20/ 10 / 2020 మంగళవారము.
తిథి .
నిజ ఆశ్వీయుజ మాసము శుద్ధ చవితి.
నాలుగవ రోజున అమ్మ వారి అలంకరణ .
శ్రీ మహాలక్ష్మీ దేవి.
నైవేద్యం.
అల్లం గారెలు.
అల్లం గారెలు,
కావలసినవి.
పొట్టు మినపప్పు / మినపగుళ్ళు - రెండు కప్పులు.
అల్లం - 30 గ్రాములు.
పై చెక్కు తీసుకుని ముక్కలు గా చేసుకోవాలి.
పచ్చి మిర్చి - 15
జీలకర్ర - స్పూనున్నర
నూనె - అర కిలో
ఉప్పు - తగినంత .
తయారీ విధానము .
ముందుగా పొట్టు మినపప్పు లేదా మినపగుళ్ళు ఒక ఐదు గంటల పాటు నానబెట్టాలి.
పొట్టు మినపప్పు మూడు నాలుగు సార్లు కడిగి పొట్టు తీసి వేసుకుని పప్పు విడిగా తీసుకోవాలి .
మినపగుళ్ళు అయితే బాగా కడిగి వడ బోసుకోవాలి.
గ్రైండర్ లో వడగట్టిన పప్పును నీళ్ళు పోయకుండా మధ్య మధ్యలో నీళ్ళు చిలుకరించుకుంటూ పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత మిక్సీలో పచ్చిమిరపకాయలు , అల్లం ముక్కలు , జీలకర్ర మరియు తగినంత ఉప్పును వేసుకుని , మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి.
గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని , అందులో మిక్సీ వేసిన అల్లం పచ్చి మిర్చి మిశ్రమమును వేసుకుని చేతితో పిండిని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టుకుని మొత్తం నూనెను పోసుకుని నూనెను పొగలు వచ్చే విధముగా బాగా కాగనివ్వాలి
ఇప్పుడు స్టౌ సెగను మీడియంలో పెట్టు కోవాలి.
ఒక చిన్న అరిటాకును కాని లేదా ఒక చిన్న మైనపు కవరును కాని తీసుకుని ఎమచేతి అర చేతిలో పెట్టుకుని , కుడి చేతితో గిన్నెలోని పిండిని తీసుకుని నిమ్మకాయంత ఉండలా చేసుకుని , తడి చేసుకున్న అరిటాకులో కాని మైనపు కవర్ లో కాని పెట్టుకుని , కుడిచేతితో గుండ్రముగా వత్తుకుని మధ్యలో చిన్న కన్నము చేసుకుని , కాగుతున్న నూనెలో వేయాలి.
ఇలా నాలుగైదు గారెలు చొప్పున వేసుకుని అట్లకాడతో అటూ ఇటూ తిప్పుతూ బంగారు రంగులో వేయించు కోవాలి.
అంతే . ఆశ్వీయుజ మాసము నాలుగవ రోజున శ్రీ మహాలక్ష్మీ దేవి పూజ రోజున మహాలక్ష్మీ దేవి నైవేద్యమునకు అల్లం గారెలు సిద్ధం.
ఇలా అల్లం గారెలు నైవేద్యానికి తయారు చేసుకునే సమయంలో , ఉల్లిపాయను వేయరాదు.
**********
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి