19, అక్టోబర్ 2020, సోమవారం

రామాయణమ్. 97

 రామాయణమ్. 97

..

రామలక్ష్మణులను తాను కలిసినదిమొదలు వారితో కలిసి గడిపిన సమయాన్ని లక్ష్మణుడి మనో వేదనను ,ఆరాత్రి తాను,లక్ష్మణుడు ముచ్చటించుకున్నసంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పి,చివరగా వారిని తాను గంగదాటించిన విషయాన్ని కూడా ఎరుకపరచాడు గుహుడు .

.

ఈ సంగతులన్నీ విన్న భరతుని హృదయంలో శోకం పెల్లుబికి కట్టలు తెంచుకొని ప్రవహించింది.కొరడాలతో కొట్టినప్పుడు ఒక్కసారే కూలబడే ఏనుగులాగ కూలపడి పోయినాడాయన.భరతుడి స్థితి చూస్తున్న శత్రుఘ్నుడుకూడా శోకముతో పట్టుదప్పినిలువలలేక నేలపైబడిన భరతుని కౌగలించుకొని బిగ్గరగా ఏడ్చాడు.

.

ఈ శోకములు విన్న తల్లులు మువ్వురూ భరతుని వద్దకు వచ్చిచేరగా కౌసల్యామాత తన దుఃఖము ఆపుకోలేక తానూ నేలపైపడి భరతుని కౌగలించుకొని ఏడ్వసాగింది.

.

ఆవిడ తీవ్రమైన బాధతో భరతుని ఉద్దేశించి నాయనా ఇంకనీవు ఏడువకురా ,మొత్తము రాజవంశము అంతా నీమీదనే ఆధారపడి ఉన్నది నీకేమయినా అయితే మేమెవ్వరమూ తట్టుకోలేము. 

.

దశరధమహారాజులేడు,రామలక్ష్మణులు చెంతలేరు,నిన్నుచూసుకొని బ్రతుకుతున్నామురా తండ్రీ నాయనా ఎందుకీ దుఃఖము ? సీతారామలక్ష్మణులగూర్చి ఏ విధమైన అప్రియమైన వార్త నీవు వినలేదు కదా!.అని పలుకుతూ తనను ఓదారుస్తున్న పెద్దతల్లి మాటలకు కాస్త తెప్పరిల్లి ఏడుస్తూనే గుహుడితో మరలమరల సీతారామలక్ష్మణుల గూర్చి ప్రశ్నించాడు .వారు ఎక్కడ ఉన్నారు? ఏమి తిన్నారు?ఎక్కడ నిదురించారు ? ఇలాంటి విషయాలు పదేపదే అడిగితెలుసుకుంటున్నాడు భరతుడు.

.

అప్పుడు రాముడు నిదురించిన చెట్టు వద్దకు తీసుకెళ్ళాడు గుహుడు .

రాముడు అక్కడనే దర్భలమీద శయనించాడన్న సంగతితెలుసుకొని మరల ఆయనలో దుఃఖము పొంగిపొర్లింది.

.

దశరధకుమారుడైన రాముడే నేలపై పడుకోవలసి వచ్చిందంటే కాలము కంటే బలమైన వాడెవడూ లేడని తెలుస్తున్నది.

.

న నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరమ్

యత్ర దాశరధీ రామో భూమావేవ శయీత సః.

.

ఇదిగో ఇది నా అన్నగారు పరుండిన చోటు ,

ఇదిగో ఈ గడ్డి అంతా ఆయన శరీరపు రాపిడికి నలిగి పోయింది.

ఇదిగో ఈ దర్భలమీద ఇంకా బంగారపుపొడులు అంటుకొనే ఉన్నాయి మా వదినగారు అలంకారాలేవీ తీయకుండగనే శయనించినట్లున్నది.

ఆవిడ ఏమాత్రము దుఃఖించకుండగనే నా అన్నవెంట వెళ్ళినది .అత్యంత సుకుమారి,పతివ్రతా శిరోమణి ఆవిడ ! 

ఈ కష్టాలు ఏవి లెక్కపెట్టినట్లులేదు,

 భర్త ఉన్న చోటే తనకూ సుఖకరమైనది అనుకొంటున్నది.

.

అయ్యో ఎంత కష్టము వచ్చినది నేనెంత క్రూరుడను నావలన భార్యాసహితుడై రాముడు అనాధవలే ఇట్లాంటి పడకలపై నిదురించవలసి వచ్చినదికదా! అని మరల ఏడ్వసాగాడు భరతుడు.

.

వూటుకూరు జానకిరామారావు 

.

కామెంట్‌లు లేవు: