17, అక్టోబర్ 2020, శనివారం

ధనము..వైరాగ్య

 *ధనైర్వా ధనదైః పుత్ర దారాగార సహోధరైః*

*ధ్రువం ప్రాణహరైః దుఃఖం ఇతి వేదాంత డిండిమః*

ధనము, ధనమును సంపాదించే ఉపాయములు సోదరులు, పుత్రులు, భార్య, గృహము మొదలయినవి ప్రాణాంతకమగు దుఃఖమునే కలిగించును. అని వేదాంతభేరి మ్రోగుచున్నది.


1. వైరాగ్య భావననతోనో, అదే లక్ష్యంగానో సాంసారిక జీవితాన్ని త్యజించడం సన్న్యాసం. వైరాగ్య తీవ్రతను మూడు స్థాయిలుగా విభజించారు. మొదటిది మంద వైరాగ్యం. రెండవది తీవ్ర వైరాగ్యం. మూడవది తీవ్రతర వైరాగ్యం. గృహ సంబంధమైన సమస్యలను తట్టుకొనలేక సన్న్యసించడం మంద వైరాగ్యం. దారేషణ, పుత్రేషణ, ధనేషణ అనే ఈషణ త్రయాన్ని వదలిన సన్న్యాసి తీవ్రుడు. కర్మకాండలో చెప్పిన విధి విధానాలు నిష్ప్రయోజనమని విడిచిపెట్టిన వాడు తీవ్రతరుడు.

2. నాలుగు విధాలనీ, ఆరు విధాలనీ సన్న్యాసంలో రెండు వర్గీకరణలు ఉన్నాయి. వైరాగ్య తీవ్రతను బట్టి వర్గీకరణ జరిగిన మొదటి విధానంలో నాలుగు ఇవీ : 1. కుటీచకం, 2. బహూదకం, 3. హంస సన్న్యాసం, 4. పరమ హంస సన్న్యాసం. ఇందులో కుటీచకం, బహూదకం తీవ్ర వైరాగ్యం వల్ల తీసుకొనే సన్న్యాసాలు. సంచారం చేసే శక్తిలేని సన్న్యాసి ఊరివెలుపలో, ఏదైనా ఒక నదీ తీరంలోనో మఠాన్ని ఏర్పరచుకొని, కాషాయాంబరాలు కట్టి, దండ కమండలాలు ధరించి స్వయంగా ఆహారాన్ని సంపాదించుకొనే సన్న్యాసి కుటీచకుడు. పుణ్య తీర్థాలను, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తూ ఎక్కడా ఆరు రోజుల కంటె ఎక్కువ కాలం గడపక సంచారం చేస్తుండే సన్న్యాసి బహూదకుడు. తీవ్రతర వైరాగ్యం కలిగిన సన్న్యాసులు హంసలు, పరమహంసలు. హంసలు ఆచార విహితమైన మార్గంలో సన్న్యాస వ్రతం కొనసాగిస్తారు. పరమ హంసలు బ్రహ్మజ్ఞానం సంపాదించాలనే జిజ్ఞాస కలిగి తీవ్ర సాధన చేస్తుంటారు. ఒక జీవిత కాలం సాధనలో కృతకృత్యులు కాలేని పరమ హంసలు తిరిగి జన్మలు ఎత్తి సాధన కొనసాగించి గమ్యం చేరుతుంటారని అంటారు. రెండవ వర్గీకరణలో మొదటి నాలుగు గాక, తురీయాతీత (5), అవధూత (6) అనే వ్యవస్థలు ఉన్నాయి.

మరో విభజన ప్రకారం ఆరు విధాలు ఇవీ : 1. కర్మఫల సన్న్యాసం/ కర్మ సన్న్యాసం. 2. వైరాగ్య సన్న్యాసం/ జ్ఞాన సన్న్యాసం/ జ్ఞాన వైరాగ్య సన్న్యాసం. 3. ఆతుర సన్న్యాసం/ క్రమ సన్న్యాసం. 4. వివిదిషా సన్న్యాసం/ విద్వత్సన్న్యాసం. 5. కర్మైక దేశ సన్న్యాసం/ పరమార్థ సన్న్యాసం. 6. గౌణ సన్న్యాసం. చివరిదైన గౌణంలో బ్రాహ్మణేతరులూ, స్త్రీలూ కూడా సన్న్యాసం స్వీకరించవచ్చు. పురాణ కాలంలోనూ ఇలా బ్రాహ్మణేతరులు సన్న్యాసం తీసుకోవడం ఉంది. ఉదాహరణకు విదురుడు ఇలా సన్న్యాసం తీసుకొన్నవాడే. (సన్న్యాస పదాన్ని రెండు మూడు విధాలుగా వ్రాయవచ్చు. ప్రామాణిక గ్రంథాలలో ‘సన్న్యాసం’ అని ఉంటుంది. ‘సంన్యాసం’ అనీ, ‘సన్యాసం’ అనీ వ్రాసినవారు పలువురు ఉన్నారు. కనుక ఇలా వ్రాయడం తప్పు కాదు. వాడుకలో సన్యాసం, సన్యాసి పదాలే ఇరవయ్యో శతాబ్దాంతానికి స్థిరపడ్డాయి.)

కామెంట్‌లు లేవు: