🗣 *శ్రీ ఆది శంకరాచార్యుల వారి " భజగోవిందం"*
కష్టపడకుండా హాయిగా జీవించాలని, లేదా తక్కువ పనిచేసి ఎక్కువ లాభం పొందాలని మానవులు సహజంగా భావిస్తుంటారు. ఇట్టివారు ఈ రోజుల్లోనే గాక ఆ రోజుల్లో కూడా ఉండేవారని ఈ శ్లోకం వల్ల తెలుస్తుంది. సర్వసంగ పరిత్యాగుల్లాగా వేషాలు వేసుకొని - మోసాలు చేస్తూ, పొట్ట నింపుకొనే వారిని గురించి వర్ణించారీ శ్లోకంలో.
- కొందరు జుట్టు పెంచుకొని జడలు కట్టించి తిరుగుతారు.
- కొందరు నున్నగా గుండు గీయించుకొని తిరుగుతూ ఉంటారు.
- కొందరు తలపై గల వెంట్రుకలను పీకివేసి తిరుగుతారు.
- కొందరు కాషాయ వస్త్రాలను ధరించి తిరుగుతూ ఉంటారు.
ఈ వేషాలన్నీ నిజంగా సర్వసంగ పరిత్యాగులవి - సన్యాసులవి. అయితే ఈ వేషాలు వేసేవారందరూ నిజమైన సన్యాసులు కాదు. ఇందులో కొందరు పొట్టకూటి కోసం మాత్రమే ఈ వేషాలు వేస్తారు.
నిజమైన సన్యాసులు ప్రాపంచిక విషయాలను వదలిపెట్టి, జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకొని, దానిని సాధించటానికి సాధనలు చేస్తుంటారు. నిరంతరం పరమాత్మకు సంబంధించిన విషయాలను శాస్త్రాల ద్వారా - గురువుల ద్వారా తెలుసుకుంటూ, శిష్యులకు బోధిస్తూ, ఆ విషయాలనే విచారణచేస్తూ ఉంటారు. ధ్యానిస్తూ ఉంటారు. అట్టివారు దేహ పోషణకు ప్రాధాన్యత నివ్వరు. అలాంటి వారికి సమాజంలో ఎంతో గౌరవముంటుంది. వారిని మహాత్ములుగా పరిగణించి, పిలిచి అన్నం పెట్టి తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తారు గృహస్థులు.
అలాంటి గౌరవమర్యాదలు పొందాలన్నా, కడుపునిండా కమ్మని తిండి దొరకాలన్నా ఆ వేషాలు వేయాలనుకుంటారు కొందరు సోమరులు. ఐతే అట్టివారు చూస్తూ కూడా చూడనివారే. అంటే ఈ మోసగాళ్ళు కూడా భగవంతునికి సంబంధించిన మాటలు మాట్లాడుతారు. వేదాలు - ఉపనిషత్తులలో తెలిపిన విషయాల్లో రెండు మూడింటిని బండగుర్తులు పెట్టుకొని, అక్కడక్కడ కంఠస్థం చేసి, కొన్ని కొన్ని పదాలను పుక్కిట పట్టి ఉపన్యాసాలిస్తూ మధ్య మధ్య ఆ శ్లోకాలను వల్లె వేస్తుంటారు. ఇవి గనుక అసలు చేయకపోతే వాళ్ళ బండారం బయటపడుతుంది. అందువల్ల వారు కూడా ముఖంపై ప్రశాంతతను పులుముకొని మహాత్ములలాగా ఫోజ్ ఇస్తూ భగవత్తత్త్వాన్ని గురించి అనర్గళంగా బోధిస్తారు. అయితే వారు చెప్పే విషయాల యొక్క అంతరార్థాన్ని వారెన్నడూ విచారణ చేయరు, ఆ విషయాలను ఆచరించరు. వారికి ఎటువంటి అనుభూతి కూడా ఉండదు, అందుకే వారిని మూఢులు అనటం.
*సేకరణ :* : భజగోవిందం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి