దేవీనవరాత్రులు - స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
మనకి ఆశ్వయుజమాసంలో వచ్చేటటువంటి పాడ్యమి నుంచి నవమి వరకు కూడా మనము ఆ తల్లిని వివిధ రూపాలలో ఆరాధన చేస్తాము. ఉన్నది ఆ ఒక్క తల్లి అయినప్పటికీ మక్కువ తీరక ఒక తల్లి తన పిల్లలకి చిన్న తనంలో అనేక రకాలుగా అలంకరించి ఎలా మురిసిపోతుందో మనము కూడా ఆ తల్లిని వివిధ రూపాలలో ప్రేమతోటి, భక్తితోటి ఆరాధన చేస్తాము. ఆ తల్లి యొక్క కటాక్ష వీక్షణముల కోసం అందరం పరితపిస్తాము.
మనకి మన తెలుగు రాష్ట్రాలలో మకుటాయమానమైన అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి. అందులో ఓరుగల్లులో ఉన్న భద్రకాళి అమ్మవారి దేవాలయం, శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా తల్లి, అలంపురం లో ఉన్న జోగులాంబ అలాగే ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న మన చల్లని తల్లి దుర్గమ్మ. ఆయా దేవాలయాల ఆగమాన్ని బట్టి ఆ తల్లి ఏ కల్పం ప్రకారం పూజింపబడుతుందో ఆయా దేవాలయాలలో ఆ చల్లని తల్లులకు వివిధ రకాలైన అలంకరణలు చేసి ఆ తల్లి కృపకు పాత్రులం అవుతాము.
సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజించినట్లైతే సంవత్సరం మొదలు చైత్ర శుక్ల పాడ్యమి వసంత నవరాత్రులతో ఆరంభిస్తాము. అలాగే సరిగ్గా సంవత్సర మధ్య కాలాన్ని మనం తీసుకున్నట్లైతే ఆశ్వయుజ మాసం ఆరు నెలలు పూర్తి అయిన తరువాత వచ్చే మాసం సంవత్సరం మొదలు మరియు ఆరు నెలలు పూర్తి అయిన తరువాత మొదలయ్యే మొదటి రోజు ఆశ్వయుజమాస శుక్ల పాడ్యమి అంటే, ఆ తల్లి కృపతోటే ఆరాధనలోనే మనము సంవత్సరాన్ని మొదలు పెడతాము. అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాణ్డె నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వేంకటేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.
మనకు మొదటి రోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన ఆ కనకదుర్గను స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించి ఆ తల్లి యొక్క బంగారు చూపులు మనపై కురవాలని ఆ తల్లి ఆరాధన చేస్తాము. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి రోజు కలశస్థాపన పూజ, అభిషేకాలు అయిన తరువాత ఆ తల్లిని అలంకరిస్తారు. ఇలా అలంకరించడానికి కారణం ఇదివరకు కాకతీయులు ఏ విధంగా అయితే మన ఓరుగల్లును (ఇప్పటి వరంగల్లు) పరిపాలించారో అలాగే ఈ ఇంద్రకీలాద్రికి విష్ణుకుండిన రాజులు పారిపాలించేవారు. వారు అందరూ కూడా అమ్మవారి భక్తులు. కాబట్టి ధర్మ పరిపాలన చేస్తూ ప్రజలను కన్న బిడ్డలలాగా పరిపాలించేవారు. వారిలో చాలా మంది పేర్లు మాధవ వర్మ. మాధవ వర్మ కుమారుడు రధాన్ని అతివేగంగా నడిపిస్తూ ఉండగా ఆ వీధిలోనే ఒక పేదరాలు అయిన స్త్రీ తన బిడ్డడిని చంకలో పెట్టుకుని నడుచుకుంటూ వెళుతూ ఉండగా రాకుమారుడి యొక్క రధ వేగానికి ఆవిడ చేతిలోని బిడ్డడు క్రిందపడి ప్రాణాలు విడిచి పెడతాడు. ఇది చూసిన స్థానికులందరూ రాజు వద్దకు వెళ్లి యువరాజు చేసిన పని చెప్పగానే అతడు ధర్మనిరతి ఉన్నటువంటి రాజు కాబట్టి వెంటనే తన బిడ్డడు అని కూడా చూడకుండా మరణదండన విధిస్తాడు. తన బిడ్డడు చేసిన పనికి మనసు చలించి అమ్మకు మొరపెట్టుకున్నాడు. మాధవ వర్మ ధర్మనిరతికి సంతసించిన ఆ తల్లి ఒక క్షణకాలం పాటు కనకవర్షం కురిపించడమే కాకుండా ఆ పేదరాలి యొక్క కుమారుడిని రాజు యొక్క కుమారుడిని కూడా రక్షించింది. ఆ తల్లి తలచుకుంటే ఎంత సేపు? ఏదైనా అనుగ్రహించగలిగిన మహారాగ్ని ఆ తల్లి. అందుకనే ఆ తల్లిని ఈ రోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించుకుని ఆ తల్లి కృపను కోరుకుంటాము. అసలే బంగారు తల్లి. దానికి తోడు అలంకరణ స్వర్ణమయం. ఇక ఆ తల్లి బంగారు కాంతులలో మనము తడిసి ముద్దవ్వాల్సిందే. ఆ తల్లి కటాక్షం మనకందరికీ ఉండాలి.
"అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే".
సర్వేజనా సుఖినోభవంతు.
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి
8886240088
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి