ్మచారిణీ అమ్మవారు బ్రహ్మతత్వ స్వరూపిణి. మనకు సామాన్యంగా బ్రహ్మచారిణీ అనగానే వివాహం కాని స్త్రీ అనుకుంటాము. కాని అది కాదు దాని అర్ధం. ఆ తల్లి దగ్గిర ఒక శక్తి ఉంటుంది. ఆమె బ్రహ్మతత్వము తెలిసేటట్లు చేస్తుంది.


బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మం తెలుసుకుని బ్రహ్మం అవుతాడు. బ్రహ్మం ఎరుకలోనికి వచ్చేటట్లుగా చేసే తల్లికి బ్రహ్మచారిణీ అని పేరు. బ్రహ్మము అంటే భగవానుడు. ఆయన ఎలా ఎరుకలోనికి వస్తాడు? ఆయన ఎలా ఉంటాడు? అసలు ఉన్నాడా? ఇలా అనేక సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. నిజానికి చూడండి ఒక కుటుంబంలో ఉన్నవారైనా ఒక వయసు వచ్చిన తరువాత మన పిల్లలు ఎందుకమ్మా? ఈ పూజలు, ఈ ఉపవాసాలు? అంటూ మన కడుపున పుట్టిన బిడ్డలే అయినా మనకు హితవాక్యాలు చెబుతూ మనల్ని భగవంతుని ఉనికిని గురించి ప్రశ్నిస్తూ ఉంటారు.


అసలు అది కూడా తల్లి అనుగ్రహమే. భగవంతుని ఉనికిని ప్రశ్నించి తెలుసుకోవాలని ప్రయత్నించడం కూడా ఒక రకంగా బ్రహ్మతత్వాన్ని అన్వేషించడమే.


నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్వణూపమా! 

తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః!

సబ్రహ్మ స్సశివ స్సహరిస్సేంద్రో స్సోక్షరః పరమస్వరాట్


వడ్లగింజ చివర మొన ఎంత ఉంటుందో అంతరూపంలో మన మనస్సులోనే ఉన్నాడు పరమాత్మ. లోపల ఉన్న పరమాత్మ తెలుసుకోబడాలి అంటే దానికి ఆ తల్లి అనుగ్రహం కావాలి. ఎందువల్లనంటే ఇంద్రియాలకు బయట తిరగడం తెలుసు తప్ప లోపలికి వెళ్ళడం రాదు. లోపలి ధ్యానంలో వెళ్ళగలగాలి అంటే ఇంద్రియాలకు పైన ఉండే వాటితో సంబంధం తెగాలి. అంటే ఆ తల్లి అనుగ్రహం కలగాలి. ఆ తల్లి అనుగ్రహం ఉండే పని ఏది చేస్తున్నా ఆవిడ అనుగ్రహం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా జ్ఞాపకం ఉండటమే నిరంతర నిజమైన పూజ. పూజా గృహంలో చేసే పూజ కేవలం ఒక అక్షరాభ్యాసం లాంటిది. నిరంతర పూజలో శక్తి అనుసంధానమై ఉంటుంది. ఎప్పుడైతే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనయందు ఉంటుందో అప్పుడు మనము మాట్లాడే ప్రతి మాటా కూడా మంత్రమే అవుతుంది. ఆ తల్లి ఇచ్చిన వాక్కును అనవసర విషయాలు మాట్లాడటం కోసం కాకుండా ఆ తల్లి గురించి చెప్పుకోవడానికి, ఇతరులు సన్మార్గంలో వెళ్ళడానికి ఆ వాక్కు ఉపయోగపడాలి. అంతేకాని వ్యర్ధ ప్రేలాపనలకి సమయాన్ని, వాక్కుని వృధా చేయకూడదు. అయ్యో ఈ సృష్టిలో ఏ జీవికి లేని వాక్కు భగవంతుడు నాకు ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం అన్న ఆలోచన కలగాలి.


ఆ తల్లి అనుగ్రహం మనవైపు ఉంటే మనం వేసే ప్రతి అడుగు కూడా ప్రదక్షిణమే అవుతుంది. అమ్మవారు ఇచ్చిన శక్తిని ఖర్చుపెట్టేటప్పుడు ఆ నడక పదిమంది హితము కోసమై ఉండాలి. కాని, మన స్వార్ధం కోసం కాదు అన్న ఆలోచన మనకు కలుగుతుంది. నా నడక కొంతమందికి ఆదర్శం కావాలి. నేను నడిచే త్రోవలో పది మంది నడవడానికి ఉత్సాహం చూపాలి. మనకి ఆ తల్లి అనేక రకాలైన రుచులను అందించింది. మనకు ఏ రుచికరమైన పదార్ధం కంటికి కనిపించినా వెంటనే మళ్ళీ దొరుకుతుందో దొరకదో అని కడుపునిండినప్పటికీ ఆర్తిగా తీసుకుంటాము. అలా తీసుకొనేటప్పుడు ఆ తల్లి శక్తి పంటగా పండింది. శక్తి అగ్నిహోత్రంగా మార్చబడి ఆ పదార్ధం వండబడింది. ఆ వండిన పదార్ధాన్ని నేను పుచ్చుకున్నాక లోపల అగ్నిహోత్రుడు దాన్ని జీర్ణం చేస్తున్నాడు. అంతా ఆ తల్లి కరుణ అనుకున్నప్పుడు తినే ప్రతి పదార్ధాన్ని ప్రసాదబుద్ధితో స్వీకరిస్తాడు. ఎన్నో సుఖాలను ఇచ్చిన తల్లి కాబట్టి ఏమి చెయ్యాలో తెలియక నేలమీద సాష్టాంగ పడి, అమ్మా! అని నమస్కరించడం, పడుకునే ముందు 11 మార్లు 'శివనామం' చెప్పుకుని పడుకోవడం, నిద్రలేచేటప్పుడు కూడా మొట్టమొదట నోరువిప్పి 'శ్రీహరీ' అని మూడు మార్లు చెప్పుకుని నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఆ తల్లి దర్శిస్తూ ఉండే ప్రతీదీ పూజే. ఆ తల్లి బ్రహ్మచారిణి, బ్రహ్మతత్వ స్వరూపిణీదేవి కాబట్టి అలా అనుగ్రహించగలదు. ఆమె పాదాలను పట్టుకొన్న వారిని అటు నడిపించగలదు. 


ఇది ఎక్కడివరకు వెళ్ళిపోతుంది అంటే బ్రహ్మతత్వస్వరూపిణీ అయిన తల్లి బ్రహ్మమును తెలియచెయ్యడమే కాక నిరంతరం కాపాడుతుంది. ఆ తల్లి 'అంతర్ముఖ సమూరాధ్య బహిర్ముఖ సుదుర్లభా'. ఇంద్రియాలు లోపలికి తిరగాలి. లోపలకు తిరగడం అనే శక్తి పొందేటట్లుగా ఆ తల్లి గురుమండల రూపిణిగా మారుతుంది. ఆ తల్లి మనని అనుగ్రహించలేనిది లేదు. అటువంటి బ్రహ్మతత్వ స్వరూపిణి, బ్రహ్మచారిణి మోక్షం వరకు తీసికొని వెళ్ళగలిగిన తల్లి. ఒక్కసారి నిండు మనసుతో నమస్కరిస్తే చాలు కదలికలను భగవంతుని వైపుకు తిప్పి మనుష్యజన్మ సార్ధకం చెయ్యగలిగిన రెండవ శక్తిగా దుర్గా రూపం 'బ్రహ్మచారిణీ'. ఈ బ్రహ్మచారిణి రూపం మనలను అందరినీ అనుగ్రహించుగాక.


సర్వేజనా సుఖినోభవంతు.


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి


+91 8886240088

కామెంట్‌లు లేవు: