19, అక్టోబర్ 2020, సోమవారం

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 32 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా’ 


అమ్మవారి నామములలో ముఖమండలము వరకు ఉన్నవి చాలా గొప్ప నామములు. ఇక్కడనుండి కిందకి వెళుతూ ఉంటే ప్రతి నామము జీవితానికి సమన్వయము అవుతూ ఉంటుంది. అమ్మా! నువ్వు బంగారముతో చేసిన  అంగదములను, కేయూరములను భుజములకు ధరించి ఉన్నావు. వాటిని ధరించడము వలన భుజములు శోభిల్లుతున్నాయని అర్థము పైకి అనిపిస్తుంది. అమ్మవారు చతుర్బాహు సమన్విత కనక నాలుగు అంగదములు, నాలుగు కేయూరములు కావలసి ఉంటాయి. ఆవిడ అలా ధరించి ఉండటము వలన రెండు ప్రయోజనములు ఉన్నాయి. 

ఒకటి - ఇక్కడ స్తోత్రము అమ్మవారి పాదాది కేశ పర్యంతము చేస్తున్నారు. అమ్మవారి కంఠము దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రశస్తమైన కూటం పూర్తవుతున్నది. ఇక్కడనుంచి మొదలయ్యే నామములు పాదముల వరకు వర్ణన చేస్తూ వెళుతుంటాయి. దానిని లావణ్యలహరి అంటారు. ఇందులో ఏ ఒక్క నామమును విడచి పెట్టకుండా ప్రతిరోజు చదివితే తెలియకుండానే జీవితములో గొప్ప ప్రయోజనము చేకూరుతుంది. తరవాత చాలా గొప్పదైన వైభవలహరి మొదలవుతుంది. 


రెండు – కేవలము భుజములను చూడడము వలన వచ్చే ప్రయోజనము గొప్పది కాదని అనలేక పోయినా దాని అర్థమును సమన్వయము చేసి లోపల నిలపెట్టుకునే ప్రయత్నము చెయ్యడము వలన అమ్మవారి భుజములను మరొక్కమారు సందర్శించ కలుగుతారు. పాదములు అనుకున్న గమ్యమును చేరుస్తాయి. చేతులు అనుకున్న పనిని చేయిస్తాయి. భుజములు అన్నమాటను ఇక్కడ చేతులుగా సమన్వయము చేసుకోవాలి. మనిషి ఆహారము తినేముందు తిన్న తరవాత కూడా చేతులు కడుక్కుంటాడు. ఈశ్వరుడు ఇచ్చిన చేతిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. చేతి కదలికలలో పాప పుణ్యములు ఉన్నాయి. చేసే కర్మకు సూచన చెయ్యి. చేసిన కర్మలు మరిచిపోయినా ఈశ్వరుడు మరచిపోడు.వాటిని మూడు కింద విభజించి ఉంచుతాడు. సంచితము, ఆగామి, ప్రారబ్ధము. ఇవి పట్టుకుంటే అమ్మవారి చేతిని ఎందుకు స్తోత్రము చెయ్యాలో తెలుస్తుంది. ఏ శరీరములో ఉన్నా పాపమో పుణ్యమో ఏదో చేస్తూనే ఉంటారు మన ఖాతాలో ఉంటాయి అది తెలియదు. చేసిన పుణ్య పాపములను అనుభవించమని శరీరము ఇస్తాడు. ఆ అనుభవించేదే ప్రారబ్ధము. శరీరములో ఉండగా భగవంతుని భక్తితో సేవిస్తే వారికి అమ్మవారి అనుగ్రహముతో అప్పటివరకు కొన్ని కోట్ల జన్మలలో సంపాదించిన పాప పుణ్యములు కాలిపోతాయి. మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరము ఉండదు. సంచితము దగ్ధము అవడము వలన ఆ స్థితి వస్తుంది. సంచితము వలన ఆగామి పోతుంది. చేతి కదలికలు పాప పుణ్యములకు, ద్వందములకు హేతువులు. మనసు ఎలా ప్రకోపము చెందితే అలా ఆడుతూ ఉంటుంది. ఆడిన కొద్దీ పాప పుణ్యములు పడుతూ ఉంటాయి. అలా పడకుండా ఎప్పుడూ నిభాయించి ఉండేట్టుగా మనసుని మార్చకలిగినది అమ్మవారి చెయ్యి. ఈ చేతులు మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరము లేని రీతిలో పని చెయ్యాలి అంటే అమ్మవారి అనుగ్రహము ఉండాలని సమన్వయము చేసుకుంటే అమ్మవారి చేతులకి పెట్టిన భూషణముల గురించి తెలిసినట్టు అర్థము. 


అమ్మవారి భుజములకు రక్షణ ఒక్కటే తెలుసు. అది అర్థమయితే ఆనాడు భూషణము పెట్టుకున్న వారు అవుతారు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

కామెంట్‌లు లేవు: