రామాయణమ్ 155
...
ఒక అమాయకురాలైన పల్లెపడుచు తన అంతరంగాన్ని ఏ దాపరికమూ లేకుండా ఎలా బహిర్గతపరుస్తుందో అంతగా కల్లాకపటము లేకుండా తమ వివరాలను భిక్షుకవేషధారి అయిన రావణునికి ఎరిగించింది సీతమ్మ!
.
ఓ బ్రాహ్మణుడా ఒక ముహూర్తకాలము నీవు వేచి ఉంటే నా భర్త తీసుకొని వచ్చు రుచికరమైన ఆహారము నీకు ఇవ్వగలదానను ,నీవు నివసింపదలచుకొన్న ఎడల మాతో ఇచ్చటనే ఉండవచ్చును అని పలికింది జానకీదేవి.
.
మరల సీత అతనిని ఉద్దేశించి ,ఓ ద్విజుడా నీ కులము ,గోత్రము,నామధేయము ఎరిగింపుము అని అడిగింది .
.
అందుకు త్రిలోక భయంకరుడైన రావణుడు తీవ్రంగా బదులు పలికినాడు.
.
సీతా ! నేను సకలలోక భయంకరుడైన రాక్షసరాజు రావణుడను ,నా నగరము లంక .అది సముద్రమధ్యమందున్న ఒక పర్వతాగ్రము మీద నిర్మింపబడిన ఒక సుందర నగరము.
.
ఓ సీతా ! నిన్ను కనిన నా కన్నులకు నా భార్యల సౌందర్యమూ ఒక సౌందర్యమేనా అను భావన కలుగుచున్నది .వారివలన ఇక ఎంతమాత్రమూ సుఖము పొందజాలను .నీ అందము మాకందము!
.
ఓ తరుణీ ఎన్నో లోకాలనుండి ఎందరో సుందరాంగులను తెచ్చుకొని సుఖించుచున్న నాకు నీవంటి సౌందర్యరాశి ఇప్పటివరకూ అగుపడలేదు.
.
రా ! నా తో సుఖించు !
.
సర్వాలంకార భూషితలైన అయిదు వందల మంది దాసీజనము నీకు ఊడిగముసేయ సిద్ధముగా ఉన్నారు.
.
రావణుడి ఉన్మత్త ప్రేలాపనలు విన్న సీత ఆగ్రహోదగ్ర అయినది! వానిని నిందిస్తూ పరుషముగా బదులు పలికింది.
.
నా భర్త రాముడు ఎలాంటి వాడనుకొన్నావు?
.
మహేంద్రుడి వంటివాడు ,మహాసముద్రము వలే క్షోభింప శక్యము కాని వాడు....నేను అట్డి రాముని విషయమునందే వ్రతము కలదానను.
.
రాముడు సర్వలక్షణ సంపన్నుడు వటవృక్షము వలే ఆశ్రితులకు సుఖము కలిగించువాడు. సత్యసంధుడు,మహాభాగ్యవంతుడు,
నేను అట్డి రాముని అనుసరించుట అను వ్రతము కలదానను.
.
రాముడు మహాబాహువు ! విశాలవక్షస్థలము కలవాడు నరులలో శ్రేష్ఠుడు! సింహము వంటివాడు ! సింహపునడక కల వాడు.
నేను అట్టి రాముని విషయమునందే వ్రతము కలదానను.
.
నక్కలాంటి నీవు ఏ మాత్రము లభ్యము కాని ఆడుసింహమైన నన్ను కోరుతున్నావు అని అంటూ ఇంకా రావణుని తీవ్రముగా హెచ్చరించసాగింది సీతమ్మ!
.
రామాయణమ్ 156
..............
ఆమె నేత్రాలు క్రోధారుణిమ దాల్చాయి.
రావణునుద్దేశించి ,
నీవు రాముని భార్యను కోరుకుంటున్నావు
నీకు బంగారు వృక్షాలు కనపడుతున్నట్లుగా ఉంది
( మరణ మాసన్న మైన వానికి బంగారు వృక్షాలు కనపడతాయట).
.
రాముని ప్రియసతిని కోరుతున్న నీవు,
.
ఆకలిగొన్న సింహము నోటిలో చేయి దూరుస్తున్న వానిలాగా
మహాసర్పము కోర లాగాలనుకున్న వానిలాగా
మందరపర్వతాన్ని ఒంటి చేయితో లేపాలని చూసే వాని లాగా
కాలకూట విషము త్రాగి బ్రతకాలి అని అనుకునే వాని లాగా
సూదితో కళ్ళు పొడుచుకొనే వాని లాగా
మంగలికత్తిని నాలుకతో నాకే వాని లాగా
గుదిబండను మెడకు కట్టుకొని సముద్రములో ఈద పయత్నించు వానిగా
భగభగ మండే నిప్పుకణాన్ని వస్త్రములో మూట కట్టుకొను వానిగా
కనపడుతున్నావు !
.
నీకూ రామునికి
నక్కకూ సింహానికి ఎంత భేదమో అంత!
రాముడు సముద్రము ,నీవు బోడి కాలువ
రాముడు బంగారము, నీవు సీసము
రాముడు క్షీరము ,నీవు కడుగునీరు
రాముడు మంచి గంధము, నీవు వట్టి బురదవు
రాముడు ఏనుగు, నీవు పిల్లివి
రాముడు గరుడుడు, నీవు ఒక కాకివి
.
నన్ను అపహరించటము ఈగ వజ్రాన్ని మింగటము లాంటిది .
అది వజ్రాన్ని ఇముడ్చుకోగలదా!
.
ఇలా ఆ దుష్ట రావణునితో మాట్లాడుతూ గాలికి ఊగే అరటిచెట్టు లాగా శరీరము వణికి పోతూ తీవ్రమైన వ్యధ చెందింది సీతమ్మతల్లి.
రామాయణమ్ 157
........
సీత హెచ్చరికలను ఏ మాత్రము లక్ష్యపెట్టలేదు రావణుడు .
కుపితుడైనాడు!
కనుబొమలు విరిచి,
ఓ సీతా ! నీకు మంగళమగుగాక !
నేనెవరనుకున్నావు ?
కుబేరుడి సవతి తమ్ముడను!
"రావణుడు "అని లోకములో ప్రసిద్ధికెక్కినవాడను!
.
మృత్యువుకు భయపడి పారిపోవునట్లు జనులందరూ నన్ను చూసి పారిపోవుదురు ! దేవ,గంధర్వ,పతగ,,పన్నగ ,పిశాచులలో ఎవడునూ నా సమీపములోకి రావటానికి సాహసించడు!
.
కుబేరుడిని ఓడించి అతని నగరమును స్వాధీనము చేసుకున్నవాడను "నేను"
.
"నేను" ఉన్నచోట వాయువు భయపడుతూ వీస్తాడు
"నేను" ఉన్నచోట సూర్యుడు తన కిరణతీవ్రత తగ్గించుకుంటాడు.
"నేను" ఉన్నచోట నదులు మందముగా ప్రవహిస్తాయి
"నేను" ఉన్నచోట చెట్లు ఆకులు కదల్చటానికి కూడా భయపడతాయి
"నేను" నేనే !
లేడు నాకెవ్వడునూ సరిసాటి !
.
నా లంక అందాల నెలవంక
అది ఇంద్రుడి అమరావతి!
.
సముద్రమునకు ఆవలి ఒడ్డున ఒక పర్వతాగ్రము మీద ఉన్న సుందరమైన పట్టణమది .
అష్టైశ్వర్యాలతో సకల భోగభాగ్యాలతో తులతూగుతూ వున్న పట్టణమది.
.
అది భయంకరమైన రాక్షసుల నివాస స్థానము!
.
నీవు నాతో కలిసి అక్కడ నివసిస్తే అప్పుడు ఈ మానవులనెవరినీ నీవు ఇక స్మరించలేవు!
.
రాముడసలే నీకు గుర్తురాడు!
.
రాముడు ! అతని పరాక్రమము !
అల్పపరాక్రమవంతుడు కాబట్టే తండ్రి వెళ్ళగొట్టాడు !
దరిద్రుడై ,రాజ్యభ్రష్టుడై కొండలు,కోనలు,అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్నాడు.
.
వాడు దీనుడు!
బుద్ధిహీనుడు
వాడితో నీవేమి సుఖపడతావు!
.
సకలరాక్షసలోకానికి ప్రభువును నేను
మహదైశ్వర్యవంతుడిని నేను
అమిత పరాక్రమశాలిని నేను.
.
ఆ మన్మధ సాయకాలు నా మనస్సును కాల్చివేస్తున్నాయి నీవు నన్ను అనుగ్రహించు!.
.
రాముడు నా వ్రేలికి కూడా యుద్ధములో సరిపోడు అంటూ రామ నింద చేస్తూ ,కామాతూరుడై వదరుతున్న రావణుని చూసి సీత కన్నులు కోపంతో మరింత ఎర్రబారాయి!
.
రావణుని ఉద్దేశించి " కుబేరుడి తమ్ముడను అని చెప్పుకునే నీకు ఈ పాడు బుద్ధి ఎందుకు వచ్చింది? నీవు చేసే ఈ పని వల్ల సమస్త రాక్షసలోకమునకు పోగాలము దాపురించినట్లే,
ఇంద్రుడి భార్యను అపహరించి జీవించగలవేమో కానీ రామపత్నిని అపహరించినచో ఇక నీ ప్రాణములపై ఆశ వదులుకో వలసిందే " అని హెచ్చరించింది సీతాదేవి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి