19, అక్టోబర్ 2020, సోమవారం

 గురువు తప్ప మరొక గతి లేదు అనేది అర్థమై, ఆచరించ గలిగితే అసాధ్యం లేదు. గురువు నీ చేతిని పట్టుకోవాలని అంటే ఆ అర్హతను నువ్వు సాధించుకోవాలి

గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే.

అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు గురువు. అందులోనూ సందేహం లేదు.

అయితే గురువు ప్రసరించే ప్రేమ శక్తిని అందుకునే స్థాయి శిష్యునికి వుండాలి. అదెలా వస్తుంది?

గురువు మాత్రమే తనను ఉద్ధరించ గలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి వుండటమే ఆ స్థాయిని అందిస్తుంది. కానీ మనం ఏమి చేస్తున్నాం?

ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువును ఆశ్రయంచి ఉంటున్నాం. ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు. తీరకపోతే మరో గురువు. ఇలా కొట్టుకు పోతున్నాం.

గురువు నీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఆ శక్తి గురువులో వుందని నువ్వు మనసా, వాచా, కర్మణా నమ్మాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.

సేవాభావం వల్లనూ మరియూ సర్వస్వ శరణాగతి వల్లనూ గురువు ప్రసన్నుడు అవుతాడు.*

కనుక నువ్వు ఎప్పుడు గురువే సర్వస్వం అని నమ్ము అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు.

నమ్మకం అచంచలంగా వుందా నీలో? ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి.

గురువు మార్గాన్ని చూపిస్తాడు…ఆ మార్గంలో నడవటం నీ పని. గురువు జ్ఞానాన్ని అందిస్తాడు…ఆ జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవటం నీ పని. గురువు ప్రేమని ప్రసరిస్తాడు…ఆ ప్రేమని నీలో నింపుకోవడం నీ పని. 

గురువు దగ్గరకి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని, నీ తెలివితేటలను పక్కనపెట్టి వెళ్ళాలి. గురువుతో వాదన పనికిరాదు.


గురువు చెప్పే మాటలను చెవులతో కాదు…మనసుతో వినాలి. గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని, ఇతర చింతనలు లేకుండా నమ్మాలి.

గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరచి సమర్పించాలి. గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకొని వినాలి. గురువును ఏదైనా కోరేటప్పుడు కొంగు చాచి అడగాలి.


ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడు అవుతాడు.

గురుకృప ఏ వ్యక్తినైనా కూడా గురు స్థానంలో నిలుపుతుంది. అయితే ఆ వ్యక్తి తనకు గురుత్వ స్థాయిని కోరుకొని చేశాడా? కానే కాదు. తన ఆత్మోన్నతి కోసమే చేస్తాడు. అది సఫలం అయినప్పుడు గురువే ఆ వ్యక్తిని తన పరికరంగా ఆయుధంగా లోకానికి సమర్పించి , ఆ వ్యక్తిని గురువుగా నిలుపుతాడు. తన పరికరంగా , తన బాధ్యతలను ఆ వ్యక్తి ద్వారా నెరవేరుస్తారు. (శ్రీ దత్తుడు – విష్ణుదత్తుని వలె )


నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు అనుక్షణమూ నీకు అక్షరాభ్యాసమే

నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో వుండవచ్చు. కానీ గురువు ముందు నువ్వు కేవలం ఒక సేవకుడివే.

నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు నిరుపేదవే. నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు. కానీ గురువు ముందు పరమ అజ్ఞానివే.

నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యత గా మిగులుతుంది. సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనం గా మిగులుతుంది.

నీ ధన సంపద అంతా గురు చరణ ధూళిని కూడా తాకలేదు. నీ లౌకిక జ్ఞానం సమస్తం గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డి గవ్వకు కూడా పనికిరాదు

ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకో గలిగితే గురువు నీ వాడు అవుతాడు.

కామెంట్‌లు లేవు: