మహాభారతము ' ...54.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
సభా పర్వం..
ధర్మరాజు యే సమాధానమూ చెప్పకబోవడంతో, ప్రాతికామి దిక్కుతోచక అలా వుండి పోయాడు. ఈ ఆలశ్యాన్ని దుర్యోధనుడు భరించలేక ' ప్రాతికామీ ! ఆ ప్రశ్న ఏదో ఆమెను యిక్కడికే వచ్చి అడగమని మామాటగా చెప్పు. సభ కూడా స్పందిస్తుంది . ధర్మజుడూ వుత్తరమిస్తాడు. ' అని అసహనంగా అన్నాడు. ద్రౌపది వద్దకు వెళ్లి మళ్ళీ తిరిగివచ్చి ప్రాతికామి, ' కనీసం పెద్దలనైనా తన సందేహనివృత్తి చెయ్యమని అడగమన్నది, ద్రౌపది ' అన్నాడు. పెద్దలుకూడా తలలువంచుకుని కూర్చున్నారు. ధర్మ మీమాంసను విప్పలేక.
ఇక దుర్యోధనుడు, ద్రౌపది సభకు వచ్చేదాకా పట్టుబడుతూనే వుంటాడని ధర్మజుడు గ్రహించి, వేరొక దూత ద్వారా ' ద్రౌపదీ ! నీవు ఏకవస్త్రవై, రజస్వలవైవున్నా నీవు, నీ మామ ధృతరాష్ట్రుని ముందు వున్నపళంగా వచ్చినిలువు. ఆకారణంగా సభికులందరి ముందూ దుర్యోధనుడు దోషిగా నిలబడతాడు. ' అని నర్మగర్భంగా ఆమెను సభకు రమ్మని వర్తమానం పంపాడు.
ధర్మరాజు ఆవిధంగా పంపిన వర్తమానం వలన ద్రౌపదికి, తనను ధర్మరాజు జూదంలో వోడలేదని అర్ధమైంది. ఆమెను జూదంలో వోడివుంటే, ఆ వర్తమానం పంపే అధికారం ఆయనకు వుండదుకదా ! ఆమె అపరాజిత కనుక ఆమెకు రక్షణ, సభలోనే జరుగు తుందని ఆవిధంగా వర్తమానం పంపినట్లుగా ద్రౌపది గ్రహించింది.
ఇదంతా గమనిస్తున్న దుర్యోధనునికి అసహనం అంతకంతకూ పెరిగిపోతున్నది. ప్రాతికామి వలన యీపనికాదని గ్రహించి, ' దుశ్శాసనా ! ఈ ప్రాతికామి, భీమునిచూసి భయపడుతున్నాడు. నువ్వు వెళ్లి ద్రౌపదిని తీసుకునిరా !. పాండవులు మనభృత్యులు. వారిని చూసి భయపడవలసిన పనిలేదు. ' అని తమ్ముని పంపించాడు ద్రౌపదివద్దకు.
ఇదే అదనుగా, దుశ్శాసనుడు వేగంగా ద్రౌపది దగ్గరకువెళ్లి, వెటకారపూరిత సంభాషణలతో, ఆమెను దుర్యోధనునివద్దకు రమ్మని పిలిచాడు. ద్రౌపది భయపడి, దూరంగా వున్న అంత:పురకాంతలను జేరడానికి పోబోతుండగా, రాజసూయయాగంలో అవభృతస్నానం తో పవిత్రమైన ఆమె కేశాలను, మూర్ఖుడు, దుర్మార్గుడు, అహంకారి ఐన దుశ్శాసనుడు గట్టిగా పట్టుకుని, ఆమెను ఏకవస్త్రను, బరబరా సభాస్థలికి ఈడ్చుకు పోయాడు.
' ఓరీ దుష్టుడా ! నేను ఏకవస్త్రను. రజస్వలను. సభలోకి రాకూడదు. అని పదే పదే ద్రౌపది అరుస్తూ తప్పించుకోజూసినా, ఆ దుర్మార్గుడికి జాలి కలుగలేదు. పైగా ' నీవు ఏకవస్త్రవైనా, రజస్వలవైనా, వివస్త్రవైనా, నాకు సంబంధం లేదు. నీవు జూదక్రీడ ద్వారా మాకుదాసీవి అయినావు. మా దాసీజనంలో నీవూ ఒకదానివి. అన్నగారి ఆజ్ఞ పాటించడమే నా తక్షణ కర్తవ్యం . ' అని ఆమె మాటను లెక్కజెయ్యకుండా, సభా మంటపానికి ఈడ్చుకుని వచ్చాడు. పాండవులు క్రోధంతో, అశక్తతతో కంపించిపోయారు. వారి రక్తం లావాలా వుడుకుతున్నది. వారిని రెచ్చగొట్టాలని, దుశ్శాసనుడు పదే పదే ' దాసీ దాసీ ' అంటూ సభలో అన్ని దిక్కులా ఆమెను ఈడ్చసాగాడు.
ద్రౌపది సభలో యెలుగెత్తి యేడ్చింది. మరియొకసారి సభికులందరినీ చూస్తూ, ' నేను ధర్మ విజితనా అధర్మ విజితనా ! సభలోని పెద్దలు చెప్పండి. ' అని ఆక్రోశించింది. అప్పుడు భీష్ముడు ' అమ్మా ! ద్రౌపదీ! ఈవిషయం సూక్ష్మమైన ధర్మంతో ముడిపడి వున్నది. సతి యెప్పుడూ పతి ఆధీనంలో వున్నదే కాబట్టి, ధర్మజుడు తనను తాను ఓడినప్పుడు, నిన్ను నీవుకూడా ఓడిపోయినట్లే. ఇంకోరకంగా ధర్మజుడు తాను ఓడిన తరువాత, నిన్ను పణంగా పెట్టే అర్హత కోల్పోయాడు. అందువలన యే విధంగా తేల్చలేని సంకటంలో పడ్డాము. ' అన్నాడు.
' ధర్మజుడు యెప్పుడూ అధర్మవర్తనుడు కాదు. నా భర్తలను నేను కీర్తిస్తాను కానీ దోషాలు యెత్తిచూపను. ఈ కపటనాటకానికి, యీ అధర్మ జూదక్రీడకు ఆద్యులు యెవరు ? ఎవరు ధర్మజుని ప్రోత్సహించింది ? ఎందుకు ఇంత అకృత్యానికి ఒడిగట్టారు ? ఇంతమంది పెద్దలు వున్నారు. అందరికీ కుమారులూ, కోడళ్ళూ వున్నారు. ఇలా యే యింటి కోడలుకైనా అవమానం జరుగుతుందా ? ఈ సభలో ధర్మం చెప్పగలవారే లేరా ? '
' ఎక్కడ జ్ఞానవృద్ధులు లేరో అది సభకాదు. ఇక్కడ జరుగుతున్నది కపటనాటకం. ఇక్కడ సత్యం లేదు. ' అంటూ ద్రౌపది పాండవుల వైపు గద్గద స్వరంతో, దుఃఖిస్తూ చూసింది. అయినా దుశ్శాసనుడు దుర్భాషలు ఆడుతూనే వున్నాడు. ఇదంతా చూస్తున్న భీమసేనుడు కంపించిపోయాడు రౌద్రంతో. ఎటూ పాలుపోక, అన్నగారైన ధర్మజుని కఠిన పదజాలంతో దూషించాడు. అయితే, అర్జునుడు భీముని వారించాడు. ' ధర్మనిష్ట తో వుండే ధర్మరాజును నిందించడం న్యాయంకాదు ' అన్నాడు.
పాండవుల దీనస్థితి చూసి, పెద్దలెవరూ సరిఅయిన సమాధానం యిచ్చి ధర్మనిర్ణయం చేయనందుకు, గజాయివనంలో తులసిమొక్కలాగా, ధృతరాష్ట్రుని నూరుగురు కుమారులలో ఒకడైన వికర్ణుడు సూటిగా తన అభిప్రాయం చెప్పాడు. ' రాజ్యాన్ని పాలించే రాజుకు వేట, మద్యపానం, జూదం కామభోగానురక్తి, అనే నాలుగు వ్యసనాలు తప్పకుండా వుంటాయి. వారికి ధర్మముకంటె, ఆ వ్యసన సంతృప్తిలోనే ఆనందం వుంటుంది. ధర్మజుని యీ బలహీనతనే శకుని వుపయోగించుకున్నాడు. ఆమె అయిదుగురు పాండవులకు భార్య. కాబట్టి, ధర్మజునికి ఆమెను పణంగా వొడ్డె అధికారం లేదు. ధర్మజుని తాను ఓడిపోయిన తరువాత, ద్రౌపదిని పందెంలో వొడ్దమని రెచ్చగొట్టింది శకుని. అందువలన ఆమె ధర్మవిజిత కాదు. ఆమె వీరికి దాసీకాదు. ' అని చెప్పాడు.
సభికులందరూ అతనిమాటలకు సంతోషించి కరతాళధ్వనులు చేశారు. అయితే, కర్ణుడు వెంటనే లేచి, వికర్ణుని వద్దకువచ్చి, ' నీ వయసుకూడా మర్చిపోయి, పెద్ద పెద్ద విషయాలు చర్చిస్తున్నావు, సభలో, నీదైన బాల్యచేష్టలతో. నిజంగా ఇది అధర్మమైతే, భీష్మ, ద్రోణులలాంటి పెద్దలు మెదలకుండా వుంటారా ? క్రీడ జరుగుతున్నప్పుడే అభ్యంతరం పెట్టేవారు కదా ! స్త్రీకి ఒకేభర్త వుండాలి. అందుకు విరుద్ధంగా ఈమెకు అయిదుగురు భర్తలున్నారు. ఈమె నిశ్చయంగా సామాన్య గృహిణికి భిన్నంగా వున్నది. ఈమె ఏకవస్త్ర అయినా, వివస్త్ర అయినా సభకు తీసుకురావడంలో విచిత్రమేమీ లేదు. నీవు కౌరవకులంలో పుట్టి నీఅన్నగారు చేసిన దానికే ఆక్షేపణ తెలుపుతున్నావా ? ' అని వికర్ణుని కూర్చుండబెట్టి, .కర్ణుడు దుశ్శాసనుని వైపు తిరిగి ' వికర్ణుడు బాలుడు. అతని మాటను లెక్కచెయ్యవద్దు. త్వరగా, పాండవులనూ, ద్రౌపదిని వివస్త్రులను చెయ్యి. ' అని సలహా ఇచ్చాడు.
ఈ విధముగా ద్రౌపది వస్త్రాపహరణా ఘట్టానికి అంకురార్పణ చేసింది కర్ణుడే. అప్పటి వరకు యెవరికీ అటువైపు ఆలోచన రాలేదు. కేవలం సభలోకి తీసుకుని వచ్చి అవమానించడమే అప్పటి వరకు దుర్యోధనాదుల వుద్దేశ్యం. ఆ విధంగా శకుని కపట జూయడానికి తెరదీస్తే, కర్ణుడు ద్రౌపదీ వస్త్రాపహరణానికి బీజం వేశాడు.
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.
తీర్థాల రవి శర్మ.
9989692844
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి